కోల్ కతా: భారత్ తో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ ఓటమిని జీర్ణించుకోలేని ఆ దేశ ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత డీన్ జోన్స్.. భారత్ గెలుపుకు వర్షమే కారణమని వ్యాఖ్యానించి నవ్వుల పాలైన సంగతి తెలిసిందే. భారత జట్టు విజయం సాధించాలంటే వర్షం పడాలేమో అని వ్యాఖ్యానించాడు. దాంతో భారత అభిమానులు జోన్స్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నీకేమైనా బ్రెయిన్ ఫేడ్ అయ్యిందా అంటూ క్రికెట్ ఫ్యాన్స్ మండిపడ్డారు. ఆసీస్ క్రికెట్ జట్టు తొండాటను ఆడటంలో ఎప్పుడూ ముందుంటుందని, దానికి ఆ దేశ మాజీ క్రికెటర్లు మద్దతుగా నిలుస్తారనడానికి ఇదే నిదర్శమని విమర్శల వర్షం కురిసింది.
అయితే మూడో వన్డేలో భారత విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకున్న తరువాత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను కొనియాడిన జోన్స్ విమర్శలకు గురయ్యాడు. హార్దిక్ బౌలింగ్ యాక్షన్ అచ్చం వెస్టిండీస్ ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం మైకేల్ హోల్డింగ్ లా ఉందంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. ఇక్కడ స్పీడ్ సంగతిని పక్కన పెడితే హోల్డింగ్ తరహాలోనే పాండ్యా బౌలింగ్ చేస్తున్నాడని ప్రశంసించాడు. కాగా, డీన్ జోన్స్ తాజా వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.
పాండ్యాలాంటి సాధారణ బౌలర్ ని దిగ్గజ బౌలర్ హోల్డింగ్ తో ఎలా పోల్చావంటూ ఒక అభిమాని విమర్శించగా, నువ్వొక పెద్ద క్రికెట్ అభిమానిలా కనబడతావ్. కానీ క్రికెటర్లను ఎలా పోల్చాలి అనేది నీకు ఇంకా తెలియలేదు. నువ్వు ఎక్కువగా రేడియోలో క్రికెట్ ను ఫాలో అవుతావేమో అంటూ మరొక అభిమాని మండిపడ్డాడు.ఒక విషయాన్ని మాట్లాడేటప్పుడు అందులో పస ఉండాలనే సంగతి గుర్తు పెట్టుకో డీన్ జోన్స్ అంటూ మరో అభిమాని చురకలంటించాడు. ఆరంభపు మ్యాచ్ లోభారత జట్టు విమర్శించి విమర్శల పాలైన డీన్ జోన్స్, ఇప్పడు హార్దిక్ బౌలింగ్ యాక్షన్ పొగిడి విమర్శలను చవిచూడటం గమనార్హం.