భూపేందర్ హూడా, దుష్యంత్ చౌతాలా, మనోహర్ లాల్ ఖట్టర్
హరియాణాలో ఒకప్పుడు కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్డీ) మధ్య మాత్రమే ప్రత్యక్ష పోరు ఉండేది. జనాభాలో 29శాతం మంది ఉన్న జాట్లు ఎవరికి అండగా ఉంటే వారే ఎన్నికల్లో పై చేయి సాధించేవారు. 2014లో దేశవ్యాప్తంగా మోదీ హవా ఊపేయడంతో హరియాణాలో రాజ కీయం కాషాయం రంగు అద్దుకుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఏడు స్థానాల్లో గెలించింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ తొలిసారి అధికార పగ్గాల్ని అందుకుంది.
ఈ సారి ఎన్నికలు పోటాపోటీ సమీకరణల మీదే నడుస్తున్నాయి. జాట్ ఓట్లన్నీ ఒక ఎత్తు అయితే∙వారికి వ్యతిరేకంగా దళితులు, వెనుకబడిన వర్గాలు చేతులు కలిపాయి. గత ఎన్నికల్లో బీజేపీ జాట్ వ్యతిరేక వర్గాలన్నింటినీ కూడగట్టి కొత్త సామాజిక సమీకరణలకు తెరతీసింది. కుల ప్రాబల్యం అధికంగా ఉన్న రాష్ట్రంలో పంజాబీ ఖత్రీ అయిన మనోహర్ లాల్ ఖట్టర్‌ను సీఎం పీఠంపై కూర్చోబెట్టడం ఒక సాహసం. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాట్లు ఓబీసీ రిజర్వేషన్ల కోసం పోరు బాట పట్టారు.
ఈ సందర్భంగా జాట్లు ఒకవైపు, సైనీలు, పంజాబీలు, యాద వులు మరోవైపు హోరాహోరీగా ఘర్షణలకు దిగడంతో రాష్ట్రం అట్టుడికిపోయింది. ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దించి ఆందోళనల్ని అణిచివేయడానికి ప్రయత్నించింది. చివరికి జాట్లకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక బిల్లును కూడా తెచ్చింది. కానీ కోర్టు దానిని తిరస్కరించింది. ‘‘ఒకప్పుడు ఏ ప్రభుత్వ ఉద్యోగంలో చూసినా జాట్లే కనిపించేవారు. బీజేపీ సర్కార్ అన్ని కులాల వారికి సమాన అవకాశాలు కల్పిస్తోంది‘‘అని గురుగావ్‌కి చెందిన ఓబీసీ యువకుడు ఒకరు వ్యాఖ్యానించారు.
విపక్షాల్లో అనైక్యత
హరియాణాలో జాట్ల మద్దతు భారీగా ఉన్న ఐఎన్‌ఎల్‌డీ పార్టీ కుటుంబంలో చీలికలు ఈ సారి రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పుతాయో అన్న చర్చ సాగుతోంది. పార్టీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ చౌతాలాకు అజయ్. అభయ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో చౌతాలా, ఆయన కుమారుడు అజయ్ జైల్లో ఉన్నారు. అజయ్ కుమారులు, దుష్యంత్, దిగ్విజయ్‌లు తమ చిన్నాన్న అభయ్ పార్టీని నాశనం చేశారని ఆరోపిస్తూ ఐఎన్‌ఎల్‌డీ గుడ్‌బై కొట్టేసి జన నాయక్ జనతా పార్టీ (జేపీపీ) పేరుతో పార్టీ పెట్టారు.
ఇన్నాళ్లూ ఐఎన్‌ఎల్‌డీకి మద్దతుగా ఉన్న జాట్ ఓటు బ్యాంకు అంతా ఇప్పుడు జేపీపీ వైపు మళ్లి పోయింది. ఇటీవల జరిగిన జింద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో జేజేపీ రెండోస్థానంలో నిలిచింది. ఇక కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో సతమత మవుతోంది. భూపీందర్ హూడా, పీసీసీ అధ్యక్షుడు అశోక్ తన్వార్, కుమారి సెల్జాల మధ్య వర్గ పోరు అధిష్టానానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
పొత్తులు ఎత్తులు జిత్తులు
ఈ ఎన్నికల్లో జేపీపీ కీలకంగా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆఖరి నిమిషంలో జేపీపీతో చేతులు కలపడంతో బలమైన శక్తిగా మారింది. అంబాలా, సిర్సా, గుర్‌గావ్, ఫరీదాబాద్ స్థానాల్లో ఈ కూటమి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి. గత ఏడాది జాట్ ఆందోళనల సమయంలో కురుక్షేత్ర బీజేపీ ఎంపీ రాజ్‌కుమార్ సైనీ పార్టీని వీడారు. జాట్‌యేతరులకు హక్కుల్ని రక్షణ కల్పించడంలో బీజేపీ విఫలమైందని ఆరోపిస్తూ ఆయన లోక్‌తంత్ర సురక్షా పార్టీ (ఎల్‌ఎస్‌పీ) పేరుతో పార్టీ పెట్టారు. బీఎస్పీ, ఎల్‌ఎస్పీ ఈ ఎన్నికల్లో జత కట్టడంతో బీజేపీ ఓటు బ్యాంకుని ఎంతవరకు చీలుస్తారన్న చర్చ జరుగుతోంది. కురుక్షేత్ర, కర్నాల్, అంబాలాలో ఈ కూటమి ఇతర పార్టీల ఓటుబ్యాంకుని దెబ్బ తీసే అవకాశాలున్నాయి. మొత్తమ్మీద బహుముఖ పోటీ నెలకొన్న ఏ పార్టీకి కలిసివస్తుందో వేచి చూడాల్సిందే.
కొడుకులు, మనవలు, ముని మనవలు
హరియాణా అంటేనే కొన్ని కుటుంబాల పాలనకు పెట్టింది పేరు. నలుగురు మాజీ ముఖ్యమంత్రులు భజన్‌లాల్, చౌధరీ దేవిలాల్, ఓం ప్రకాశ్ చౌతాలా, బన్సీ లాల్ కుమారులు, మనవలు, మునిమనవలు చాలా మంది ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే చెట్టు పేరు చెపితే ఓట్లు రాలే పరిస్థితి లేదని గ్రహించుకున్న వారు నియోజకవర్గాల్లో తాము చేసిన అభివృద్ధిని చూసే ఓట్లు వేయమంటున్నారు. బన్సీలాల్ మనవరాలు శ్రుతి చౌధరిని కాంగ్రెస్ పార్టీ భివాని–మహేంద్రగఢ్ నుంచి బరిలో దింపితే, భజన్‌లాల్ మనవడు భవ్య భిష్ణోయి హిసార్ నుంచి బరిలో ఉన్నారు.
చౌతాలా కుటుంబంలో చీలికల కారణంగా ఆయన మనవలు, ముని మనవలు ఎన్నికల బరిలోఉన్నప్పటికీ వేర్వేరు పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఐఎన్‌ఎల్‌డీ నుంచి చీలిపోయి కొత్త పార్టీ పెట్టిన చౌతాలా మనవడు దుష్యంత్ చౌతాలా హిసార్ నుంచి పోటీ పడుతూ ఉంటే, మరో మనవడు దిగ్విజయ్ చౌతాలా సోనిపత్ నుంచి పోటీ పడుతున్నారు. ఇక కురుక్షేత్ర నుంచి అభయ్ చౌతాలా కుమారుడు అర్జున్ చౌతాలా ఐఎన్‌ఎల్‌డీ తరఫున బరిలో ఉన్నారు.
పోలింగ్ తేదీ 12
నియోజకవర్గాలు 10
Comments
Please login to add a commentAdd a comment