
తమిళసినిమా: మిమ్మల్ని కొట్టింది భర్త అయినా తిరిగి కొట్టండి అంటోంది నటి వరలక్ష్మీశరత్‌కుమార్. డేరింగ్ అండ్ డైనమిక్ నటిగా అవతరించిన ఈ అమ్మడు కథానాయకి పాత్రా, కాదా? వ్యత్యాసం చూడకుండా నచ్చిన పాత్రల్లో నటిస్తోంది. తారైతప్పట్టై చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న వరలక్ష్మీ అవకాశాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో 10 చిత్రాల వరకూ ఉన్నాయి. వరలక్ష్మీకి తాజాగా మరో బంపర్‌ఆఫర్ తలుపు తట్టింది. ఇలయదళపతి విజయ్ 62వ చిత్రంలో ముఖ్య పాత్రను పోషించడానికి రెడీ అవుతోంది. ఈ చిత్రంలో కీర్తీసురేశ్ కథానాయకిగా నటిస్తున్న విషయం తెలిసిందే. వరలక్ష్మీ ప్రతినాయకి పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరగుతోంది. ఇదిలా ఉంటే వరలక్ష్మీకి మరో ముఖం కూడా ఉందన్న విషయం తెలిసిందే.
మహిళల రక్షణ కోసం సేవ్‌శక్తి అనే సంస్థను ప్రారంభించిన విషయం విదితమే. ఈ సంస్థ తరఫున సోమవారం ప్రపంచ మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నై,వ్యాసార్‌పాడిలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగా రక్తదాన శిబిరం, దివ్యాంగ మహిళలకు త్రిచక్రవాహనాలు, చీరలు, ఇతర సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వరలక్ష్మీ మాట్లాడుతూ సేవ్‌శక్తి తరఫున గతేడాది జిల్లాకో మహిళా కోర్టు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరామన్నారు మహిళలు బానిసలుగా జీవించకూడదని, కట్టుకున్న భర్త అయినా సరే కొడితే తిరిగి కొట్టాలని వరలక్ష్మీ అన్నారు. సోమవారం ఈమె పుట్టిన రోజు కావడంతో ఇదే వేదికపై కేక్ కట్ చేసి అందరికీ పంచారు.
Comments
Please login to add a commentAdd a comment