న్యూఢిల్లీ: వచ్చే నెలలో ఐబా ఆధ్వర్యంలో వెనుజులాలో జరుగనున్న ప్రొ బాక్సింగ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్కు ముగ్గురు భారత బాక్సర్లు అర్హత సాధించారు. డబ్యూబీసీ టైటిల్ విజేత నీరజ్ గోయత్(69 కేజీ)తో పాటు, గౌరవ్ బిధురి(52 కేజీ), దిల్బా సింగ్(81 కేజీ)లు ప్రొ బాక్సింగ్ క్వాలిఫయింగ్ టోర్నీకి అర్హత సాధించారు. 69 కేజీల విభాగంలో భారత్ నుంచి మరే బాక్సర్ అర్హత సాధించకపోవడంతో నీరజ్కు అవకాశం దక్కింది.
మరోవైపు వరల్డ్ డబ్యూఎస్బీ ప్రొఫెషనల్ బాక్సింగ్లో తన గెలుపు-ఓటములు సమానంగా ఉండటంతో గౌరవ్ అర్హత సాధించాడు. ఇదే కేటగిరీలో భారత్ నుంచి ఇతర బాక్సర్లు ఎవరూ ఒలింపిక్స్కు అర్హత సాధించలేకపోవడం కూడా గౌరవ్ కు కలిసొచ్చింది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ క్వాలిఫయింగ్ టోర్నీలో సుమిత్ సంగ్వాన్ (81) క్వార్టర్ ఫైనల్లో ఓడిపోవడంతో అతని రియో అవకాశాలకు గండి పడింది. దీంతో అదే కేటగిరీలో ప్రొ బాక్సర్ దిల్బాగ్ సింగ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ప్రొ బాక్సర్ల ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ జూలై 3 నుంచి 8వ తేదీ వరకూ జరగనుంది.