ఒంగోలు: కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు...చివరకు ఉపాధిని సైతం దూరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వివిధ కార్పొరేషన్ల కింద స్వయం ఉపాధికి ఇచ్చే రుణాలను తాము ఇస్తామన్నా తీసుకునేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదంటూ కొత్తపాట పాడుతోంది. ఆంక్షల మీద ఆంక్షలు విధిస్తూ స్వయం ఉపాధి కోసం ఆరాటపడుతున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఫిబ్రవరి 10వ తేదీలోగా యూనిట్ స్థాపించకపోతే అకౌంట్‌కు జమ చేసిన సబ్సిడీ మొత్తం కూడా రద్దు చేస్తామంటూ ఆదేశించింది. ఇక వ్యవసాయంపై రాబడి చాలక కనీసం పశుపోషణ ద్వారా అయినా గట్టెక్కుదామనుకున్న పల్లె ప్రజలు ఈనెల 7 మొదలు 22వ తేదీ వరకు మూడు దశల్లో యుటిలైజేషన్ సర్టిఫికెట్లు దాఖలు చేయాలని, లేకుంటే రుణాలు రద్దు చేస్తామని జిల్లా యంత్రాంగం హెచ్చరిస్తోంది.
లక్ష్యం కన్నా తక్కువగా మంజూరు
ఉత్తర్వులు: ఒక వైపు ఉద్యోగం రాక..ఉపాధి కోసం విలవిల్లాడుతున్న జనానికి జిల్లాలో కొదువలేదు. అయితే జిల్లా అధికారులు మాత్రం నిరుద్యోగులు తక్కువగా రావడం వల్లే అనుకున్న మేరకు లక్ష్యాన్ని సాధించలేకపోయామని 2016–17లో చెప్పుకొచ్చారు. కానీ 7472 మందికి రుణాలు పెండింగ్‌లోనే ఉండిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అయితే 16,874 మందికి రుణాలు ఇవ్వాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి గాను 60,270 మంది దరఖాస్తు చేసుకుని రుణ మేళాకు హాజరయ్యారు. కేవలం 72 గంటల్లో రుణాలను పరిష్కరిస్తామన్న అధికారులు మాట తప్పారు. ఈ దశలో కేవలం 15,404 మందిని మాత్రమే రుణాలకు అర్హులుగా పేర్కొన్నారు.
ఎస్సీలు 22,233 మంది హాజరుకాగా ఎంపిక చేసిన వారి సంఖ్య కేవలం 7953, ఎస్టీలలో 4520 మందికిగాను 481, బీసీలలో 18,790 మందికిగాను 2654, కాపులలో 10,043 మందికిగాను 3,305 మందికి, మైనార్టీలలో 4606 మందికి 968 మందికి, క్రిస్టియన్ మైనార్టీలో 78 మందికిగాను 43 మందికి మాత్రమే మంజూరు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంటే హాజరైన వారిలో కేవలం పాతిక శాతం మందిని మాత్రమే అర్హులుగా చేశారు. మరి..మిగిలిన 75 శాతం మందిని ఎందుకు తిరస్కరించారో అధికార యంత్రాంగానికే తెలియాలి. వారిలో కూడా ఇప్పటి వరకు 2448 మందికి మాత్రమే రుణాలు మంజూరు చేశారు. ఇంకా 12,956 మందికి రుణాలు మంజూరు చేయాల్సి ఉంది.
రోజురోజుకూ పెరుగుతున్న సమస్యలు: గ్రామాల్లో మాత్రమే నోఅబ్జక్షన్ సర్టిఫికెట్లు తీసుకోవాలనే నిబంధన ఉందని బ్యాంకర్లే చెబుతున్నారు. కానీ పట్టణం మొదలు పల్లెల్లో సైతం కనీసంగా 7 నుంచి పది బ్యాంకుల పేర్లు ఇచ్చి ఆ బ్యాంకు అధికారులతో సంతకాలు చేయించుకు రావాలని ఆదేశిస్తున్నారు. ఆ సర్టిఫికెట్ల కోసమే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పీడీసీసీ బ్యాంకులో అయితే తమకు అభ్యంతరం లేదంటూ సర్టిఫై చేసేందుకు రూ.50ల చొప్పున చలానా సైతం కట్టించుకున్నారు. పలువురు బ్యాంకర్లు నోఅబ్జక్షన్ సర్టిఫై చేసేందుకు జాప్యం చేస్తుండడంతో లబ్ధిదారులు బ్యాంకుల చుట్టూ తిరగక తప్పడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment