సాక్షి, మెదక్: జిల్లా పోలీసు యంత్రాంగం గురువారం జిల్లా వ్యాప్తంగా సకల నేరస్తుల సర్వే ప్రారంభించింది. రాష్ట్ర పోలీసు శాఖ నేరాల అదుపు చేయటం, పాత నేరస్తులను వెనువెంటనే గుర్తించేందుకు వీలుగా ‘టీ పోలీస్ యాప్’కు రూపకల్పన చేస్తోంది. ఇందులో భాగంగా పాత నేరస్తుల వివరాలను సేకరించేందుకు పోలీసు శాఖ నేరస్తుల సర్వే ప్రారంభించింది. డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా పోలీసు అధికారులు గురువారం జిల్లాలోని అన్ని పోలీస్టేషన్ల పరిధిలో నేరస్తుల గురించి ఆరా తీశారు. జిల్లాలోని 21 పోలీస్టేషన్ల పరిధిలో 48 పోలీసు అధికారుల బృందాలు సర్వేలో పాల్గొన్నాయి. మనోహరాబాద్ మండలం చెట్లగౌరారం గ్రామంలో నిర్వహించిన సర్వేలో డీఐజీ శివశంకర్‌రెడ్డి, మెదక్ పట్టణంలోని గొల్కొండ వీధిలో చేపట్టిన సర్వేలో ఎస్పీ చందన దీప్తి పాలుపంచుకున్నారు.
సర్వేలో భాగంగా పోలీసు అధికారులు జిల్లా అంతటా 1062 మంది నేరస్తులను గుర్తించారు. వీరికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు. 2008 నుంచి పదేళ్లలో అన్ని రకాల కేసుల్లో ప్రమేయం ఉన్న నేరస్తుల వివరాలను పోలీసు అధికారులకు సేకరించటం జరిగింది. వీటితో పాటు నేరస్తుల ఫొటోలను, వేలిముద్రలను, ఇంటివివరాలను సేకరిస్తున్నారు. గుర్తించిన నేరస్తులు ప్రస్తుతం సొంత ఇంటిలో ఉంటే వాటి ఫొటోలు తీసి జియో ట్యాగింగ్ చేయనున్నారు. రాబోయే వారం రోజుల పాటు పోలీసు శాఖ అధికారులు పోలీస్టేషన్ల వారిగా నేరస్తుల గుర్తింపు ప్రక్రియ కొనసాగించనున్నారు. జైలు బయట, జైలులో ఉన్న నేరస్తుల వివరాలన్నింటిని సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపరుస్తామని పోలీసు అధికారులు తెలిపారు. సకల నేరస్తుల సర్వే ద్వారా నేరస్తులకు సంబంధించిన వివరాలను పూర్తిగా సేకరించి వారి కదలికలపై నిఘా పెట్టడం జరుగుతుందన్నారు. ఈ సర్వే ద్వారా నేరస్తులు ఎక్కడైనా ఎలాంటి నేరాలకు పాల్పడేందుకు ప్రయత్నించినా అడ్డుకునేందుకు వీలు కలుగుతుందని తెలిపారు.
మెదక్ మున్సిపాలిటీ: నేరస్తుల సమగ్ర సర్వే జిల్లాలో ప్రారంభమైంది. నేరస్తులు తప్పుదోవ పట్టకుండా పకడ్బందిగా చర్యలు తీసుకోవడం కోసం ఈ సర్వే జరుగుతుందని ఎస్పీ చందనాదీప్తి అన్నారు. గురువారం మెదక్ పట్టణంలో గోల్కొండ ప్రాంతంలోని పాత నేరస్తుల వివరాలను ఆమె సేకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సకల నేరస్తుల సర్వే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 1500 మంది పాత నేరస్తులను గుర్తించామన్నారు. పదేళ్లుగా నేరాలకు పాల్పడిన వారు ప్రస్తుతం ఏం చేస్తున్నారు? నేరుగా వారి ఇళ్లకు వెళ్లి తెలుసుకోవడం జరుగుతుందన్నారు. నేరస్తుల గృహలకు జియో ట్యాగింగ్ చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా వారు తప్పుదోవ పట్టకుండా నిరంతరం నిఘా ఉంచనున్నట్లు తెలిపారు. పాత నేరస్తుల నుంచి వారికి సంబంధించిన ధ్రువ పత్రాలు ఆధార్, ఓటర్ ఐటీ లాంటి పత్రాలను సేకరించడం జరుగుతుందన్నారు. నేరస్తులు వ్యక్తిగత వివరాలు, భార్యాపిల్లలు, తల్లిదండ్రులు, ప్రస్తుత చిరునామ, వివరాలను సేకరించారు. నేరస్తుల భార్యలతో మాట్లాడి వారు ఏలా చూసుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, పట్టణ సీఐ భాస్కర్, ఎస్‌ఐ, సీఐ రాజశేఖర్‌రెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment