vote removal
-
దొంగ ఓట్ల దొరబాబు
ఎన్నికల్లో గెలవడం ముఖ్యం. ఎలాగన్నది అనవసరం. ఇదీ చంద్రబాబు సిద్ధాంతం. తలపడిన ప్రతి ఎన్నికలోనూ ఏ తొండాట ఆడైనా సరే గెలవాలనే లక్ష్యంతోనే చంద్రబాబు వ్యవహరిస్తారనడానికి మొన్నటి నంద్యాల ఉప ఎన్నిక సహా గతంలోనూ ఎన్నో తార్కాణాలు. మరీ ముఖ్యంగా తాను సీఎంగా వ్యవహరిస్తూ ఎన్నికలకు వెళ్లినప్పుడల్లా బోగస్ ఓట్లు చేర్పించడమో, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఓట్లను జాబితా నుంచి తొలగింపజేయడమో కొనసాగాయి. తాజా ఎన్నికల నేపథ్యంలో... 2004కు ముందు జరిగిన తతంగాన్ని ఓసారి çపరిశీలిస్తే తెలుగుదేశం గుట్టంతా తెలిసిపోతుంది. అప్పట్లో కేంద్ర ఎన్నికల సంఘం నిబద్ధత, ప్రతిపక్షాలన్నీ ఏకతాటి పైకి వచ్చి ప్రశ్నించడంతో బాబు సర్కారు వెనక్కుతగ్గక తప్పలేదు. తాజాగా ప్రతిపక్ష పార్టీ అనుకూలుర ఓట్లను తొలగించడానికి... రాష్ట్ర ప్రజల వ్యక్తిగత వివరాలను ఐటీ గ్రిడ్స్ అనే సంస్థకు అందజేయడం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ నైజాన్ని చాటుతోంది. బోగస్ ఓట్లు చేర్పింపు, ప్రత్యర్థి పార్టీల అనుకూలుర ఓటర్లను జాబితా నుంచి తొలగింపు, తప్పుడు ఫిర్యాదులు, అనుకూలమైన ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, పేదలు, బడుగు బలహీన వర్గాలను పోలింగ్‌కు రాకుండా అడ్డుకోవడం, దాడులు, దౌర్జన్యాలు వంటి వ్యవహారాలు చంద్రబాబుకు కొత్తేమీ కాదు. ఇప్పుడు సైతం ప్రజా వ్యతిరేకత నిండుగా మూటగట్టుకున్న బాబు సర్కారు 2019 ఎన్నికల్లో గెలుపు అసాధ్యమనే నిర్ధారణకు వచ్చి దొంగ మార్గాలను ఎంచుకుందన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిని బలపరిచే ఆధారాలు, ఉదాహరణలను రాజకీయ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. అవేంటంటే..! పరిశీలనతో బట్టబయలు 1999 ఎన్నికల్లో బీజేపీతో జట్టు కట్టి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అయితే, తాము బలంగా కనిపించినప్పటికీ ఎందుకు ఓడిపోయామా? అని ప్రతిపక్ష నేతలు ఆలోచనలో పడ్డారు. దీంతో బూత్‌లు/ గ్రామాల వారీ ఓట్ల సరళి పరిశీలనకు దిగారు. బోగస్ ఓట్లతో టీడీపీ గెలుపొందిందని గుర్తించి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కాంగ్రెస్, వామపక్షాలు, ఎంఐఎం, టీఆర్ఎస్ తదితర పార్టీలు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేశాయి. బోగస్ ఓట్లతో గెలవాలన్నదే బాబు ప్లాన్ అని అప్పట్లో డి.శ్రీనివాస్, అసదుద్దీన్ ఒవైసీ, బీవీ రాఘవులు, సురవరం సుధాకర్‌రెడ్డి తదితరులు ఆరోపించారు. దీంతో ఎన్నికల సంఘాలు విచారణ చేపట్టాయి. దేశవ్యాప్తంగా జనాభాలో సగటున 62 నుంచి 68 శాతం ఓటర్లుండగా ఏపీలో మాత్రం 72.5 శాతం ఓటర్లున్నారని తేలడంతో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ఘాంతపోయింది. పోలింగ్ కేంద్రాల మార్పు మరో కుయుక్తి తమకు మద్దతు ఇవ్వరనే అనుమానాలున్న వర్గాలకు చెందిన ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను అక్కడినుంచి మార్పించడం చంద్రబాబు సర్కారుకు అలవాటు. ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, పేద వర్గాల నివాస ప్రాంతాల వద్ద ఉండే కేంద్రాలను తరలించిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. టీడీపీకి మద్దతుగా నిలిచే సామాజిక వర్గాల ఆవాసాల సమీపంలో కొత్తగా పాఠశాల భవనాలు, సామాజిక భవనాలు, ఇతర ప్రభుత్వ భవనాలు కట్టించడం పోలింగ్ కేంద్రాలను అక్కడ ఏర్పాటు చేయడమనే కుటిల వ్యూహం నాడు కొనసాగింది. నంద్యాల ఉప ఎన్నికలోనూ... నంద్యాల ఉప ఎన్నికలో 16 వేల ఓట్లు గల్లంతయ్యాయని ఓటర్లు గగ్గోలు పెట్టిన సంగతి తెలిసిందే. తమ ఓట్లు లేవంటూ పలువురు పోలింగ్ కేంద్రాల వద్ద ఆందోళనలకు దిగారు. తన అధికారంతో చంద్రబాబు... ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఓటర్లను తొలగించారని భావిస్తున్నట్లు అక్కడి నాయకులు ‘సాక్షి’కి చెప్పారు. బోగస్ ‘బాబో’తం అప్పట్లో రాష్ట్రంలో 5.49 కోట్ల మంది ఓటర్లుండగా కొత్తగా హక్కు కోసం 54 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో అధికం బోగస్‌వని తేలాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 7,88,417 మంది ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోగా 4.38 లక్షల దరఖాస్తులు అనర్హమైనవని తిరస్కరించారు. నాటి సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుతో పాటు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ బోగస్ దరఖాస్తులు పెద్దఎత్తున తిరస్కరణకు గురయ్యాయి. ఆ సమయంలో కూడా చంద్రబాబు... ‘అనర్హుల పేరిట ఓటర్ల పేర్లు తొలగిస్తే అడ్డు చెప్పండి. ఆందోళనలు చేయండని’ తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రధానిగా ఉన్న వాజ్‌పేయి, ఎన్నికల సంఘం వద్దకు తన ఎంపీలను పంపి హడావుడి చేశారు. చివరకు ఈసీ 64.53 లక్షల బోగస్ ఓట్లను తొలగించింది. 28.86 లక్షల దరఖాస్తులను తిరస్కరించింది. ఈ బోగస్ బాబోతానికి పలువురు అధికారులు బలైపోవాల్సి వచ్చిందని, పదిమందిపైగా ఎమ్మార్వోలు సస్పెన్షన్‌కు గురయ్యారని కొందరు నాయకులు గుర్తు చేస్తున్నారు. నరసరావుపేటలో అరాచకాలకు అంతే లేదు... ‘నరసరావుపేట నియోజకవర్గంలో బోగస్ ఓట్ల సంఖ్య అధికంగా ఉంది. వెంటనే విచారణ బృందాలను పంపి పరిశీలన చేయించండని’ మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి... ఆనాటి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అ«ధికారి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో 2,98,360 మంది జనాభా ఉంటే 2,24,602 మంది ఓటర్లున్నారని వివరించారు. జనాభాతో పోల్చితే... తురకపాలెంలో 99 శాతం (జనాభా 837, ఓటర్లు 836) ఓటర్లు, కండ్లగుంటలో 80, యల్లమందలో 93, కర్లగుంటలో 89 శాతం మంది ఉన్నారంటూ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. 12 సార్లు ఫిర్యాదులు చేశా కందుకూరు నియోజకవర్గంలో బోగస్ ఓట్లను గ్రామాలవారీగా గుర్తించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసినా తొలుత అంగీకరించలేదు. ఆధారాలు కావాలని 11సార్లు వెనక్కు పంపారు. ప్రత్యర్థి పార్టీకి చెందిన కుటుంబంలో 22 మంది సభ్యులుండగా 80పైగా ఉన్నట్లు ఆధారాలు అందజేశా. చివరకు అంగీకరించి చర్యలకు ఉపక్రమించారు. అప్పటి కలెక్టర్... పోకూరు అనే గ్రామంలో స్వయంగా విచారించి 1,270 ఓట్లు బోగస్ ఓట్లను తొలగించారు. –మానుగుంట మహీధర్‌రెడ్డి, మాజీ మంత్రి వామ్మో కోడెల ఎన్నికల క్రతువులో అన్యాయాలు, అక్రమాలు చేయడంలో కోడెల శివప్రసాదరావు దిట్ట. 1999 ఎన్నికల్లో నరసరావుపేటలో నాపై ఆయన గెలిచారు. కాంగ్రెస్‌కు బలమైన గ్రామాల్లోనూ ఓట్లు తగ్గడంతో ఏదో మోసం జరిగిందని గుర్తించా. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్లను ఒకటికి పలుసార్లు కలిసి ఈ విషయాలనే వివరించా. అప్పటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జేఎం లింగ్డో స్పందించి... ఈసీ కమిషనర్ కేజేరావును నరసరావుపేట నియోజకవర్గ పర్యటనకు పంపారు. బోగస్ ఓట్లు తొలగింపును అడ్డుకునేందుకు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. కానీ, లింగ్డో పట్టుదల వదల్లేదు. అనంతరం రాష్ట్రంలో 64.53 లక్షల బోగస్ ఓట్లు తీసేశారు. తరువాత జరిగిన 2004 ఎన్నికల ఫలితాలు ఏమిటో తెలిసిందే. – కాసు వెంకట కృష్ణారెడ్డి , మాజీ మంత్రి ఉదాహరణలివిగో.. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెం మండలం పోకూరు గ్రామంలో అప్పటి కలెక్టర్... 1270 బోగస్ ఓట్లను తొలగించారు. అదే రీతిలో నియోజకవర్గంలో పరిశీలింపజేసిన ఆయన 33 వేల ఓట్లు పైగా తీసేయించారు. కొండెపి నియోజకవర్గంలో 36 వేలు, కనిగిరిలో అంతకంటే ఎక్కువే దొంగ ఓట్లను తొలగింపజేశారు. హైదరాబాద్ శివారు శేరిలింగంపల్లి మున్సిపాలిటీ పరిధిలో 1,51,000 మంది జనాభా ఉండగా ఓటర్లేమో 1,56,000 మంది నమోదయ్యే అవకాశాలను ఈసీ గుర్తించింది. హైదరాబాద్ బీహెచ్ఈఎల్ ఎంఐజి కాలనీలోని 1061 నంబరు ఇంట్లో నాలుగు గదులుంటే... నమోదైన ఓటర్ల సంఖ్య మాత్రం 105. నల్గొండ జిల్లాలో పాఠశాల విద్యార్థులు కూడా ఓటర్ల జాబితాలోకి ఎక్కారు. ఇందులో 4, 5వ తరగతి చదువుతున్న వారూ ఉండటం గమనార్హం. భీమవరంలో ఒకే ఇంటి నెంబరు (27–17–55/1 అప్పటిది)లో 115 ఓట్లు ఉన్నాయి. అదే ఇంటినుంచి మరో 11 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ ఇంటిని నాటి కాంగ్రెస్ నాయకుడు గ్రంధి శ్రీనివాస్ పరిశీలించగా ఒక వృద్ధురాలు, మరో ముగ్గురు మాత్రమే నివాసం ఉంటున్నారు. ఇవన్నీ చంద్రబాబు సర్కారు హయాంలో జరిగినవే. నాడు పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితమైనవే. – నాగా వెంకటరెడ్డి, సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
‘సేవామిత్ర’ తో ఓట్లు తొలగించారు
సాక్షి, న్యూఢిల్లీ : తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను టీడీపీ నేతలు ప్లాన్ ప్రకారం రెండేళ్ల నుంచి తొలగిస్తున్నారని వైఎఎస్సార్సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. సేవామిత్ర యాప్ ద్వారా బూత్‌ల వారిగా ఓట్లను తొలగించారన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చట్ట వ్యతిరేకంగా సేవామిత్ర యాప్‌కు ప్రభుత్వ సమాచారాన్ని ఇచ్చి నాలుగేళ్లలో 20 లక్షలకు పైగా ఓట్లను తొలగించారని ఆరోపించారు. ఆర్టీజీఎస్ ద్వారా సర్వే చేసి టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించారని చెప్పారు. ఫారం 7 పై టీడీపీ ఇష్టారీతిగా మాట్లాడుతుందని మండిపడ్డారు. డబుల్ ఓట్లపై ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. బాధ్యత కలిగినవారెవరైనా డూప్లికేట్ ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చెయ్యొచ్చునన్నారు. డూప్టికేట్ ఓట్లు కావాలని టీడీపీ ఎందుకు కోరుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు షెడ్యూల్ వెలువడిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు విచ్చల విడిగా జీవోలు జారీ చేశారని ఆరోపించారు. రహస్యం పేరుతో జీవోల సమాచారాన్ని దాచిపెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఏదో ఒక పద్దతిలో ఎన్నికల్లో నెగ్గాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. -
టీడీపీ వ్యవహారం దొంగే దొంగ అన్నట్లుగా ఉంది
సాక్షి, విజయనగరం : ప్రజాదారణ కోల్పోయిన టీడీపీ.. అక్రమార్గంలో గద్దెనెక్కాలనే ఉద్దేశంతో తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు. ప్రభుత్వ పనితీరుపై నమ్మకం లేదు కాబట్టే ఎదో కుట్ర చేసి అధికారంలోకి రావాలనుకుంటున్నారని విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో టీడీపీ దారుణంగా ఓడిపోతుందన్న భయంతో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని విమర్శించారు. ఓట్లను తొలగిస్తూనే.. తమ సానుభూతి ఓట్లే తొలగిస్తున్నారని టీడీపీ చెబుతుంటే దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు. మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు చెబుతున్న 7500 ఓట్లు ఎవరి సానుభూతిపరుల ఓట్లో ప్రజల ముందే తేల్చుకోవడానికి తాము సిద్ధమన్నారు. మంత్రికి దమ్ముంటే బొబ్బిలిలోని ప్రతి గ్రామానికి వెళ్లి నిజాన్ని తెలుసుకోవడానికి రావాలని సవాల్ చేశారు. ప్రభుత్వ దగ్గర ఉండాల్సిన పౌరుల సమాచారం ఓ ప్రైవేట్ కంపెనీ వద్దకు ఎలా వెళ్లిందో టీడీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు నెల క్రితం కొంత మంది వ్యక్తులు గ్రామాల్లో తిరుగుతూ.. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల వివరాలను తెలుసుకొని వారి ఓట్లను తొలగించారని ఆరోపించారు. ఈ విషయంపై ఎన్నికల అధికారి, డీజీపీలకు ఫిర్యాదు చేశామన్నారు. గత 26వ తేది నుంచి చీపురుపల్లి, మెరకముడిదాం మండలాలలో 2వేలకు పైగా ఫాం7 ధరఖాస్తులు నమోదయ్యాయని, 27వ తేదికి అవి 7 వేలకు చేరాయన్నారు. ఇలా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 25వేల వరకు ఫాం7 నమోదయ్యాయన్నారు. ఇవన్ని కుట్ర పూరితంగా చేసిన ఫిర్యాదులేనన్నారు. ఫాం7 ధరఖాస్తులో నూటికి నూరు శాతం వైఎస్సార్సీపీ నానుభూతిపరుల ఓట్లే ఉన్నాయని ఆరోపించారు. ఎన్నికల వేళ టీడీపీ నేతలు ఎదో కుట్ర రూపంలో వస్తారని అంతా జాగ్రత్తగా ఉండాలని కోరారు. -
సర్వే ముసుగులో ఓటర్ల తొలగింపు!
కర్నూలు, కౌతాళం: సర్వే పేరుతో ఓట్లు తొలగిస్తూ ఓ బృందం దొరికిపోయింది. మండల పరిధిలోని రౌడూరు గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. నల్గురు సభ్యులు కల్గిన బృందం ఒకటి సర్వే పేరిట గ్రామానికి వచ్చింది. ప్రభుత్వ పనితీరు గురించి అడిగినట్లే అడిగి ఇంటి నంబరుతో పాటు ఫోన్ నంబర్లు కూడా సేకరించి ట్యాబ్‌లో సేవ్ చేసి ఆన్లైన్ చేస్తుండడంతో గ్రామస్తులు, వైఎస్సాఆర్సీపీ నాయకులు నర్సారెడ్డి, ఏకాంబర్‌రెడ్డి, లక్ష్మికాంత్‌రెడ్డిలు అడ్డుకున్నారు. ప్రభుత్వ పనితీరుతో పాటు ఈసారి ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తారని, అధికారంలో ఎవరు వస్తే బాగుంటుందని ప్రశ్నలు అడుతున్నారు. చంద్రబాబు అంటే ఎస్ అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే నో అని సేవ్ చేసి ఆన్లైన్ చేయడంతో గ్రామస్తులు ఇది టీడీపీ సర్వే అని నిర్ధారించుకున్నారు. వైఎస్సార్సీపీ ఓటర్లను ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నారని అక్కడే ఉన్న పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా బృందంలోని సభ్యులు మాట్లాడుతూ.. తాము పీపుల్స్‌పల్స్ వాయిస్ సంస్థ తరఫున వచ్చినట్లు తెలిపారు. గ్రామంలో 25 మందితో సర్వే చేయమని తమ సంస్థ మేనేజర్ చెప్పారని తెలిపారు. తాము ఎమ్మిగనూరులోని సిద్ధార్థ కాలేజిలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులమని, సెమిష్టర్ పరీక్షలు పూర్తి కావడంతో డబ్బులు వస్తాయని వచ్చామని తెలిపారు. దీని గురించి తెలియదని వివరించారు. ఎమ్మిగనూరులోని మల్లికార్జున హోటల్లో తమ సంస్థ ప్రతినిధి ఉంటాడని చెప్పారు. శనివారం.. మంత్రాలయం మండలంలోని వగూరుర్లో కూడా సర్వే చేసినట్లు చెప్పుకొచ్చారు. బృంద సభ్యులను రాత్రి కౌతాళం స్టేషన్‌కు పిలిపించి వారి వివరాలు సేకరించి వదిలిపెట్టారు. ర్వేల పేరిట తెలుగుదేశం పార్టీ ప్రజల్ని మోసం చేస్తోందని వైస్సాఆర్సీపీ నాయకులు ఏకాంబర్‌రెడ్డి, నర్సారెడ్డి, లక్ష్మికాంత్‌రెడ్డి ఆరోపించారు. సర్వేలో జగన్‌కు మద్దతు తెలిపితే ఇంటి నంబరు, ఫోన్ నంబరు సేకరించి ఓటర్లను తొలగిస్తున్నారన్నారు. హామీలను నేరవేర్చి ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకోవాలని, దొంగ సర్వేల పేరిట ఓటర్లను తొలగించడం తగదన్నారు. -
ఓట్లు తీసేస్తున్నారు..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు నగరంలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఓట్ల తొలగింపే లక్ష్యంగా అధికార పార్టీ పావులు కదుపుతోంది. ఇందుకు తొలుత ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులైన ఓట్లను గుర్తించి వారి అనుమతి లేకుండానే ఆ ఓట్లను పోలింగ్ బూత్‌లు, డివిజన్లనే మార్చేస్తున్నారు. వాస్తవానికి అధికారులు చూపించిన ప్రాంతంలో ఓటర్లు ఉండే అవకాశం ఉండదు. ఇదే అవకాశంగా తుది విచారణలో ఓటర్లు లేరన్న సాకు చూపి ఓటరు జాబితా నుంచి వారిని తొలగిస్తారు. ఇందులో అధికార పార్టీ నేతలు స్థానిక పోలింగ్ అధికారులతో కుమ్మక్కై మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒంగోలు నగరంలో 50 డివిజన్ల పరిధిలో వేలాది ఓట్లను ఇదే పద్ధతిలో తొలగించేందుకు అధికారులు సిద్ధమైపోయారు. మచ్చుకు కొన్ని ఇవిగో.. నగరంలో 6వ డివిజన్ నీలాయిపాలెం 110 పోలింగ్ బూత్ పరిధిలో 612 ఓట్లుండగా ఓటర్లకు తెలియకుండానే 195 ఓట్లు షిఫ్టింగ్ కింద చూపించారు. వీరందరికీ 112 పోలింగ్ బూత్ పరిధిలోకి మార్చినట్లు తెలుస్తోంది. ఎక్కువ ఓట్లను గోపాలనగర్ ఎక్స్టెన్షన్ ఏరియాతో పాటు కమ్మపాలెం తదితర ప్రాంతాలకు షిఫ్టింగ్ చేశారు. తమ అనుమతి లేకుండానే ఓట్లను ఇతర పోలింగ్ బూత్‌ల పరిధిలోకి ఎలా మారుస్తారని నీలాయిపాలెంకు చెందిన దేవరపల్లి శ్రీను, సుజాతతో పాటు పలువురు ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా 27వ డివిజన్ కొండమిట్ట ప్రాంతానికి చెందిన 170 ఓట్లను 26వ డివిజన్‌లోకి మార్పు చేశారు. ఆయా ప్రాంతాలకు చెందిన ఓటర్లు ఎవ్వరూ తమ ఓట్లను మార్చాలని అధికారులను కోరలేదు. ఇదే విధంగా నగరంలోని పలు డివిజన్ల పరిధిలో వేలాది ఓట్లను షిఫ్టింగ్ పేరుతో ఇతర ప్రాంతాలకు మార్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 30 ఏళ్లుగా తాము ఉంటున్న ప్రాంతాలను కాదని పోలింగ్ బూత్‌ల మార్పే కాకుండా, శివారు ప్రాంతాలకు ఓట్లను మార్పు చేయడంపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తమకు ఎటువంటి సమాచారం లేదని ఓటర్లు పేర్కొంటున్నారు. ప్రధానంగా ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ అనుకూలంగా ఉన్నారని భావించిన ఓటర్లనే షిఫ్టింగ్ పేరుతో ఇతర ప్రాంతాలకు మార్చినట్లు తెలుస్తోంది. ఓట్ల మార్పు, చేర్పులకు ఈ నెల 14వ తేదీ చివరి తేది. ఈ పరిస్థితుల్లో ఓటర్లకు అవకాశమివ్వకుండా వారి తొలగింపే లక్ష్యంగా మొత్తం వ్యవహారాన్ని నడిపించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలింగ్ బూత్‌లు, డోర్ నెంబర్లు సైతం మార్చివేశారు. ఆ తర్వాత విచారణలో ఓటర్లు లేరని తేల్చి తర్వాత వాటిని తొలగించేందుకే అధికారులు మొత్తం తంతు నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. జేసీ, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు నగరంలో ప్రణాళిక ప్రకారం ప్రతిపక్ష పార్టీ ఓటర్లను అధికార పార్టీ నేతలు తొలగించేందుకు సిద్ధమవ్వడంపై వైఎస్సార్ సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్, జేసీలతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లేదుకు సిద్ధమైంది. ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సూచనల మేరకు పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు ఓట్ల మార్పిడి వివరాలను సిద్ధం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు కలిసి బుధవారం కలెక్టర్, జేసీలను కలిసి విషయం వివరించనున్నారు. అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కలిసి ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేయనున్నారు. -
ఓట్ల తొలగింపునకు పైరవీలు..!
సాక్షి, గుంటూరు: జిల్లాలో ఓట్ల తొలగింపునకు అధికార నేతలు పైరవీలు ప్రారంభించారు. క్షేత్రస్థాయిల్లో సిబ్బందిని భయభ్రాం తులకు గురిచేస్తున్నారు. కొత్త ఓట్ల చేర్పులు, మార్పులు, తొలగింపులపై అధికార యంత్రాంగానికి భారీగా దరఖాస్తులు అందాయి. వీటిపై ఇంటింటి విచారణ చేపట్టి ఈ నెల 16న తప్పుల్లేని ఓటర్ల జాబితా ప్రచురించాల్సి ఉంది. ఇందుకు 13నాటికి అధికార యంత్రాం గం విచారణ పూర్తి చేయాల్సి ఉంది. దీనిలో భాగంగా బోగస్ ఓట్లు గుర్తించడం, అర్హులైన వారికి ఓటు హక్కు దక్కేలా కృషి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అయితే అధికార యంత్రాం గంపై రాజకీయ నేతల ఒత్తిళ్లు అధికంగా ఉన్నా యి. విచారణ చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తహశీల్దా ర్లు సైతం నేతల ఒత్తిడికి భయపడుతున్నారు. జిల్లాలో భారీగా ఓట్లు నమోదు చేయించడం అధికార పార్టీ నేతలకే చెల్లింది. ప్రతిపక్ష టీడీపీ నేతలు కూడా అధికారులపై దాడులకు తెగబడటం, పదే పదే ఫిర్యాదులు చేయడంతో అధికారులు ఉత్తుత్తి విచారణ చేస్తే పోతుందనే ఆలోచనలో ఉన్నారు. దీంతో తప్పుల్లేని ఓటర్ల జాబితా ప్రచురణ కష్ట సాధ్యంగా మారనుంది. ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా తాజా ఫోటోలతో గుర్తింపు కార్డులను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో ఆన్లైన్లో, మాన్యువల్ విధానంలో మొత్తం 2,66,254 మంది ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకున్నారు. తొలగింపులు మాత్రం 24,251 దరఖాస్తులు అందాయి. సవరణలకు 29,478 దరఖాస్తులు, పోలింగ్ బూత్ మార్పులకు 7,192 దరఖాస్తులు స్వీకరించారు. వీటన్నిం టిని విచారించేందుకు ఇంకా ఐదు రోజులు మాత్రమే గడువు ఉంది. అవకతవకలు అనేక రకాలుగా జరిగిన ఈ జాబితాపై సార్వత్రిక ఎన్నికల వేళ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏరేస్తారా.. వదిలేస్తారా.. జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో టోకున ఓట్ల చేర్పింపులు జరిగాయి. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే తొలగింపులు చేశారు. ఊరూరా ఓట్లు మాయమయ్యాయి. గత నెల 18న అధికారులు ప్రకటించిన డ్రాఫ్ట్ పబ్లికేషన్‌లో ఈ విషయం తేలింది. బోగస్ ఓట్లు అలాగే ఉంచి అర్హులైన వారి ఓట్లు తొలగించారనే ఆరోపణలు వినపడుతున్నాయి. తొలగింపులకు జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఏకంగా ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాయడం గమనార్హం. నియోజకవర్గాల్లో అసంబద్ధంగా అందిన చేర్పుల దరఖాస్తులపై కలెక్టరు రెవెన్యూ యంత్రాంగానికి ఇటీవలే హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా నగరంలో చేరిక ఓట్లుకు అందిన దరఖాస్తుల్ని చూస్తే రెండు చోట్ల ఓట్లు పొందేందుకు దరఖాస్తు చేసినట్లుంది. ఈ దరఖాస్తుల్ని ఏరేసేందుకు రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్ వల్ల ఫలితం లేదని స్వయంగా అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పకడ్బందీ విచారణ నిర్వహించేందుకు సమయం సరిపోనందున బోగస్ ఓట్ల ఏరివేత ప్రహసనంగానే మారనుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి అత్యధిక దరఖాస్తులు చేర్పుల (ఫారం-6) కోసం అందాయి. మొత్తం ఇక్కడ 32,002 దరఖాస్తులు అందడంపై చర్చనీయాంశమైంది. జిల్లాలో ఓ సీనియర్ మంత్రి గత ఎన్నికల అనుభవాల దృష్ట్యా ఓట్ల నమోదు ప్రక్రియను తనకు అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దూరదృష్టితో వ్యవహరించి ఎన్నికల అధికారులతో పాటు కింది స్థాయి సిబ్బందిని ప్రభా వితం చేస్తున్నారని సమాచారం. గుంటూరు తూర్పులోనూ 23,788 దరఖాస్తులు చేర్పులకు అందాయి. గుంటూరు పశ్చిమలో తొలగింపుల దరఖాస్తులు 316 కాగా, తూర్పులో 68 కావడం విశేషం.