ఇంకొక్క అడుగే...
♦ టైటిల్‌కు విజయం దూరంలో సానియా-హింగిస్ జంట
♦ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో ఇండో-స్విస్ ద్వయం
మెల్‌బోర్న్: జతగా వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్ సాధించే దిశగా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, స్విట్జర్లాండ్ దిగ్గజం మార్టినా హింగిస్ మరో అడుగు ముందుకేశారు. గతేడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో జోడీగా మహిళల డబుల్స్ టైటిల్స్ నెగ్గిన వీరిద్దరు తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ ఫైనల్లోకి దూసుకెళ్లారు.
బుధవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-1, 6-0తో జూలియా జార్జెస్ (జర్మనీ)-కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) జంటను చిత్తుగా ఓడించింది. కేవలం 54 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో సానియా-హింగిస్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. మొత్తానికి సానియా-హింగిస్‌లకిది వరుసగా 35వ విజయం కావడం విశేషం.
శుక్రవారం జరిగే ఫైనల్లో ఏడో సీడ్ ఆండ్రియా హలవకోవా-లూసీ హర్డెకా (చెక్ రిపబ్లిక్) జంటతో ఈ ఇండో-స్విస్ ద్వయం తలపడుతుంది. సెమీస్‌లో హలవకోవా-హర్డెకా 3-6, 6-3, 6-1తో యి ఫాన్ జు-సాయ్‌సాయ్ జెంగ్ (చైనా)లపై గెలిచారు.
బోపన్న జంటకు నిరాశ
మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్న (భారత్)-యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ) జంట క్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించింది. అన్‌సీడెడ్ జంట ఆండ్రియా క్లెపాక్ (స్లొవేనియా)-ట్రీట్ హుయె (ఫిలిప్పీన్స్) ద్వయం 6-2, 7-5తో మూడో సీడ్ బోపన్న-జాన్ చాన్ జంటను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది.
ముగిసిన ప్రాంజల పోరాటం
జూనియర్ విభాగంలో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. బాలికల సింగిల్స్‌లో తెలుగు అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల, కర్మాన్ కౌర్ థండి క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. పదో సీడ్ ప్రాంజల 5-7, 5-7తో ఎనిమిదో సీడ్ అనస్తాసియా పొటపోవా (రష్యా) చేతిలో; కర్మాన్ కౌర్ 6-3, 5-7, 5-7తో సారా టామిక్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడారు. బాలికల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రాంజల-కర్మాన్ జంట 6-7 (3/7), 5-7తో మాడిఇంగ్లిస్-జైమీ జోడీ చేతిలో ఓడారు.