ఓట్ల తొలగింపునకు పైరవీలు..! | heavy application to New votes seasonings, changes, removals | Sakshi
Sakshi News home page

ఓట్ల తొలగింపునకు పైరవీలు..!

Published Wed, Jan 8 2014 4:04 AM | Last Updated on Wed, Apr 3 2019 5:52 PM

heavy application to New votes seasonings, changes, removals

సాక్షి, గుంటూరు: జిల్లాలో ఓట్ల తొలగింపునకు అధికార నేతలు పైరవీలు ప్రారంభించారు. క్షేత్రస్థాయిల్లో సిబ్బందిని భయభ్రాం తులకు గురిచేస్తున్నారు. కొత్త ఓట్ల చేర్పులు, మార్పులు, తొలగింపులపై అధికార యంత్రాంగానికి భారీగా దరఖాస్తులు అందాయి.  వీటిపై ఇంటింటి విచారణ చేపట్టి ఈ నెల 16న తప్పుల్లేని ఓటర్ల జాబితా ప్రచురించాల్సి ఉంది. ఇందుకు 13నాటికి అధికార యంత్రాం గం విచారణ పూర్తి చేయాల్సి ఉంది. దీనిలో భాగంగా బోగస్ ఓట్లు గుర్తించడం, అర్హులైన వారికి ఓటు హక్కు దక్కేలా కృషి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అయితే అధికార యంత్రాం గంపై రాజకీయ నేతల ఒత్తిళ్లు అధికంగా ఉన్నా యి.  విచారణ చేస్తున్న అంగన్‌వాడీ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

తహశీల్దా ర్లు సైతం నేతల ఒత్తిడికి భయపడుతున్నారు. జిల్లాలో భారీగా ఓట్లు నమోదు చేయించడం అధికార పార్టీ నేతలకే చెల్లింది. ప్రతిపక్ష టీడీపీ నేతలు కూడా అధికారులపై దాడులకు తెగబడటం, పదే పదే ఫిర్యాదులు చేయడంతో అధికారులు ఉత్తుత్తి విచారణ చేస్తే పోతుందనే ఆలోచనలో ఉన్నారు.  దీంతో తప్పుల్లేని ఓటర్ల జాబితా ప్రచురణ కష్ట సాధ్యంగా మారనుంది. ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా తాజా ఫోటోలతో గుర్తింపు కార్డులను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.

జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో ఆన్‌లైన్‌లో, మాన్యువల్ విధానంలో మొత్తం 2,66,254 మంది ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకున్నారు. తొలగింపులు మాత్రం 24,251 దరఖాస్తులు అందాయి. సవరణలకు 29,478 దరఖాస్తులు, పోలింగ్ బూత్ మార్పులకు 7,192 దరఖాస్తులు స్వీకరించారు. వీటన్నిం టిని విచారించేందుకు ఇంకా ఐదు రోజులు మాత్రమే గడువు ఉంది. అవకతవకలు అనేక రకాలుగా జరిగిన ఈ జాబితాపై సార్వత్రిక ఎన్నికల వేళ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 ఏరేస్తారా.. వదిలేస్తారా..
 జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో టోకున ఓట్ల చేర్పింపులు జరిగాయి. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే తొలగింపులు చేశారు. ఊరూరా ఓట్లు మాయమయ్యాయి. గత నెల 18న అధికారులు ప్రకటించిన డ్రాఫ్ట్ పబ్లికేషన్‌లో ఈ విషయం తేలింది. బోగస్ ఓట్లు అలాగే ఉంచి అర్హులైన వారి ఓట్లు తొలగించారనే ఆరోపణలు వినపడుతున్నాయి. తొలగింపులకు జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఏకంగా ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాయడం గమనార్హం. నియోజకవర్గాల్లో అసంబద్ధంగా అందిన చేర్పుల దరఖాస్తులపై కలెక్టరు రెవెన్యూ యంత్రాంగానికి ఇటీవలే హెచ్చరికలు జారీ చేశారు.

 ముఖ్యంగా నగరంలో చేరిక ఓట్లుకు అందిన దరఖాస్తుల్ని చూస్తే రెండు చోట్ల ఓట్లు పొందేందుకు దరఖాస్తు చేసినట్లుంది. ఈ దరఖాస్తుల్ని ఏరేసేందుకు రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్ వల్ల ఫలితం లేదని స్వయంగా అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పకడ్బందీ విచారణ  నిర్వహించేందుకు సమయం సరిపోనందున బోగస్ ఓట్ల ఏరివేత ప్రహసనంగానే మారనుంది.

     గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి అత్యధిక దరఖాస్తులు చేర్పుల (ఫారం-6) కోసం అందాయి. మొత్తం ఇక్కడ 32,002 దరఖాస్తులు అందడంపై చర్చనీయాంశమైంది.

     జిల్లాలో ఓ సీనియర్ మంత్రి గత ఎన్నికల అనుభవాల దృష్ట్యా ఓట్ల నమోదు ప్రక్రియను తనకు అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దూరదృష్టితో వ్యవహరించి ఎన్నికల అధికారులతో పాటు కింది స్థాయి సిబ్బందిని ప్రభా వితం చేస్తున్నారని సమాచారం.

     గుంటూరు తూర్పులోనూ 23,788 దరఖాస్తులు చేర్పులకు అందాయి. గుంటూరు పశ్చిమలో తొలగింపుల దరఖాస్తులు 316 కాగా, తూర్పులో 68 కావడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement