PVR Boys High School Ground
-
పెడ పోకడలతో జగతికి విపత్తు
ఒంగోలు కల్చరల్: భారతీయం కళార్చనలో భాగంగా బుధవారం రాత్రి స్థానిక పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ప్రదర్శించిన సాంఘిక నాటికలు సామాజిక స్పృహను చాటిచెప్పాయి. యంగ్ థియేటర్స్, విజయవాడ కళాకారులు ప్రదర్శించిన ‘దేవుడ్ని చంపిన మనిషి’ నాటిక నేటి మానవుడు పర్యావరణ విరోధిగా ఎలా మారుతున్నాడో చాటిచెప్పింది. జీవరాశిలో విజ్ఞాన ధనుడిగా మానవుడిని భగవంతుడు సృష్టించాడని అయితే నేడు మనిషి పెడ పోకడలతో అందమైన జగత్తును నాశనం చేస్తూ దైవాంతకునిగా మారుతున్నాడని, ఇది ప్రపంచానికి తీరని ముప్పని ఈ నాటిక హెచ్చరించింది. భాస్కర చంద్ర రచించిన ఈ నాటికకు శశి భాగ్యారావు దర్శకత్వం వహించారు. సాయి ఆర్ట్స్, ఒంగోలు ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘నిర్లక్ష్యం ఖరీదు’ బాలల నాటిక ఎయిడ్స్, హెచ్ఐవీ మూలంగా జరిగే అనర్థాలను తెలియజెప్పింది. కె.వెంకటేశ్వరరావు రచించిన ఈ నాటికకు ఎస్కే రసూల్ దర్శకత్వం వహించారు. చింతలపాలెం కోలాట భజన బృందం కళాకారుల ప్రదర్శన ఆహూతులను ఆకట్టుకుంది. చిన్నారుల నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. నాటకోత్సవంలో భాగంగా గురువారం సాయంత్రం ‘శ్రీకృష్ణ భీమసేనం’ పద్య నాటక ప్రదర్శన, కళారూపాల ప్రదర్శన ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. కళాపరిషత్ ఉత్సవాల్లో స్టాల్స్ ఏర్పాటు బుధవారం ప్రారంభమైంది. చేనేత వస్త్రాలు, రెడీమేడ్ దుస్తుల దుకాణాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. చీరలు నేసేందుకు ఉపయోగించే మగ్గాన్ని పలువురు ఆసక్తిగా తిలకించారు. -
రెండువేల మందితో రాధాకృష్ణుల సమ్మేళనం
ఒంగోలు నగరం ఒక అరుదైన ఘనతను సాధించేందుకు, ఏకంగా ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు సంసిద్ధమవుతోంది. అందుకోసం హిందూ ధర్మ సంరక్షణ సమితి, స్వామి వివేకానంద 150వ ఉత్సవ జయంతి సమితి సంయుక్తంగా కృషి చేస్తున్నాయి. ఈ అరుదైన ప్రదర్శనకు స్థానిక పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల మైదానం వేదిక కానుంది. నగరంలోని త్యాగరాజ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కార్యక్రమ నిర్వాహకులు తడికమళ్ల హరిప్రసాదరావు, పాంచాలవరపు రాంబాబు ఆ వివరాలు వెల్లడించారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్ట్స్లో స్థానం సాధించేందుకు ఈ నెల 25వ తేదీ కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో రెండువేల మంది చిన్నారులతో శ్రీకృష్ణ బాలబృందావనం పేరిట రాధాకృష్ణుల సమ్మేళనాన్ని నిర్వహించనున్నట్లు వారు వివరించారు. రాధాకృష్ణుల సమ్మేళనంలో 12 సంవత్సరాల్లోపు బాలబాలికలు పాల్గొనవచ్చని తెలిపారు. పాల్గొనదలచిన వారు తమపేర్లను ఈ నెల 20వ తేదీలోగా నమోదు చేసుకోవాలని సూచించారు. దేశంలోని ఏ ప్రాంతం వారైనా సమ్మేళనంలో పాల్గొనవచ్చన్నారు. వారంతా దరఖాస్తు ఫారాలు పూర్తిచేసి 50 రూపాయల నిర్వహణ విరాళాన్ని అందజేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పలురంగాల ప్రముఖులు రాధాకృష్ణుల సమ్మేళనాన్ని ప్రత్యక్షంగా పరిశీలిస్తారని తెలిపా రు. సమ్మేళనంలో పాల్గొనదలచిన చిన్నారులకు తల్లిదండ్రులు ఇంటివద్దనే మేకప్ వేసి నిర్ణీత సమయానికి తీసుకురావాలన్నారు. ఎక్కువమంది విద్యార్థులు, చిన్నారులు సమ్మేళనంలో పాల్గొనేలా ప్రోత్సహించిన పాఠశాలలకు బహుమతులు కూడా అందజేయనున్నట్లు చెప్పారు. సమ్మేళనంలో పాల్గొన్న వారికి ప్రశంసపత్రాలు అందజేస్తామన్నారు. సమ్మేళనం ముగిసిన నెలరోజుల తర్వాత అవసరమైతే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నిర్వాహకులకు నిర్ణీత రుసుం చెల్లించి వారి నుంచి అధికార పూర్వకంగా కూడా సర్టిఫికెట్ పొందవచ్చని నిర్వాహకులు వివరించారు. ఒంగోలులో తొలిసారి భారీస్థాయిలో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ తోడ్పాటునందించాలని వారు కోరారు. కార్యక్రమ వివరాలకు తడికమళ్ల హరిప్రసాదరావు (98487 97339), పాంచాలవరపు రాంబాబు (96403 00507)ను సంప్రదించాలని సూచించారు. విలేకర్ల సమావేశంలో మైనంపాటి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.