తమిళసినిమా: హీరోలు అందుకు అర్హులే అంటోంది నటి అనుష్క. ఈ స్వీటీ సినీ జీవితం అరుంధతికి ముందు, ఆ తరువాత అన్నట్టుగా తన స్థాయిని పెంచుకుంటూ వచ్చింది. అనుష్క అంటే ఫైట్స్ చేయగలదు. పంచ్ డైలాంగ్స్ చెప్పగలదు. కత్తి పట్టి వీరనారిలా యుద్ధభూమిలో కదం తొక్కగలదు. ఒక్క మాటలో చెప్పాలంటే హీరోలకు దీటుగా నటించి చిత్ర కథను తన భుజస్కందాలపై వేసుకుని విజయ తీరం దాటించగలదు. అది భాగమతి చిత్రంతో మరోసారి నిరూపించింది. అనుష్క టైటిల్ పాత్ర పోషించిన భాగమతి చిత్రం ఇటీవల తెరపైకి వచ్చి ఒక్క భాష అని కాకుండా దక్షణాది భాషలన్నిటిలోనూ కలెక్షన్లను ఇరగదీస్తోంది. చిత్రం నిర్మాణం ఆలస్యమైంది. అనుష్క బరువు పెరిగింది. భాగమతికి ఎలాంటి రిజల్ట్ వస్తుందో అన్న అనుమానం చాలా మందిలో ఉంది.
అలాంటి వాటిని పటాపంచల్ చేస్తూ చిత్రం విజయం వైపు దూసుకుపోతోంది. ఇక అసలు విషయానికి వస్తే చాలా మంది హీరోయిన్లు ప్రారంభ దశలో అవకాశాలు వస్తే చాలని భావిస్తారు. రెండు మూడు విజయాలు తమ ఖాతాలో పడగానే పారితోషికం విషయంలో అసంతృప్తి రాగం తీస్తుంటారు. హీరోల పరంగా చూస్తే హీరోయిన్ల పారితోషికాలు చాలా తక్కువని, ఇది హీరోల ఆధిపత్య రాజ్యం అని ఆరోపణలు చేస్తుంటారు. అయితే ఇందుకు అనుష్క అతీతం అనే చెప్పాలి. ఈ బ్యూటీ హీరోల పక్షాన మాట్లాడుతోంది. ఇటీవల భాగమతి చిత్ర ప్రమోషన్‌లో భాగంగా కేరళకు వెళ్లిన అనుష్కను హీరోహీరోయిన్ల మధ్య పారితోషిక తారతమ్యం గురించి మీడియా అడిగిన ప్రశ్నకు అనుష్క బదులిస్తూ హీరోయిన్ల కంటే అధిక పారితోషికం తీసుకోవడానికి హీరోలు అర్హులేనని చెప్పింది. చిత్రం కోసం వారు ఎంతో శ్రమిస్తారని అంది. అంతే కాదు చిత్రం అపజయం పాలయితే అందుకు హీరోలే బాధ్యత వహిస్తారని, హీరోయిన్లకు ఆ బాధ ఉండదని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment