
ఇబ్రహీంపట్నం రూరల్: ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రమాదవశాత్తు కారుకు మంటలంటుకుని పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటనలో ఆరుగురు ప్రయాణికులు క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు. కారు పూర్తిగా కాలిపోయింది. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు సీఐ గోవింద్‌రెడ్డి, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. శుక్రవారం రాత్రి ఓ కారు శామీర్‌పేట్ నుంచి శంషాబాద్ వైపు వెళ్తుంది. ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రావిర్యాల్ సమీపంలో గల ప్రగతి ప్రింటింగ్ ప్రెస్ సమీపంలోకి రాగానే కారులో మంటలు వస్తున్నట్లు ప్రయాణికులు గమనించారు. వెంటనే కారు నిలిపివేసి పరిశీలించగా మంటలు పెద్దగా అవుతుండటంతో పక్కన నిలబడ్డారు. డీజిల్ ట్యాంకుకు మంటలంటుకుని మంటలు ఎగిసిపడ్డాయి. స్థానిక ఔటర్ పోలీసులు, ఆదిబట్ల పోలీసులు గమనించి ఫైరింజన్‌కు సమాచారం అందించారు. ఫైరింజన్ వచ్చినా మంటలు అదుపుకాలేదు. కారు పూర్తిగా దగ్ధమైపోయింది. ప్రయాణికులు శామీర్‌పేట్‌కు చెందిన వారుగా పోలీసులు చెబుతున్నారు. అందర్నీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తామని పోలీసులు పేర్కొన్నారు. క్షణాల్లో పెను ప్రమాదం తప్పిందని బాధితులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment