మనసులు గెలుచుకుంది!
సాక్షి క్రీడావిభాగం
ఏడేళ్ల క్రితం... ఒకదాని వెంట మరో వివాదం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి. దుస్తులు-ఫత్వాలు, సెక్స్‌పై వ్యాఖ్యలు, జాతీయ పతాకానికి అవమానం, మసీదులో షూటింగ్... ఎంత స్థితప్రజ్ఞత కనబర్చినా, వీటన్నింటినీ తట్టుకోవడం 21 ఏళ్ల సానియా మీర్జా వల్ల కాలేదు. ఏం చేసినా కొత్త వివాదానికి కారణం కావడంతో ఆమె కన్నీళ్ల పర్యంతమైంది.
‘నేను తప్పు చేస్తే అనండి కానీ చేసే ప్రతీదీ తప్పంటే నేనేమీ చేయలేను’ అంటూ ఇకపై భారత్‌లో టెన్నిస్ ఆడలేనని తనపై తాను నిషేధం విధించుకుంది. నాలుగేళ్ల తర్వాత ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌తోనే ఆమె మళ్లీ భారత అభిమానుల ముందుకు వచ్చింది. బీజింగ్ నుంచి లండన్ ఒలింపిక్స్ వరకు... పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో పెళ్లి నుంచి ‘తెలంగాణ రాష్ట్ర ప్రచారకర్త’ కావడం వరకు ప్రతీసారి ఆమె తన దేశభక్తిపై పరీక్షను ఎదుర్కొంది. ఎప్పటికప్పుడు నేను భారతీయురాలినే అని నిరూపించుకుంటూ రావాల్సి వచ్చింది.
అదే సానియా ఇప్పుడు ప్రపంచ పటంపై భారత కీర్తి పతాకను ఎగురవేసింది. ఎవరికీ అందనంత ఎత్తులో శిఖరాన నిలిచింది. ఇప్పుడు ఆమె అందరి మనిషి. ఈ ఘనత అద్వితీయం. ఈ గెలుపు ఆమె ఒక్కదానిదే కాదు. ఇది ప్రతీ భారతీ యుడి గెలుపు. అడ్డంకులు, అవరోధాలు ఎన్ని ఎదురైనా ముందుకు సాగాలనే మహిళా స్ఫూర్తికి సాని యా ఇప్పుడు అసలు సిసలు బ్రాండ్ అంబాసిడర్.
పుష్కర కాలపు ప్రస్థానం...
2003లో జూనియర్ వింబుల్డన్ డబుల్స్ టైటిల్ గెలిచిన నాటినుంచి పన్నెండేళ్ల తర్వాత డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌గా ఎదగడం వరకు సానియా మీర్జా కెరీర్‌లో ఎన్నో మలుపులున్నాయి. భారత్‌లో టెన్నిస్‌కు అంత ప్రోత్సాహకర పరిస్థితులు లేని సమయంలో కూడా స్వశక్తితోనే ఎదగడం ఆమె గొప్పతనం. 2004 నుంచి డబ్ల్యూటీఏ సర్క్యూట్‌లో ఉన్న సానియా, ఈ 12 ఏళ్లలో 2005, 2008 మినహా ప్రతీ ఏడాది కనీసం ఏదో ఒక టైటిల్ గెలుచుకుంది. సానియా కెరీర్‌లో ఏ దశలోనూ పూర్తి స్థాయి కోచ్ లేరు. అప్పుడప్పుడు తాత్కాలిక ప్రాతిపదికన ఒకరిద్దరిని ట్రావెలింగ్ కోచ్‌గా పెట్టుకున్నా... ఆమెను తీర్చిదిద్దడంలో వారి పాత్ర చాలా స్వల్పం.
ఎక్కువ భాగం తండ్రి ఇమ్రాన్ మీర్జా మార్గదర్శనమే కొనసాగింది. తన బలహీనత అయిన సర్వ్ అండ్ వాలీని వెనక్కి నెట్టి... బలమైన ఫోర్‌హ్యాండ్‌తో అద్భుతాలు సాధించింది. 2007లో తన సింగిల్స్ అత్యుత్తమ ర్యాంక్ 27కు చేరిన సానియాను... కొద్ది రోజులకే గాయాలు వెంటాడాయి. దాంతో సింగిల్స్‌కు గుడ్‌బై చెప్పి డబుల్స్‌పై దృష్టి సారించాలనే ఆమె ముందుచూపు మంచి ఫలితాలు ఇచ్చింది. 14 మంది వేర్వేరు భాగస్వాములతో కలిసి సానియా 26 టైటిల్స్ సాధించడంలో ఆమె ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది.
సూపర్ ప్రదర్శన...
సానియా కెరీర్‌లో 2013, 2014 అద్భుతంగా సాగాయి. సింగిల్స్‌ను పూర్తిగా వదిలి 2013లో ఒక్క డబుల్స్‌లోనే బరిలోకి దిగింది. ఏకంగా ఐదు డబ్ల్యూటీఏ టోర్నీలలో విజేతగా నిలిచిన సానియా, తొలి సారి 9వ ర్యాంక్‌తో సీజన్‌ను ముగించింది. 2014లో కూడా ఇదే జోరు కొనసాగింది. ఈసారి కూడా మూడు టైటిల్స్ సాధించి కెరీర్ బెస్ట్ అయిన ఐదో ర్యాంక్‌కు చేరుకుంది. 2015లో అయితే ఇప్పటికే నాలుగు టోర్నీలు తన ఖాతాలో వేసుకుంది.
అదీ గెలిస్తే...
నాకు రెండే కోరికలు... ఒకటి ప్రపంచ నంబర్‌వన్ కావడం, రెండోది మహిళల డబుల్స్‌లో గ్రాండ్‌స్లామ్ గెలవడం... ఇటీవల సానియా చేసిన వ్యాఖ్య ఇది. ఇప్పుడు నంబర్‌వన్ కోరిక తీరిపోయింది. 2011లో వెస్నినా (రష్యా)తో కలిసి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ వరకు వచ్చిన మీర్జా అడుగు దూరంలో ఆ అవకాశం కోల్పోయింది. సానియా-హింగిస్ జోడి తాజా ఫామ్ చూస్తే వచ్చే నెలలో జరిగే ఫ్రెంచ్ ఓపెన్‌తోనే ఆ కోరిక తీరుతుందేమో. మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ మూడు గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన ఆమెకు వింబుల్డన్ మాత్రం ఇంకా అందలేదు. దీంతో పాటు వచ్చే ఏడాది రియో ఒలింపిక్స్‌లో పతకం కూడా లక్ష్యంగా పెట్టుకున్న సానియా మరిన్ని విజయాలు సాధించాలనేదే ప్రతీ భారతీయుడి కోరిక.
సానియా కెరీర్‌గ్రాఫ్
డబ్ల్యూటీఏ డబుల్స్ టైటిల్స్: 26
డబ్ల్యూటీఏ సింగిల్స్ టైటిల్స్: 1
డబుల్స్ గెలుపు-ఓటముల రికార్డు: 352-173
సింగిల్స్ గెలుపు- ఓటముల రికార్డు: 271-161
గ్రాండ్‌స్లామ్ కెరీర్: మిక్స్‌డ్ డబుల్స్‌లో 3 టైటిల్స్, రెండు సార్లు రన్నరప్
సింగిల్స్ కెరీర్ అత్యుత్తమ ర్యాంక్: 27 (2007)
డబుల్స్ కెరీర్ అత్యుత్తమ ర్యాంక్: 1 (2015)
ఆసియా క్రీడల్లో ఏడు పతకాలు
కామన్వెల్త్ క్రీడల్లో 1 రజతం, 1 కాంస్యం
కెరీర్ ప్రైజ్‌మనీ: 43 లక్షల 59 వేల డాలర్లు (దాదాపు రూ. 27 కోట్ల 15 లక్షలు)