తమిళసినిమా: సినీ రంగంలో లైంగిక వేధింపుల గురించి పలువురు నటీమణులు గళం వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ వరుసలో ఒక తమిళ చిత్ర నిర్మాత తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని నటి శ్రుతీహరిహరన్ చెప్పింది. కన్నడలో ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న ఈ అమ్మడు నెరింగివా ముత్తమిడాదే చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయ్యింది. ఆ తరువాత నిపుణన్, రారా రాజశేఖర్, సోలో చిత్రాల్లో నటించింది. ఆమె దీని గురించి చెబుతూ తాను 18 ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి ప్రవేశించానని చెప్పింది. మొదట్లో పాటలకు డాన్స్ చేసే దానినని తెలిపింది. అప్పట్లోనే తాను లైంగిక వేధింపులకు గురయ్యానని, ఆ విషయాన్ని ఒక నృత్య దర్శకుడికి చెప్పి, తననా వేధింపుల నుంచి తప్పించే మార్గం చెప్పమని కోరగా, అలాంటివి ఎదుర్కొనలేకపోతే సినీ రంగం నుంచి వెళ్లిపో అని ఆయన అన్నారని చెప్పింది.
అప్పుడే తనకు సినిమా గురించి అర్థమైందని అంది. తాను నటించిన ఒక కన్నడ చిత్రం మంచి విజయాన్ని సాధించిందని, ఆ చిత్ర రీమేక్ హక్కుల్ని ఒక తమిళ నిర్మాత పొందారని తెలిపింది. అతను తమిళంలోనూ తననే నటించమని అడిగాడన్నారు. తాను సంతోషంగా అంగీకరించానని చెప్పింది. అయితే ఆ తరువాత అతను తనను పడక గదికి రమ్మని వేధించాడని తెలిపింది. తాను ఎప్పుడూ తన చెప్పును చేతిలోనే ఉంచుకుంటానని బదులిచ్చానని చెప్పింది. ఆ తరువాత ఆ నిర్మాత తన గురించి తప్పుడు ప్రచారం చేసి అవకాశాలు రాకుండా చేశాడని తెలిపింది. చిత్రరంగంలో హీరోయిన్లకు విలువ లేదని, ఆడవారితో వ్యాపారం చేయాలనుకోవడం వేదన కలిగిస్తోందని నటి శ్రుతీహరిహరన్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment