జాదవ్ హాఫ్ సెంచరీ.. నిరాశపరిచిన ధోనీ
హరారే: జింబాబ్వేతో మూడో టి-20 మ్యాచ్లో టీమిండియా పరుగుల వేటలో పెద్దగా రాణించలేకపోయింది. భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 138 పరుగులు చేసింది. దీంతో జింబాబ‍్వేకు 139 పరుగుల కష్టసాధ్యంకాని లక్ష్యాన్ని నిర్దేశించింది. కేదార్ జాదవ్ (42 బంతుల్లో 58) హాఫ్ సెంచరీతో రాణించాడు. కే ఎల్ రాహుల్ 22, అంబటి రాయుడు 20, అక్షర్ పటేల్ 20 (నాటౌట్) పరుగులు చేశారు. కాగా కెప్టెన్ ధోనీ (9) మరోసారి నిరాశపరచగా, మనీష్ పాండే సున్నా చుట్టేశాడు. జింబాబ్వే బౌలర్లు టిరిపనో మూడు, మడ్జివా, క్రెమెర్ చెరో వికెట్ తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో ఓపెనర్ మణ్దీప్ (4)వికెట్ కోల్పోయింది. మడ్జివా వేసిన ఆ మరుసటి ఓవర్లో భారత ఆటగాళ్లు రాహుల్, మనీశ్ పాండే వరుస బంతుల్లో అవుటయ్యారు. ఆ తర్వాత రాయుడు, జాదవ్ జట్టును ఆదుకునేందుకు ప్రయత్నించారు. క్రెమెర్ బౌలింగ్లో రాయుడు క్యాచవుటయ్యాడు. జాదవ్ పోరాటం చేస్తున్నా.. ధోనీ అతనికి అండగా నిలవలేకపోయాడు. టిరిపనో బౌలింగ్లో ధోనీ బౌల్డయ్యాడు. హాఫ్ సెంచరీ చేశాక జాదవ్ అవుటయ్యాడు. చివర్లో అక్షర్ పటేల్ దూకుడుగా ఆడాడు.