
పెరంబూరు: రజనీకాంత్, కమలహాసన్‌ల కంటే యువ నటుడు శింబు సమయోచితంగా వ్యవహరిస్తున్నారని కన్నడ సీనియర్ నటుడు అనంతనాగ్ వ్యాఖ్యానించారు. కావేరి బోర్డు వ్యవహారంలో తమిళనాడు ప్రభుత్వం తీరు, నటులు రజనీకాంత్, కమలహాసన్ వ్యాఖ్యలపై ఈయన స్పందించారు. రాజకీయ రంగప్రవేశం చేసిన తరువాత రజనీ, కమల్‌ల నుంచి తాను ఎంతో ఆశించానని అయితే వారు పాత విధానంలోనే రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. తాను తమిళులకు వ్యతిరేకిని కానని, తమిళులు మంచి వారు, సహృదయులు అని అన్నారు. కన్నడిగులతో సన్నిహితంగా మెలుగుతారన్నారు. కర్ణాటకలో మరో నెలలో కొత్త ప్రభుత్వం రానుందని, ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయని అన్నారు. అదే విధంగా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిందన్నారు.
తమిళనాడులో ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం లేదని, అయినా వారు ఎందుకు ఉద్రేకానికి గురవుతున్నారని ప్రశ్నించారు. నటుడు శింబు ఎలాంటి పోరాటం లేకుండా కావేరి వ్యవహారంలో కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు నీటిని ఇవ్వాలని కోరుతూ విజ్ఞతతో వ్యాఖ్యలు చేశారని, ఆయనలాంటి పరిణితి రజనీ, కమల్‌లో లేకపోవడం చూసి దిగ్భ్రాంతి చెందానన్నారు. ఆఫ్రికాలోని నైల్‌నది సమస్య కూడా పరిష్కరమైందని, అలాంటిది కావేరి సమస్యకు పరిష్కారం లభించాలని తమిళ ప్రభుత్వం కోరుకోవడం లేదన్నారు. కన్నడిగులు మంచి వారని, కావేరి వ్యవహారంలో తమిళ రాజకీయ నాయకుల చేతకాని తనంగా భావిస్తున్నారని, వారికి తాము తగిన రీతిలో బదులిస్తామని నటుడు అనంతనాగ్ పేర్కొన్నారు.