సాక్షి, నెల్లూరు సిటీ: అజ్ఞాతవాసి చిత్రం విడుదల సందర్బంగా టికెట్లు కోసం పవన్‌కళ్యాణ్ అభిమానులు వర్గాలుగా చీలారు. నిజమైన పవన్‌కళ్యాణ్ అభిమానులకు టికెట్లు దక్కడం లేదని ఓ వర్గం ఎస్పీ రామకృష్ణకు సోమవారం ఫిర్యాదు చేశారు. గత కొంత కాలంగా అజ్ఞాతవాసి చిత్రం విడుదల కోసం పవన్‌కళ్యాణ్ అభిమానులు వేచిచూస్తున్నారు.
బుధవారం విడుదల కానున్న అజ్ఞాతవాసి చిత్రం టికెట్లు కోసం పవన్‌కళ్యాణ్ అభిమానులు ధియేటర్ యాజమాన్యాన్ని కలిసి చర్చలు జరిపారు. చిరంజీవి యువత, పవన్‌కళ్యాణ్ జిల్లా ఫ్యాన్స్ అధ్యక్షులు పీ టోనీ వర్గాలకు కొన్ని సంవత్సరాలుగా టికెట్లు పంపకాలు జరిగేవి. చిరంజీవి యువతకి 60శాతం, టోనికి 40శాతం టికెట్లు దక్కేవి. అయితే ఇటీవల జనసేన పార్టీ తరుపున ప్రచారం చేస్తున్న ఓవర్గం టికెట్లు కోసం ఫ్యాన్స్‌ను ఆశ్రయించింది. దీంతో ఆ రెండు వర్గాలు టికెట్లు ఇవ్వమని తేల్చిచెప్పడంతో వారు ఎస్పీ రామకృష్ణను సోమవారం కలిసి తమకు న్యాయం చేయాలని విన్నవించుకున్నారు. తాము 600 మంది ఉన్నామని, ఫ్యాన్స్ అసోసియేషన్‌ను టికెట్లు కోరితే ఇవ్వమని చెప్పారన్నారు. దీంతో అసలైన అభిమానులకు టికెట్లు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫ్యాన్స్ ముసుగులో బ్లాక్ విక్రయాలు..
ఫ్యాన్స్ ముసుగులో కొందరు అభిమాన సంఘ నాయకులు బ్లాక్ విక్రయాలు చేస్తుండేవారు అని విమర్శలు ఉన్నాయి. ధియేటర్ యాజమాన్యం నుంచి ఫ్యాన్స్ అసోసియేషన్‌లకు టికెట్లు పంపకాలు జరిగేవి. వీరిలో కొందరు అభిమానులకు టికెట్లు ఇవ్వకుండా బ్లాక్‌కు తరలిస్తుండేవారు. రూ.100 టికెట్‌ను రూ.500కు విక్రయిస్తుండేవారు. ఈ వ్యవహారం ఎస్పీ రామకృష్ణకు చేసిన ఫిర్యాదుతో పోలీసు శాఖలో చర్చినీయాంశమైంది. బ్లాక్ విక్రయాలను అరికట్టేందుకు పోలీసులు తగిన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో తెల్లవారుజామున షో ఉండడంతో ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
ఒక్క రోజు 81షోలు..
రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులు క్రితం ఇచ్చిన జోఓ ప్రకారం తెల్లవారుజామున 1గంట నుంచి ఉదయం 10గంటల వరకు చిత్రం ప్రదర్శించవచ్చని ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే నెల్లూరులో తెల్లవారుజామున 3గంటల నుంచి షోలు ప్రదర్శించేందుకు పోలీసులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో నగరంలోని ఎస్2 ధియేటర్‌లో 21, ఎంజీబీలో 30, అర్చనలో 6, లీలామహల్‌లో 6, నర్తకీలో 6షోలు, సిరి ధియేటర్‌లో 12 షోలు ప్రదర్శించేందుకు నిర్ణయించారు. మొత్తం 81 షోలు ఒక్క రోజు నగరంలో ప్రదర్శించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment