మన ముద్ర కనిపించింది | 2014 Sports rewind | Sakshi
Sakshi News home page

మన ముద్ర కనిపించింది

Published Fri, Dec 26 2014 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 6:44 PM

మన ముద్ర కనిపించింది

మన ముద్ర కనిపించింది

అంతర్జాతీయ టోర్నీలకు వెళ్తారు... రిక్తహస్తాలతో తిరిగి వస్తారు... భారత క్రీడాకారుల గురించి ఒకప్పుడు ఈ తరహా వ్యాఖ్యలు వినిపించేవి. కానీ కొన్నాళ్లుగా ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. మరీ ముఖ్యంగా ఈ ఏడాది అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారతీయ క్రీడాకారులు తమదైన ముద్ర వేశారు. సకల సౌకర్యాలు కల్పిస్తే తమలో కూడా క్రీడా శక్తిగా ఎదిగే లక్షణాలు ఉన్నాయని నిరూపించారు. ఈ ఏడాది కనీసం ఐదారు క్రీడాంశాల్లో మనోళ్లు ప్రశంసనీయ పురోగతి సాధించారు. వచ్చే ఏడాది మరిన్ని మెరుపులు మెరిపించేందుకు సిద్ధంగా ఉన్నామని సంకేతాలు ఇచ్చారు. 2014లో అంతర్జాతీయ క్రీడా పోటీల్లో భారత క్రీడాకారుల ప్రదర్శన ఓసారి గుర్తు చేసుకుందాం.     
 - సాక్షి క్రీడావిభాగం
 
 టెన్నిస్
 సానియా మేనియా
 అందరి అంచనాలను తారుమారు చేస్తూ, విమర్శకుల నోళ్లు మూయిస్తూ ఈ ఏడాది భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కొత్త శిఖరాలను అధిరోహించింది. నమ్మశక్యంకాని విజయాలు సాధించి పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో హొరియా టెకావ్ (రుమేనియా)తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచిన సానియా... యూఎస్ ఓపెన్‌లో బ్రూనో సోరెస్ (బ్రెజిల్)తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను సాధించింది.
 
 కారా బ్లాక్‌తో కలిసి మూడు డబ్ల్యూటీఏ డబుల్స్ టైటిల్స్‌ను సొంతం చేసుకున్న ఈ హైదరాబాదీ మరో నాలుగు టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచింది. సీజన్ ముగింపు టోర్నీ ‘డబ్ల్యూటీఏ ఫైనల్స్’లో కారా బ్లాక్‌తో కలిసి సానియా టైటిల్ నెగ్గడం ఆమె కెరీర్‌లోనే గొప్ప విజయంగా చెప్పవచ్చు. ఇక ఆసియా క్రీడల్లో సాకేత్ మైనేనితో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణం, ప్రార్థన తొంబారేతో కలిసి మహిళల డబుల్స్‌లో కాంస్యం సాధించి సానియా తన విమర్శకులకు తగిన సమాధానం ఇచ్చింది. మరోవైపు భారత పురుషుల టెన్నిస్‌కు ఈ ఏడాది అంతగా కలిసి రాలేదు. డబుల్స్‌లో లియాండర్ పేస్, బోపన్న వేర్వేరు భాగస్వాములతో కలిసి ఒక్కో టైటిల్‌ను సాధిం చారు. ఏడాది చివర్లో విజయ్ అమృత్‌రాజ్ ఆధ్వర్యంలో చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్), మహేశ్ భూపతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) సందడి చేశాయి. స్టార్లు ఫెడరర్, జొకోవిచ్, ఇవనోవిచ్ తదితరులు తమ ఆటతీరుతో భారత ప్రేక్షకులను అలరించారు.
 
 హాకీ   కొత్త ఊపిరి
 జాతీయ క్రీడకు ఈ ఏడాది అంతా కలిసొచ్చింది. ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన టీమిండియా 2016 రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో మరోసారి రజతం నెగ్గింది. ప్రపంచకప్‌లో నిరాశపరిచినా... చాంపియన్స్ ట్రోఫీలో నాలుగో స్థానాన్ని సంపాదించింది. విశ్వవిజేత ఆస్ట్రేలియాతో వారి గడ్డపైనే  జరిగిన 4 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3-1తో నెగ్గి చరిత్ర సృష్టించింది.
 
 బాక్సింగ్  మోదం, ఖేదం
 ఈ ఏడాది భారత బాక్సింగ్ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. ఆసియా క్రీడల్లో మేరీకోమ్ (51 కేజీలు) స్వర్ణం సాధించగా... ఇవే క్రీడల్లో సెమీఫైనల్ ఫలితంపై నిరసన వ్యక్తం చేస్తూ సరితా (60 కేజీలు) కాంస్య పతకాన్ని స్వీకరించేందుకు నిరాకరించింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సర్జూబాలా (48 కేజీలు), స్వీటీ (81 కేజీలు) రజ తం గెలిచింది. ప్రపంచ యూత్ బాక్సింగ్‌లో వైజాగ్ బాక్సర్ కాకర శ్యామ్ కాంస్యం నెగ్గగా...నేషన్స్ కప్‌లో నిజామాబాద్ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణం దక్కించుకుంది. ఆసియా క్రీడల్లో వికాస్ (75 కేజీలు), సతీశ్ (ప్లస్ 91 కేజీలు) కాంస్యాలతో సరిపెట్టుకున్నారు. కామన్వెల్త్‌లో దేవేంద్రో, విజేందర్, మన్‌దీప్, సరితా దేవి రజత పతకాలను సాధించారు. ‘బాక్సింగ్ ఇండియా’ను గుర్తించబోమని భారత ఒలింపిక్ సంఘం స్పష్టం చేయగా... కోర్టులో కేసు గెలిచి ‘అర్జున అవార్డు’ను మనోజ్ దక్కించుకున్నాడు.
 
 షూటింగ్  గురి అదిరింది
 ఈ ఏడాది భారత షూటింగ్ ప్రయాణం ‘పిస్టల్ షూటర్’ జీతూ రాయ్ చుట్టూ సాగింది. ఈ సంవత్సరం తాను బరిలోకి దిగిన ప్రతి టోర్నమెంట్‌లో జీతూ రాయ్ పతకంతో తిరిగి వచ్చాడు. ప్రపంచకప్‌లో మూడు పతకాలు సాధించిన ఈ ఆర్మీ షూటర్ ఆ తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌లో, ఆసియా క్రీడల్లో 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో పసిడి పతకాలు నెగ్గాడు. దాంతోపాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకం నెగ్గి 2016 రియో ఒలింపిక్స్‌కు బెర్త్ ఖాయం చేసుకున్నాడు. స్టార్ షూటర్ అభినవ్ బింద్రా కామన్వెల్త్ గేమ్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో స్వర్ణం నెగ్గడంతోపాటు ఆసియా క్రీడల్లో రెండు కాంస్యాలు సాధించి తనలో ఇంకా చేవ తగ్గలేదని నిరూపించుకున్నాడు. గగన్ నారంగ్, ప్రకాశ్ నంజప్ప, సంజీవ్ రాజ్‌పుత్... మహిళా షూటర్లు రాహీ సర్నోబాత్, అయోనిక పాల్, అపూర్వీ చందేలా, మలైకా గోయల్ తదితరులు కూడా కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించి భారత ‘గన్’ పవర్’ను చాటుకున్నారు.
 
 బిలియర్డ్స్, స్నూకర్  పంకజ్ ప్రతాపం
 తన జోరును కొనసాగిస్తూ పంకజ్ అద్వానీ తన ఖాతాలో 12వ ప్రపంచ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. 12 ప్రపంచ టైటిల్స్‌లో నాలుగు ఈ ఏడాది సాధించడం విశేషం. బెంగళూరుకు చెందిన పంకజ్ ఈ సంవత్సరం టైమ్ ఫార్మాట్, పాయింట్ల ఫార్మాట్, వరల్డ్ టీమ్ బిలియర్డ్స్, వరల్డ్ సిక్స్-రెడ్ స్నూకర్ టోర్నీల్లో విజేతగా నిలిచాడు. అయితే ఏడాది చివర్లో సొంతగడ్డపై జరిగిన వరల్డ్ స్నూకర్  చాంపియన్‌షిప్‌లో మాత్రం పంకజ్ క్వార్టర్ ఫైనల్లో 14 ఏళ్ల చైనా కుర్రాడు యాన్ బింగ్‌తావో చేతిలో ఓడిపోయాడు.
 
 చెస్  గొప్ప ఎత్తులు
 ఏడాది పొడవునా మన చెస్ క్రీడాకారులు నిలకడగా రాణించారు. చెస్ ఒలింపియాడ్ ఓపెన్ విభాగంలో భారత్ తొలిసారి కాంస్య పతకాన్ని నెగ్గి చరిత్ర సృష్టించింది. పరిమార్జన్ నేగి, సేతురామన్, శశికిరణ్, అధిబన్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ లలిత్‌బాబు సభ్యులుగా ఉన్నారు. కోనేరు హంపి దిలిజాన్, తాష్కెంట్‌లలో జరిగిన మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌లలో విజేతగా నిలిచి ఓవరాల్‌గా రెండో స్థానాన్ని సంపాదించింది. క్యాండిడేట్స్ టోర్నీ, బిల్బావో మాస్టర్స్, లండన్ క్లాసిక్ టోర్నీల్లో విజేతగా నిలిచిన విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మరోసారి కార్ల్‌సన్ (నార్వే) చేతిలో ఓడిపోయాడు. చివరగా అండర్-16 చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్టు పసడి పతకాన్ని నెగ్గి ఏడాదిని ఘనంగా ముగించింది.
 
 రెజ్లింగ్  పట్టు సడలించలేదు
 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మినహా... మిగతా అన్ని ఈవెంట్స్‌లో భారత రెజ్లర్లు పతకాల పట్టు పట్టారు. కామన్వెల్త్ గేమ్స్‌లో యోగేశ్వర్ దత్, సుశీల్ కుమార్, అమిత్ కుమార్, వినేశ్ స్వర్ణ పతకాలను సాధించారు. ఆసియా క్రీడల్లోనూ యోగేశ్వర్ దత్ రాణించి పసిడి పతకం నెగ్గాడు. 1986 తర్వాత ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గిన భారత రెజ్లర్‌గా అతను గుర్తింపు పొందాడు.
 
 ఆర్చరీ  గురి తడబాటు
 రికర్వ్ విభాగంతో పోలిస్తే కాంపౌండ్ ఆర్చర్లు మెరుగ్గా రాణించారు. దీపిక కుమారి నిరాశపరచగా... కాంపౌండ్ విభాగంలో అభిషేక్ వర్మ సత్తా చాటుకున్నాడు. ఆసియా క్రీడల్లో అతను టీమ్ విభాగంలో స్వర్ణం నెగ్గడంతోపాటు వ్యక్తిగత విభాగంలో రజతం సాధించాడు. యూత్ ఒలింపిక్స్‌లో అతాను దాస్ కాంస్య పతకాన్ని సాధించాడు.
 
 ఫుట్‌బాల్  ఐఎస్‌ఎల్ హవా
 తొలిసారి జరిగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) విజయవంతం కావడం భారత ఫుట్‌బాల్‌కు ఊతమిచ్చింది. దక్షిణాసియా మహిళల చాంపియన్‌షిప్‌లో భారత్ ‘హ్యాట్రిక్’ సాధించింది. పురుషుల జట్టు మాత్రం చెప్పుకోతగ్గ విజయాలు సాధించలేదు.
 
 వెయిట్‌లిఫ్టింగ్  డోపీల్లేకుండా
 ఈ ఏడాది భారత్ నుంచి ఒక్క వెయిట్‌లిఫ్టర్ కూడా డోపింగ్ పరీక్షలో పట్టుబడకపోవడం శుభవార్త. రాగాల వెంకట్ రాహుల్ యూత్ ఒలింపిక్స్‌లో రజతం... కామన్వెల్త్ లో మత్స సంతోషి రజతం నెగ్గారు. కామన్వెల్త్‌లో సతీశ్ శివలింగం, రవికుమార్ వరుసగా స్వర్ణ, రజతాలు గెలిచారు.
 
 స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్
 15 స్వర్ణాలు, 30 రజతాలు, 19 కాంస్యాలు సాధించి మొత్తం
 64 పతకాలతో ఐదో స్థానంలో నిలిచింది.
 
 దక్షిణ కొరియాలోని ఇంచియాన్ నగరంలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ 11 స్వర్ణాలు, 10 రజతాలు, 36 కాంస్యాలతో కలిపి మొత్తం
 57 పతకాలు సాధించి ఎనిమిదో స్థానాన్ని దక్కించుకుంది.
 
 ప్రపంచ నాలుగో ర్యాంక్‌కు శ్రీకాంత్
 ఈ ఏడాది సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత బ్యాడ్మింటన్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ర్యాంకుల్లో నాలుగో స్థానానికి చేరాడు. గతంలో ప్రకాశ్ పదుకొనే (1వ ర్యాంక్), గోపీచంద్ (4వ ర్యాంక్) మాత్రమే భారత్ నుంచి టాప్-5 ర్యాంక్‌లు సాధించారు. ఈ ఏడాది ఆరంభంలో 45వ ర్యాంక్‌లో ఉన్న శ్రీకాంత్ అనూహ్యమైన ఆటతీరుతో అద్భుతమైన ప్రగతి సాధించి నాలుగో ర్యాంక్‌కు చేరాడు. ‘ఈ సీజన్‌లో నా ఆటతీరు పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాను. నాలుగో ర్యాంక్‌కు చేరతానని ఊహించలేదు. వచ్చే ఏడాది రియో ఒలింపిక్స్ అర్హత టోర్నీలు ఉన్నాయి.  కాబట్టి మరింత మెరుగ్గా ఆడటమే లక్ష్యం’ అని శ్రీకాంత్ తెలిపాడు. ఏడాది మధ్యలో గాయమైనా శ్రీకాంత్ ఇంత గొప్ప ర్యాంక్ సాధించడం విశేషమని కోచ్ గోపీచంద్ ప్రశంసించారు. మహిళల విభాగంలో సైనా నెహ్వాల్ నాలుగో ర్యాంక్‌లోనే కొనసాగుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement