
మరపురాని మధుర జ్ఞాపకాలు
భారత క్రికెట్‌కు ఇది పండగ వేళ... సాంప్రదాయ ఆటను అభిమానించే వారికి ఇదో ఉద్వేగభరిత క్షణం. క్రికెట్ ప్రపంచం కొత్తదిగా మారిపోయినా...
భారత క్రికెట్‌కు ఇది పండగ వేళ... సాంప్రదాయ ఆటను అభిమానించే వారికి ఇదో ఉద్వేగభరిత క్షణం. క్రికెట్ ప్రపంచం కొత్తదిగా మారిపోయినా, తరాల అంతరాలు ఉన్నా... ఎనిమిది పదుల వసంతాలుగా తెల్ల దుస్తుల క్రికెట్‌ను కాపాడుకుంటున్న అందరికీ ఇదో ఆనందకరమైన అనుభూతి. 1932లో ఎలాంటి హడావిడి లేకుండా మొదలైన భారత టెస్టు ప్రస్థానం ఇప్పుడు మరో మైలురాయిని చేరింది. టెస్టు చరిత్రలో 500 మ్యాచ్‌లు ఆడిన నాలుగో జట్టుగా టీమిండియా గుర్తింపు అందుకోనుంది. 285 మంది ఆటగాళ్లు, అందులో 32 మంది కెప్టెన్లు... ఎన్నో రికార్డులు, మరెన్నో ఘనతలు భారత టెస్టు క్రికెట్‌ను సుసంపన్నం చేశాయి.
ఈ నెల 22నుంచి న్యూజిలాండ్‌తో కాన్పూర్‌లో జరిగే టెస్టు ‘పాంచ్ సౌ’ సంబరాలకు వేదిక కానుంది. 500వ టెస్టు మ్యాచ్ అనే గణాంకం గ్రీన్ పార్క్ టెస్టును ఒక్కసారిగా ఆసక్తికరంగా మార్చేసింది. దీనిని చిరస్మరణీయం చేసుకునేందుకు ఆటగాళ్లతో పాటు బోర్డు కూడా సన్నద్ధమైంది.
84 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో మరపురాని, మరచిపోలేని ఎన్నో విజయాలు ఉన్నాయి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మళ్లీ మళ్లీ మది పులకించే మధుర ఘట్టాలకూ కొదవ లేదు. ఆంగ్లేయుల జెండా కింద ఆడటం ప్రారంభించిన దగ్గరినుంచి ప్రపంచ క్రికెట్‌ను శాసించే వరకు... తొలి గెలుపునుంచి ప్రపంచ నంబర్‌వన్ జట్టుగా ఎదగడం వరకు... క్రికెట్ తొలి తరంనుంచి నేటి మన తరం వరకు మనం గర్వపడే మరపురాని విజయాలు దక్కాయి. భారత జట్టు తమ 500వ టెస్టు ఆడేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో అభిమానుల మనసుల్లో నిలిచిపోయిన మణిపూసల్లాంటి పది అత్యుత్తమ టెస్టు మ్యాచ్‌ల విశేషాలను గుర్తు చేసుకుందాం.
వెస్టిండీస్‌తో (1971-పోర్ట్ ఆఫ్ స్పెయిన్)
వెస్టిండీస్‌పై 25వ ప్రయత్నంలో తొలిసారి భారత్‌కు గెలుపు రుచి చూపించిన టెస్టు ఇది. భారత స్పిన్నర్ల అద్భుత ప్రదర్శన (17 వికెట్లు)తో పాటు రెండో ఇన్నింగ్స్‌లో దిలీప్ సర్దేశాయ్ సెంచరీ, కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న గవాస్కర్ రెండు అర్ధ సెంచరీలు జట్టును గెలిపించాయి. 7 వికెట్లతో ఈ మ్యాచ్ గెలిచిన భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0తో సొంతం చేసుకుంది. తొలి ఇన్నింగ్‌సలో విండీస్ స్పిన్నర్ జాక్ నోరిగా 9 వికెట్లు తీయడం విశేషం.
ఇంగ్లండ్‌తో (1971- ఓవల్)
ఇంగ్లండ్ గడ్డపై భారత్ 39 ఏళ్ల తర్వాత తొలి టెస్టు విజయాన్ని అందుకుంది. భారత బౌలర్ బీఎస్ చంద్రశేఖర్ 8 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. బ్యాటింగ్‌లో సర్దేశాయ్, ఫరూఖ్ ఇంజినీర్ రాణించారు. 173 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ 7 వికెట్లు కోల్పోయి అందుకుంది. మూడు టెస్టుల ఈ సిరీస్‌ను కూడా 1-0తోనే భారత్ గెలుచుకుంది. రెండు సందర్భాల్లోనూ కెప్టెన్ అజిత్ వాడేకర్ కావడం విశేషం.
వెస్టిండీస్‌తో (1976- పోర్ట్ ఆఫ్ స్పెయిన్)
నాలుగో ఇన్నింగ్‌సలో 403 పరుగుల రికార్డు విజయలక్ష్యాన్ని సాధించి భారత్ టెస్టు గెలుచుకోవడం ఒక అద్భుతం. తొలి ఇన్నింగ్‌సలో 131 పరుగుల ఆధిక్యం సాధించిన విండీస్ రెండో ఇన్నింగ్‌సను డిక్లేర్ చేసి సవాల్ విసిరింది. అయితే ముగ్గురు విండీస్ స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొంటూ గవాస్కర్, విశ్వనాథ్ సెంచరీలు సాధించి జట్టుకు చారిత్రాత్మక విజయం అందించారు. ఈ మ్యాచ్ దెబ్బకే ఆ తర్వాత దశాబ్దాల పాటు విండీస్ నలుగురు పేసర్లతోనే ఆడింది.
ఆస్ట్రేలియాతో (1981-మెల్‌బోర్న్)
ఆస్ట్రేలియా విజయ లక్ష్యం 143 పరుగులు మాత్రమే. ఆసీస్ అలవోకగా మ్యాచ్ గెలుచుకుంటుందని అనిపించింది. గాయంతో బాధడుతూ కూడా బరిలోకి దిగిన కపిల్ నిప్పులు చెరిగాడు. 28 పరుగులకే 5 వికెట్లు... ప్రత్యర్థి 83 ఆలౌట్. తొలి ఇన్నింగ్‌స సెంచరీ హీరో విశ్వనాథ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయ్యాడు. ఎల్బీగా అవుటవడంతో నిరసన వ్యక్తం చేస్తూ గవాస్కర్ మ్యాచ్‌ను వదిలేసుకునేందుకు సిద్ధమైన వివాదాస్పద టెస్టు కూడా ఇదే.
ఆస్ట్రేలియాతో (1986-మద్రాస్)
టెస్టు చరిత్రలో ’టై’గా ముగిసిన రెండో టెస్టు ఇది. జోన్‌స డబుల్, బూన్, బోర్డర్ సెంచరీలతో ఆసీస్ హోరెత్తించగా, కపిల్ సెంచరీ చేసినా భారత్ 177 పరుగుల ఆధిక్యం కోల్పోరుుంది. రెండో ఇన్నింగ్‌సలో 348 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ గెలుపునకు చేరువ కాగా, ఆఖరి ఓవర్ ఐదో బంతికి మణీందర్ ఎల్బీగా అవుట్ కావడంతో సంచలన ఫలితం నమోదైంది. వరుసగా 100 టెస్టులు ఆడిన తొలి ఆటగాడిగా గవాస్కర్ ఘనత సాధించాడు.
ఇంగ్లండ్‌తో (2002-లీడ్‌స)
ఇంగ్లండ్ గడ్డపై భారత్ తొలి సారి ఇన్నింగ్‌స విజయం సాధించిన మ్యాచ్ ఇది. ఒకే ఇన్నింగ్‌సలో సచిన్, ద్రవిడ్, గంగూలీ సెంచరీలు చేసిన ఏకై క టెస్టు కూడా. స్వింగ్‌కు అనుకూలించే పిచ్‌పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సాహసం భారత్‌కు కలిసొచ్చింది. భారత బౌలర్లు చెలరేగడంతో రెండు ఇన్నింగ్‌సలలోనూ ఇంగ్లండ్ నిలబడలేకపోయింది. ఇదే టెస్టులో సెంచరీతో సచిన్ బ్రాడ్‌మన్ అత్యధిక సెంచరీల రికార్డు (29)ను అధిగమించాడు.
ఆస్ట్రేలియాతో (2001-కోల్‌కతా)
భారత క్రికెట్ దశ, దిశ మార్చిన అత్యద్భుత టెస్టు ఇది. తొలి ఇన్నింగ్‌సలో 274 పరుగులు వెనుకబడి ఫాలోఆన్ ఆడిన భారత్... చివరకు 171 పరుగులతో ఆసీస్‌ను చిత్తు చేసింది. ఆల్‌టైమ్ గ్రేట్ ఇన్నింగ్‌సతో వీవీఎస్ లక్ష్మణ్ (281), అండగా ద్రవిడ్ (180) కలిసి చేసిన 376 పరుగుల భాగస్వామ్యం జట్టు రాతను మార్చింది. హ్యాట్రిక్ సహా 13 వికెట్లతో భజ్జీ ప్రకంపనలు సృష్టించడంతో ఆస్ట్రేలియా వరుస విజయాల జోరుకు బ్రేక్ పడింది.
ఆస్ట్రేలియాతో (2003- అడిలైడ్)
సొంతగడ్డపై ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్‌సలో 556 పరుగులు చేసి కూడా ఓడుతుందంటే ఎవరైనా నమ్మగలరా. కానీ ఈ మ్యాచ్‌లో అదే జరిగింది. ద్రవిడ్ డబుల్, వీవీఎస్ సెంచరీతో భారత్ కూడా దీటుగా జవాబిచ్చింది. రెండో ఇన్నింగ్‌సలో అగార్కర్ (6/41) దెబ్బకు కుప్పకూలిన ఆసీస్ 230 పరుగుల లక్ష్యాన్ని విధించింది. మరోసారి చెలరేగిన ద్రవిడ్ జట్టును విజయతీరం చేర్చి సింహనాదం చేశాడు.
పాకిస్తాన్‌తో (2004- ముల్తాన్)
పాకిస్తాన్‌కు ఇది 300వ టెస్టు మ్యాచ్ అరుుతే సెహ్వాగ్ దెబ్బకు అదే అంకెను ప్రత్యర్థి మరోరకంగా గుర్తు పెట్టుకోవాల్సి వచ్చింది. భారత్ తరఫున తొలి ట్రిపుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా వీరూ చరిత్రకెక్కాడు. ఇన్నింగ్‌స తేడాతో నెగ్గిన భారత్ దాదాపు 50 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై తొలి సారి టెస్టు గెలిచింది. ఇదే టెస్టులో తన డబుల్ సెంచరీ పూర్తి కాకుండా కెప్టెన్ ద్రవిడ్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంపై సచిన్ బహిరంగంగా తన అసంతృప్తిని ప్రకటించాడు.
ఆస్ట్రేలియాతో (2008-పెర్త్)
వివాదాస్పద సిడ్నీ మంకీగేట్ ఉదంతం తర్వాత రగిలిపోతున్న భారత జట్టు ఈ టెస్టులో సర్వ శక్తులూ ఒడ్డింది. ఫాస్టెస్ట్ పిచ్‌లలో ఒకటైన వాకాలో నలుగురు ఆసీస్ పేసర్లను అడ్డుకొని సాధించిన విజయం చిరస్మరణీయం. ద్రవిడ్, సచిన్, లక్ష్మణ్‌ల కీలక ఇన్నింగ్‌సలతో పాటు పఠాన్ మెరుపు బౌలింగ్ జట్టుకు 72 పరుగుల విజయాన్ని అందించింది. ఇదే టెస్టులో ఇషాంత్ అద్భుత బౌలింగ్‌తో పాంటింగ్‌ను కట్టడి చేయడం ఎప్పటికీ మరచిపోలేనిది.