రష్యా 'పంచ్' కు క్లియరెన్స్
మాస్కో: రియో ఒలింపిక్స్లో పాల్గొనే రష్యా బాక్సర్లకు క్లియరెన్స్ లభించింది. ఈ మేరకు గురువారం అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్(ఐబా).. రష్యా బాక్సర్లు ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు ఆమోదం తెలిపింది. గత నెల 24వ తేదీన రష్యా బాక్సర్ల వ్యక్తిగత యాంటీ డోపింగ్ రికార్డును పరిశీలించిన అనంతరం పదకొండు మందితో కూడిన ఆ జట్టుకు ఐబా క్లీన్చిట్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. రష్యా బాక్సింగ్ జట్టు రియోలో పాల్గొనే విషయాన్ని అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ(ఐఓసీ) ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నిబంధనల ప్రకారం రియోలో పాల్గొనే రష్యా అథ్లెట్లు ముందుగా ఆయా క్రీడల అంతర్జాతీయ సమాఖ్యల ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది. దీనిలో భాగంగా రష్యా ఆటగాళ్లపై డోపింగ్ రికార్డును ఆయా ఒలింపిక్ సమాఖ్యలు పరీక్షిస్తున్నాయి. 2012 నుంచి 2015 వరకూ రష్యా పెద్ద ఎత్తును డోపింగ్ కు పాల్పడింది. దాదాపు 30 క్రీడల్లో ఆయా ఆటగాళ్లు డోపింగ్కు తెరలేపడంతో యావత్ రష్యాపైనే నిషేధం విధించాలంటూ పెద్ద ఎత్తును విమర్శలు వెలుగుచూశాయి. కాగా, ఐఓసీ నిర్ణయంతో రష్యా క్రీడాకారులకు కాస్త ఉపశమనం లభించింది.