పంచాయతీలను పటిష్టం చేద్దాం | cm kcr review meeting with collector and district officials | Sakshi
Sakshi News home page

పంచాయతీలను పటిష్టం చేద్దాం

Published Wed, Jan 17 2018 11:55 AM | Last Updated on Wed, Aug 15 2018 9:45 PM

cm kcr review meeting with collector and district officials - Sakshi

సాక్షి, వికారాబాద్‌: పంచాయతీలను బలోపేతం చేయడానికి, గ్రామాలను సర్వతోముఖాభివృద్ధి దిశగా నడిపించడానికి గానూ వందశాతం పన్నులు వసూలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. పరిపాలనా సంస్కరణల్లో భాగంగా నగరంలోని ప్రగతి భవన్‌లో కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో మంగళవారం ప్రత్యేక సదస్సు నిర్వహించారు. దీనికి జిల్లా నుంచి కలెక్టర్‌ సయ్యద్‌ ఒమర్‌ జలీల్, ఇన్‌చార్జ్‌ జేసీ సంధ్యారాణి, డీపీఓ మాజిద్‌ హాజరయ్యారు. ముఖ్యంగా పంచాయతీల పాలనపై సీఎం కేసీఆర్‌ జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 8,684 పంచాయతీలున్నాయని, పరిపాలనా సౌలభ్యంకోసం కొత్తగా మరో 4వేల జీపీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 500లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.5 లక్షలు, వెయ్యి మంది జనాభా దాటితే రూ.10 లక్షలు, ఆపైన స్థాయిని బట్టి పంచాయతీకి రూ.15, రూ.20, రూ.25 లక్షల నిధులు అందజేస్తామని వివరించారు.

 ఫిబ్రవరిలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నామని, ఆలోగానే కొత్త పంచాయతీలు ఏర్పాటు చేసి, సరిహద్దులు నిర్ణయించాలని ఆదేశించారు. పంచాయతీ ఎన్నికలను సైతం శాసన ప్రక్రియ ద్వారానే నిర్వహించాలని ఆలోచిస్తున్నామన్నారు. ప్రత్యక్ష ఎన్నికలా.. పరోక్ష ఎన్నికలా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, పటిష్ట పంచాయతీ వ్యవస్థ నిర్మాణానికి సలహాలు సూచనలు ఇవ్వాలని కలెక్టర్లను కోరారు. మార్చి 11న గ్రామాల్లో ఈ– పాసు పుస్తకాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతీ గ్రామానికి ఒక అధికారిని నియమించి అదే రోజు పాసు పుస్తకాలు అందజేయాలని ఆదేశించారు. రికార్డుల ప్రక్షాళన తర్వాత భూములు వివరాలన్నీ ధరణి వెబ్‌సైట్‌లోనే ఉంటాయని చెప్పారు. భూముల రిజిస్ట్రేషన్‌ విధానంలో సమూల మార్పులు తీసుకురానున్నామని సీఎం వివరించారు. రిజిస్ట్రేషన్‌ ఆఫీసులు లేనిచోట తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్‌ అధికారం కట్టబెడుతామన్నారు. జిల్లాలోని 18 మండలాలకు గానూ ప్రస్తుతం 4 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు పనిచేస్తున్నాయి.

వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్‌ మినహా 14 మండలాల్లో తహసీల్దార్లకు భూముల రిజిస్ట్రేషన్‌ అధికారాలు వరించనున్నాయి. తాగునీరు, విద్యుత్, సాగునీటి కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, ఈ ఫలాలు ప్రతిఒక్కరికీ అందాల్సిన అవసరం ఉందని కేసీఆర్‌  సూచించారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పర్యటించి లోపాలను తెలుసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయని ఆనందం వ్యక్తంచేశారు. సంక్షేమ పథకాల అమలుకు మరింత పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement