
ఒంగోలు కల్చరల్: భారతీయం కళార్చనలో భాగంగా బుధవారం రాత్రి స్థానిక పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ప్రదర్శించిన సాంఘిక నాటికలు సామాజిక స్పృహను చాటిచెప్పాయి. యంగ్ థియేటర్స్, విజయవాడ కళాకారులు ప్రదర్శించిన ‘దేవుడ్ని చంపిన మనిషి’ నాటిక నేటి మానవుడు పర్యావరణ విరోధిగా ఎలా మారుతున్నాడో చాటిచెప్పింది. జీవరాశిలో విజ్ఞాన ధనుడిగా మానవుడిని భగవంతుడు సృష్టించాడని అయితే నేడు మనిషి పెడ పోకడలతో అందమైన జగత్తును నాశనం చేస్తూ దైవాంతకునిగా మారుతున్నాడని, ఇది ప్రపంచానికి తీరని ముప్పని ఈ నాటిక హెచ్చరించింది. భాస్కర చంద్ర రచించిన ఈ నాటికకు శశి భాగ్యారావు దర్శకత్వం వహించారు.
సాయి ఆర్ట్స్, ఒంగోలు ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘నిర్లక్ష్యం ఖరీదు’ బాలల నాటిక ఎయిడ్స్, హెచ్‌ఐవీ మూలంగా జరిగే అనర్థాలను తెలియజెప్పింది. కె.వెంకటేశ్వరరావు రచించిన ఈ నాటికకు ఎస్‌కే రసూల్ దర్శకత్వం వహించారు. చింతలపాలెం కోలాట భజన బృందం కళాకారుల ప్రదర్శన ఆహూతులను ఆకట్టుకుంది. చిన్నారుల నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. నాటకోత్సవంలో భాగంగా గురువారం సాయంత్రం ‘శ్రీకృష్ణ భీమసేనం’ పద్య నాటక ప్రదర్శన, కళారూపాల ప్రదర్శన ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. కళాపరిషత్ ఉత్సవాల్లో స్టాల్స్ ఏర్పాటు బుధవారం ప్రారంభమైంది. చేనేత వస్త్రాలు, రెడీమేడ్ దుస్తుల దుకాణాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. చీరలు నేసేందుకు ఉపయోగించే మగ్గాన్ని పలువురు ఆసక్తిగా తిలకించారు.
Comments
Please login to add a commentAdd a comment