క్రికెట్ చరిత్రలో తొలిసారి..
కోల్కతా: ఇటీవల భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ముగిసిన మూడు వన్డేల సిరీస్ లో కొత్త చరిత్ర లిఖించబడింది. ఈ మూడు వన్డేల సిరీస్లో ఇరు జట్లు బ్యాటింగ్ లో సత్తాను చాటుకుంటూ పరుగుల దాహాన్ని తీర్చుకున్నాయి. మూడు వన్డేల సిరీస్లో ఆరు ఇన్నింగ్స్ల్లో మూడొందలకు పైగా పరుగులు నమోదు కావడం ఒకటైతే.. అత్యధిక పరుగుల రికార్డుకు తెరలేచింది. ఈ సిరీస్ లో మొత్తంగా ఇరు జట్లు నమోదు చేసిన స్కోరు 2090. ఇది మూడు వన్డేల సిరీస్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల రికార్డుగా నమోదైంది. అంతకుముందు 2007లో భారత్ లో జరిగిన ఆఫ్రికా-ఆసియా కప్లో 1892 పరుగులు నమోదయ్యాయి. ఇదే ఇప్పటివరకూ మూడు వన్డేల సిరీస్ల అత్యధిక పరుగుల రికార్డు కాగా, ఆ తరువాత 2009-10 సీజన్ లో దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్లో 1884 పరుగులు నమోదయ్యాయి.
ఈ సిరీస్లో రికార్డులు..
మూడు వన్డేల సిరీస్లో ఆరుసార్లూ మూడొందలకు పైగా స్కోర్లు లిఖించబడ్డాయి. కనీసం ఐదు మ్యాచ్లు ఆడిన ఒక ద్వైపాక్షిక సిరీస్ పరంగా చూస్తే ఇలా ఆరు సార్లు మూడొందలకు పైగా స్కోర్లు నమోదు కావడం ఇదే తొలిసారి.
144.09.. ఇది ఈ సిరీస్లో టీమిండియా ఆల్ రౌండర్ కేదర్ జాదవ్ స్ట్రైక్ రేట్. ఒక సిరీస్లో 150కు పైగా బంతులు ఆడిన భారత్ ఆటగాడు పరంగా ఇది మూడో అత్యుత్తమ స్ట్రైక్ రేట్. గతంలో వీరేంద్ర సెహ్వాగ్(150.25), రోహిత్ శర్మ(147.56)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
232.. ఈ సిరీస్లో జాదవ్ చేసిన పరుగులు. 77.33 సగటుతో 232 పరుగులు చేసి ఈ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ఈ సిరీస్ లో ఇంగ్లండ్ మూడు సార్లు మూడొందలకు పైగా స్కోర్లు సాధించింది. అంతకుముందు 2015లో న్యూజిలాండ్ తో జరిగిన స్వదేశీ సిరీస్లో ఇంగ్లండ్ నాలుగుసార్లు మూడొందల మార్కును దాటింది.
ఒక వన్డేలో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ హాఫ్ సెంచరీ చేయడంతో పాటు మూడు వికెట్లు తీయడం ఇప్పటివరకూ 15సార్లు జరిగింది. భారత్ తో చివరి వన్డేలో ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ హాఫ్ సెంచరీ తో పాటు మూడు వికెట్లు సాధించాడు. 2009 నుంచి చూస్తే ఇప్పటివరకూ ఇంగ్లండ్ మూడుసార్లు ఈ ఘనతను సాధించగా, స్టోక్స్ రెండు సార్లు ఆ ఘనతను సాధించాడు.