ఏడాదికి ముందే 2015 ప్రపంచ కప్ టిక్కెట్ల విక్రయం
2015లో జరిగే ఐసీసీ ప్రపంచ క్రికెట్ కప్ టిక్కెట్లను సరిగ్గా ఏడాది ముందే విక్రయానికి ఉంచనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి టిక్కెట్లను అమ్మనున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ప్రపంచ కప్నకు ఆతిథ్యమిస్తున్నాయి.
ప్రపంచ కప్ మ్యాచ్లను ప్రత్యక్షంగా తిలకించేందుకు దాదాపు పదిలక్షల మందికి పైగా అభిమానులు హాజరవుతారని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇక టీవీల ద్వారా వందకోట్లమందికి పైగా వీక్షిస్తారని అంచనా వేశారు. ఫైనల్ సహా అన్ని మ్యాచ్లకు పిల్లల కోసం టిక్కెట్లను ప్రత్యేకంగా విక్రయించనున్నారు. కనీస ధర 320 రూపాయల నుంచి అందుబాటులో ఉంటాయి. ఇక పెద్దల టిక్కెట్లను కనీస ధర 1300 రూపాయల నుంచి అందుబాటులో ఉంచనున్నారు. కుటుంబంతో కలసి వచ్చే వారి కోసం మరింత తక్కువ ధరతో టిక్కెట్లను విక్రయించనున్నారు. నలుగురు కుటుంబ సభ్యులందరికీ కలిపి కనీస ధర 3200 రూపాయల నుంచి అందుబాటులో ఉంటాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లు దాదాపు 20 ఏళ్ల తర్వాత ప్రపంచ కప్నకు ఆతిథ్యమివ్వనుండటంతో అభిమానుల నుంచి మంచి స్పందన ఉంటుందని భావిస్తున్నారు.