
మల్లయోధుడిని మట్టికరిపించిన అమ్మాయి
బరేలీ: రెజ్లింగ్ పోటీలను సాధారణంగా పురుషులు, మహిళల విభాగాల్లో నిర్వహిస్తారు. అందులోనూ శరీర బరువును బట్టి కేటగిరిలుంటాయి. అయితే అమ్మాయి, పురుష రెజ్లర్ తలపడితే ఎలా ఉంటుంది? అందులోనూ అమ్మాయి తన కంటే అనుభవజ్ఞుడు, ఎక్కువ బరువున్న కుస్తీ యోధుడి తలపడితే ఎవరు గెలుస్తారు? ఇంకెవరు పురుష రెజ్లరే గెలవాలి కదూ! అయితే ఉత్తరాఖండ్కు చెందిన 17 ఏళ్ల అమ్మాయి సీనియర్ పురుష రెజ్లర్ను మట్టికరిపించి సంచలనం సృష్టించింది.
బరేలిలో ప్రతి ఏటా రెజ్లింగ్ పోటీలు నిర్వహిస్తుంటారు. స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ కూడా గతంలో ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈసారి నిర్వహించిన పోటీల్లో హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్
రెజ్లర్లు పాల్గొన్నారు. శుక్రవారం పోటీలు ముగిసిన తర్వాత పురుష రెజ్లర్లకు ఊహించని సవాల్ ఎదురైంది. నేహా తోమర్ అనే అమ్మాయి తనతో పోటీ పడాల్సిందిగా సవాల్ విసిరింది. అయితే అమ్మాయితో పోటీ ఏంటనుకుని కుస్తీ యోధులు మొదట్లో తేలిగ్గా తీసుకున్నారు. నేహా పలుమార్లు సవాల్ చేయడంతో సోనూ పహిల్వాన్ అనే రెజ్లర్ పోటీకి అంగీకరించాడు. నేహా కంటే అతను 16 కిలోల బరువు అధికంగా ఉన్నాడు. అందులోనూ చాలా సీనియర్. ఇంకేం నేహా ఓటమి లాంఛనమేనని అందరూ అనుకున్నారు. అయితే నేహా.. సోనూ పహిల్వాన్ను ఓ పట్టు పట్టింది. అతన్ని ముప్పుతిప్పలు పెట్టి మట్టికరిపించింది. అక్కడున్న రెజ్లర్లతో సహా ప్రేక్షకులందరూ ఆశ్చర్యపోయారు. నేహా అద్భుత విజయాన్ని అందరూ ప్రశంసించారు.
40 ఏళ్లకు పైగా ప్రతి ఏటా కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నా ఓ అమ్మాయి పురుష రెజ్లర్ను ఓడించడం ఇదే తొలిసారని నిర్వాహకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నేహా భవిష్యత్లో అంతర్జాతీయ పోటీల్లో దేశానికి పతకాలు అందిస్తుందని అన్నారు.