
ఎవరూ చూడకుండా మెల్లగా తన షర్టు లోపల ఉన్న ఓ ఎలక్ట్రానిక్ వస్తువును...
తప్పుడు ఆరోపణలతో హోటల్ యాజమాన్యాన్ని ఇబ్బందులపాలు చేద్దామనుకున్న ఓ యువతి చర్యలు సీసీటీవీలో రికార్డయ్యాయి. దీంతో ఆమె పన్నాగం బయటపడింది. ఈ ఘటన ఐర్లాండ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండటంతో సదరు యువతిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆధునిక వస్త్రధారణతో ఉన్న ఓ యువతి స్థానికంగా ఉన్న జడ్జ్ రాయ్ బీన్స్ బార్ అండ్ స్టీక్ రెస్టారెంట్‌కు వెళ్లింది. ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత.. ఎవరూ చూడకుండా మెల్లగా తన షర్టు లోపల ఉన్న ఓ ఎలక్ట్రానిక్ వస్తువును నోట్లో పెట్టుకుంది. అనంతరం భోజనంలో ఇలాంటి వస్తువులు కలుపుతున్నారా అంటూ సిబ్బందిపై మండిపడింది. ఈ క్రమంలో సదరు యువతి స్నేహితురాలు కూడా ఆమెకు తోడైంది. ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్ తిన్న యజమాని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాడు. దీంతో యువతి బండారం బయటపడింది. దురుద్దేశంతోనే ఆమె ఇలా చేసిందని గ్రహించిన హోటల్ సిబ్బంది ఆమెపై విరుచుకుపడ్డారు.
ఈ విషయం గురించి హోటల్ యజమాని మాట్లాడుతూ...‘ఈరోజు గనుక సీసీటీవీ లేకపోయి ఉంటే మాపై యువతి వేసిన నిందలు నిజమని నమ్మేవారు. దీంతో మా వ్యాపారం దెబ్బతినేది. అసలు ఆమె ఎందుకు ఇలా చేసిందో అర్థం కావడం లేదు’ అని వాపోయారు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు... ‘బిల్లు ఎగ్గొట్టడానికా లేదా హోటల్ మూయించడానికా.. అసలు ఎందుకు ఇలా చేస్తారు. ఫ్రీగా తినాలనిపిస్తే ఇంతకు దిగజారాలా’ అంటూ యువతి తీరును తప్పుబడుతున్నారు. కాగా ఇటీవల చైనాలో కూడా ఓ వ్యక్తి ఇలాగే తన భోజనంలో తానే చచ్చిన ఎలుకను వేసుకుని రెస్టారెంట్ సిబ్బందిని బ్లాక్‌మెయిల్ చేసిన సంగతి తెలిసిందే.