రోడ్డుపైనే ఓటర్ల నమోదు, చేర్పులు చేస్తున్న బీఎల్‌ఓ
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు నగరంలో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఓట్ల తొలగింపే లక్ష్యంగా అధికార పార్టీ పావులు కదుపుతోంది. ఇందుకు తొలుత ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులైన ఓట్లను గుర్తించి వారి అనుమతి లేకుండానే ఆ ఓట్లను పోలింగ్ బూత్‌లు, డివిజన్లనే మార్చేస్తున్నారు. వాస్తవానికి అధికారులు చూపించిన ప్రాంతంలో ఓటర్లు ఉండే అవకాశం ఉండదు. ఇదే అవకాశంగా తుది విచారణలో ఓటర్లు లేరన్న సాకు చూపి ఓటరు జాబితా నుంచి వారిని తొలగిస్తారు. ఇందులో అధికార పార్టీ నేతలు స్థానిక పోలింగ్ అధికారులతో కుమ్మక్కై మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒంగోలు నగరంలో 50 డివిజన్ల పరిధిలో వేలాది ఓట్లను ఇదే పద్ధతిలో తొలగించేందుకు అధికారులు సిద్ధమైపోయారు.
మచ్చుకు కొన్ని ఇవిగో..
నగరంలో 6వ డివిజన్ నీలాయిపాలెం 110 పోలింగ్ బూత్ పరిధిలో 612 ఓట్లుండగా ఓటర్లకు తెలియకుండానే 195 ఓట్లు షిఫ్టింగ్ కింద చూపించారు. వీరందరికీ 112 పోలింగ్ బూత్ పరిధిలోకి మార్చినట్లు తెలుస్తోంది. ఎక్కువ ఓట్లను గోపాలనగర్ ఎక్స్‌టెన్షన్ ఏరియాతో పాటు కమ్మపాలెం తదితర ప్రాంతాలకు షిఫ్టింగ్ చేశారు. తమ అనుమతి లేకుండానే ఓట్లను ఇతర పోలింగ్ బూత్‌ల పరిధిలోకి ఎలా మారుస్తారని నీలాయిపాలెంకు చెందిన దేవరపల్లి శ్రీను, సుజాతతో పాటు పలువురు ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా 27వ డివిజన్ కొండమిట్ట ప్రాంతానికి చెందిన 170 ఓట్లను 26వ డివిజన్‌లోకి మార్పు చేశారు. ఆయా ప్రాంతాలకు చెందిన ఓటర్లు ఎవ్వరూ తమ ఓట్లను మార్చాలని అధికారులను కోరలేదు.
ఇదే విధంగా నగరంలోని పలు డివిజన్ల పరిధిలో వేలాది ఓట్లను షిఫ్టింగ్ పేరుతో ఇతర ప్రాంతాలకు మార్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 30 ఏళ్లుగా తాము ఉంటున్న ప్రాంతాలను కాదని పోలింగ్ బూత్‌ల మార్పే కాకుండా, శివారు ప్రాంతాలకు ఓట్లను మార్పు చేయడంపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తమకు ఎటువంటి సమాచారం లేదని ఓటర్లు పేర్కొంటున్నారు. ప్రధానంగా ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ అనుకూలంగా ఉన్నారని భావించిన ఓటర్లనే షిఫ్టింగ్ పేరుతో ఇతర ప్రాంతాలకు మార్చినట్లు తెలుస్తోంది. ఓట్ల మార్పు, చేర్పులకు ఈ నెల 14వ తేదీ చివరి తేది. ఈ పరిస్థితుల్లో ఓటర్లకు అవకాశమివ్వకుండా వారి తొలగింపే లక్ష్యంగా మొత్తం వ్యవహారాన్ని నడిపించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలింగ్ బూత్‌లు, డోర్ నెంబర్లు సైతం మార్చివేశారు. ఆ తర్వాత విచారణలో ఓటర్లు లేరని తేల్చి తర్వాత వాటిని తొలగించేందుకే అధికారులు మొత్తం తంతు నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.
జేసీ, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు
నగరంలో ప్రణాళిక ప్రకారం ప్రతిపక్ష పార్టీ ఓటర్లను అధికార పార్టీ నేతలు తొలగించేందుకు సిద్ధమవ్వడంపై వైఎస్సార్ సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్, జేసీలతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లేదుకు సిద్ధమైంది. ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సూచనల మేరకు పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు ఓట్ల మార్పిడి వివరాలను సిద్ధం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు కలిసి బుధవారం కలెక్టర్, జేసీలను కలిసి విషయం వివరించనున్నారు. అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కలిసి ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment