19 మంది రష్యా రోయర్లపై నిషేధం
లుసానే: రియో ఒలింపిక్స్‌కు సమయం దగ్గరపడుతున్నా... రష్యా అథ్లెట్లపై నిషేధం మాత్రం ఆగడం లేదు. తాజాగా 19 మంది రోయర్లను గేమ్స్‌లో పాల్గొనకుండా ప్రపంచ రోయింగ్ సమాఖ్య (ఎఫ్‌ఐఎస్‌ఏ) అడ్డుకుంది. ఐదుగురు కనోయిస్ట్‌లు, ఇద్దరు మోడ్రన్ పెంటాథ్లాన్ అథ్లెట్లతో కలిపి గత ఆదివారం వరకు మొత్తం 41 మందిపై నిషేధం విధించారు.
ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లతో కలుపుకుంటే ప్రస్తుతం ఈ సంఖ్య 108కి చేరింది. రష్యా నుంచి 28 మంది రోయర్లు రియోకు అర్హత సాధిం చగా, ఇందులో ఇప్పటివరకు మొత్తం 22 మందిపై అనర్హత వేటు పడిందని ఎఫ్‌ఐఎస్‌ఏ వెల్లడించింది. జూడో, ఈక్వెస్ట్రియాన్, టెన్నిస్, షూటింగ్ క్రీడాకారులు మాత్రం నిషేధం నుంచి తప్పించుకున్నారు.