టెస్టు సిగలో ‘గులాబీ’ | 138 years Test cricket born | Sakshi
Sakshi News home page

టెస్టు సిగలో ‘గులాబీ’

Published Sat, Nov 21 2015 12:00 AM | Last Updated on Sun, Sep 3 2017 12:46 PM

టెస్టు సిగలో ‘గులాబీ’

టెస్టు సిగలో ‘గులాబీ’

1971లో వర్షం వల్ల టెస్టులో నాలుగు రోజుల ఆట రద్దయ్యాక... చివరి రోజు ప్రయోగాత్మకంగా 40 ఓవర్ల మ్యాచ్ ఆడి ఉండకపోతే... క్రికెట్‌లో మరో ప్రత్యామ్నాయంగా వన్డేలు పుట్టేవా..?

 1980లలో కెర్రీ ప్యాకర్ కొత్త తరహాలో ఆటను అందించి ప్రయోగం చేసినప్పుడు... ‘పైజామా క్రికెట్’ అని విమర్శలతో తిప్పి కొట్టడంతో సరిపెడితే... రంగుల దుస్తులు, డే అండ్ నైట్ మ్యాచ్‌లు ఎంజాయ్ చేసేవాళ్లమా..?

 2003లో ఆదరణ తగ్గుతున్న క్రికెట్‌కు కొత్త వినోదాన్ని పరిచయం చేయాలని ఇంగ్లండ్ తెచ్చిన టి20 ఫార్మాట్‌ను ‘గిమ్మిక్’గా కొట్టి పారేస్తే... ధనాధన్ బ్యాటింగ్ మెరుపులు, ఐపీఎల్ వైభవం చూసేవాళ్లమా..?

కొత్త ఎప్పుడూ ‘చెత్త’ కాదు. ప్రయోగం విఫలం కావచ్చు... కానీ ప్రయత్నం చేయాల్సిందే. ప్రతిదీ విజయవంతం అవుతుందన్న గ్యారంటీ ఎక్కడా లేదు. గతంలో విమర్శలు వచ్చినా ముందుకు వెళ్లే సాహసం చేయడంతో క్రికెట్ కొత్త పుంతలు తొక్కింది. ఇప్పుడు అదే కోవలో పింక్ బంతితో డే అండ్ నైట్ టెస్టులకు కూడా రంగం సిద్ధమైంది. దీని భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేకపోయినా... ఆటకు సంబంధించి ఇది కూడా ఒక కీలక మలుపు కావడం ఖాయం.
 
 పింక్ బంతులతో తొలి అంతర్జాతీయ మ్యాచ్  
 27నుంచి ఆసీస్, కివీస్ డే అండ్ నైట్ టెస్టుతో మొదలు  
 పనితీరుపై భిన్నాభిప్రాయాలు

 
 సాక్షి కీడా విభాగం
 టెస్టు క్రికెట్ పుట్టి 138 ఏళ్లయింది. ఇప్పటికి 2188 అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. మార్పు నిరంతర ప్రక్రియ కాబట్టి సహజంగానే ఇన్నేళ్లలో ఆటలో, నిబంధనల్లో పలు మార్పులు వచ్చాయి. అయితే వన్డేలు, టి20లతో పోలిస్తే చెప్పుకోదగ్గ విప్లవాత్మక తేడా టెస్టుల్లో కనిపించలేదు. తెల్ల దుస్తులు, ఎర్రబంతులతో దానిని అలాగే కొనసాగించాలనే సాంప్రదాయవాదుల ఆలోచన వల్ల టెస్టులు అదే మూసలో సాగుతున్నాయి. ఇప్పుడు టెస్టులకు కొత్త ‘ఫ్లేవర్’ జత చేరింది. తొలిసారి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌కు రంగం సిద్ధం అయింది. వినూత్న ప్రయోగాలకు ఎప్పుడూ ముందుండే ఆస్ట్రేలియానే ఈ ఆలోచనకు ఊపిరి పోసింది. ఈ నెల 27 నుంచి కివీస్‌తో అడిలైడ్‌లో జరిగే మూడో టెస్టుతో ఇది మొదలవుతుంది. అన్నింటికి మించి ఈ మ్యాచ్‌లో మొదటిసారి గులాబీ బంతులను ఉపయోగిస్తుండటం పెద్ద విశేషం. ఇది ఎలా పని చేయబోతోంది అనేది ఆసక్తికరం.
 
 ప్రయోగం ఎక్కడ మొదలైంది?
 దాదాపు తొమ్మిదేళ్ల క్రితం ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో పింక్ బంతులను వాడారు. ఇది కొత్తగా అనిపించడంతో దీనిని టెస్టులకు ఎందుకు వాడకూడదనే ఆలోచన ఎంసీసీకి వచ్చింది. వైట్ డ్రెస్ సాంప్రదాయానికి భంగం కలగకుండా కొత్త బంతిని రూపొందించే బాధ్యతను 2009లో ఎంసీసీ అనుమతితో కూకాబుర్రా కంపెనీ తీసుకుంది. బరువు, సైజు విషయంలో అన్ని నిబంధనలనూ అనుసరిస్తూ ప్రస్తుతం గులాబీ బంతి ఉన్న తుది రూపుకు తీసుకొచ్చేందుకు గత ఐదేళ్లుగా వేర్వేరు దేశాల్లో దీనిని పరీక్షించారు. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, జింబాబ్వే, పాకిస్తాన్‌లలో వేర్వేరు మ్యాచ్‌లలో పింక్ బంతిని ఉపయోగించారు. భారత్, ఇంగ్లండ్‌లలో మాత్రం దీనిని ఇప్పటి వరకు వాడలేదు.
 
 ఎందుకు పింక్ బంతి?
 డే అండ్ క్రికెట్ ఆలోచన చాలా కాలంనుంచి ఉన్నా అది అమల్లోకి రాలేదు. లైట్ వేస్తే ఎర్ర బంతి సరిగా కనిపించదనే విషయం వెల్లడైంది. దాంతో ప్రత్యామ్నాయం చూస్తూ పసుపు, ఆకుపచ్చలాంటి అనేక రంగులను కూడా పరీక్షించారు. అయితే ఆటగాళ్ల వైట్‌డ్రెస్‌కు పూర్తి వ్యతిరేకంగా, కొట్టొచ్చినట్లు ఉండే రంగు ఉండాలని ప్రయోగాలు చేశారు. ఉదయంతో పాటు రాత్రి వేళల్లో కూడా ఇబ్బంది లేకుండా ఆడగల రంగు పింక్ మాత్రమే అని నిర్ధారించారు. టెస్టు క్రికెట్‌పై ఆసక్తి పెంచేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని ఐసీసీ భావిస్తోంది.
 
 తేడా ఏమిటి?
 ఎర్రబంతితో పోలిస్తే మరీ చెప్పుకోదగ్గ తేడా ఏమీ లేదు. గులాబీ రంగుతో డైయింగ్ చేయడంతో పాటు గట్టితనం, బౌన్స్ విషయంలో అదే తరహాలో ఐదు పొరలతో దీనిని రూపొందించారు. బంతి మధ్యలోని సీమ్ ఆకుపచ్చని రంగుతో ఉంటుంది. అయితే మరింత ప్రకాశవంతంగా కనిపించేందుకు గులాబీ రంగుతో అదనంగా మరో కోటింగ్ చేశారు. ఈ కారణంగా ఆరంభంలోనే బంతి ఎక్కువగా స్వింగ్ అవుతుందని చెబుతున్నారు. మరో వైపు పింక్ బాల్ ఆకారం తొందరగా చెడిపోకుండా ఎక్కువ సమయం పాటు పనికొచ్చేలా ఉండేందుకు పిచ్‌పై కాస్త ఎక్కువ పచ్చిక ఉంచడం మంచిదని నిపుణుల విశ్లేషణ. దాంతో అడిలైడ్ టెస్టులో కూడా సాధారణంకంటే ఎక్కువ పచ్చిక ఉంచి పిచ్‌ను రూపొందిస్తున్నారు.
 
 స్పందన ఎలా ఉంది?
 ఆస్ట్రేలియా ప్రధాన బౌలర్ మిషెల్ స్టార్క్ పింక్ బాల్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘ఎలా చూసినా ఇది ఎర్రబంతిలా స్పందించడం లేదు. స్వింగ్, గట్టిదనం విషయంలో పోలికే లేదు. చాలా తొందరగా మెత్తబడిపోతోంది. రివర్స్ స్వింగ్ కూడా కావడం లేదు. రాత్రి పూట బౌండరీనుంచి బంతి కనిపించడం లేదు’ అన్నాడు. అతనికి జాన్సన్, హాజల్‌వుడ్ కూడా మద్దతు పలకగా, వోజెస్ 28 ఓవర్లకే 68 ఓవర్ల బంతిలా కనిపిస్తోందని విమర్శించాడు. ఇక దిగ్గజం పాంటింగ్ అయితే సాంప్రదాయాన్ని దెబ్బ తీస్తున్నారంటూ మొదటి నుంచీ వ్యతిరేకత కనబర్చాడు. అయితే మరో దిగ్గజం స్టీవ్‌వా, న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ మాత్రం దీనిని ఆహ్వానించారు. టెస్టులపై ఆసక్తి పెంచేందుకు ఇలాంటివి అవసరమని వా పేర్కొనగా... పింక్ బాల్ క్రికెట్ కూడా కొత్త సవాల్‌లాంటిదని, ఆటగాళ్లు దేనికైనా సిద్ధంగా ఉండాలని మెకల్లమ్ అన్నాడు. ఇక ఆసీస్ ఆఫ్ స్పిన్నర్ నాథన్ లయోన్ అయితే ఇది స్పిన్నర్లకు అద్భుతంగా పనికొస్తుందని కితాబిచ్చాడు. బంతిపై ఉండే పచ్చ రంగు సీమ్ బ్యాట్స్‌మన్‌కు సరిగ్గా కనిపించదని, దాని వల్ల తమ గ్రిప్‌పై స్టైకర్ దృష్టి సరిగ్గా ఉండదని అతను అన్నాడు. అయితే ఆటగాళ్ల సందేహాలను క్రికెట్ ఆస్ట్రేలియా కొట్టి పారేసింది. అన్ని రకాల పరీక్షల తర్వాతే తాము టెస్టు మ్యాచ్‌కు సిద్ధమైనట్లు వెల్లడించింది.
 
 ఎక్కడ ఉపయోగించారు?
 ఎగ్జిబిషన్ మ్యాచ్‌లను పక్కన పెడితే ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఈ ఏడాది ఆస్ట్రేలియా ఫస్ట్‌క్లాస్ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్‌లో మూడు మ్యాచ్‌లు ఈ బంతితో డే అండ్ నైట్‌గా ఆడించారు. గత నెల 23న న్యూజిలాండ్, పీఎం ఎలెవన్ మధ్య కూడా వన్డే వార్మప్ మ్యాచ్ జరిగింది. ఇటీవల పింక్ బంతితో బాల్ ట్రాకింగ్ టెక్నాలజీని కూడా పరిశీలించి డీఆర్‌ఎస్‌కు కూడా ఇబ్బంది లేదని తేల్చారు. ‘మా పింక్ బంతి టెస్టు క్రికెట్‌కు సిద్ధంగా ఉంది’ అని కూకాబుర్రా ఎండీ బ్రెట్ ఇలియట్ ఘనంగా ప్రకటించారు. ‘అంతర్జాతీయ క్రికెటర్లు వివిధ పరిస్థితులు, పిచ్‌లకు అనుగుణంగా తమ ఆటను మార్చుకుంటారు. ఇంగ్లండ్ డ్యూక్ బంతి, భారత్‌లో అయితే ఎస్‌జీ బంతులతో పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఇప్పుడు పింక్ బంతి కూడా కొత్త తరహా ప్రయత్నంగా భావించాలి. కాబట్టి ఆటగాళ్లకు ఇది సమస్య కాకపోవచ్చు. ఇది సఫలం అవుతుందన్న నమ్మకం మాకుంది’ అని ఆయన విశ్వాసం ప్రకటించారు.

 ‘పింక్’ ప్రభావం: ఎప్పుడో ఏడాది క్రితం ఒకే ఒక టెస్టు ఆడిన లెఫ్టార్మ్ స్పిన్నర్ స్టీవ్ ఓ కీఫ్‌ను ఆసీస్ జట్టు హడావిడిగా పిలిపించి అడిలైడ్ టెస్టు జట్టులో స్థానం కల్పించింది. అతను దేశవాళీలో పింక్ బంతితో ఆడిన మూడు మ్యాచ్‌లలో కలిపి 18 వికెట్లు తీయడమే అందుకు కారణం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement