భారీ స్కోరు దిశగా ఇంగ్లండ్
కోల్కతా:భారత్ తో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 35.0 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఓపెనర్లు జాసన్ రాయ్(65;56 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్), బిల్లింగ్స్(35;58 బంతుల్లో 5 ఫోర్లు) శుభారంభం ఇచ్చారు. ఒకవైపు జాసన్ రాయ్ దూకుడుగా ఆడితే, మరొకవైపు బిల్లింగ్స్ మాత్రం నిలకడగా బ్యాటింగ్ చేశాడు. అయితే ఈ జోడి ప్రమాదకరంగా మరింత ప్రమాదకరంగా మారుతున్న సమయంలో బిల్లింగ్స్ ను తొలుత జడేజా పెవిలియన్ కు పంపాడు.
దాంతో వీరి 98 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం స్వల్ప వ్యవధిలో రాయ్ ను కూడా జడేజా అవుట్ చేయడంతో ఇంగ్లండ్ 110 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ దశలో బెయిర్ స్టో, మోర్గాన్లు ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. మోర్గాన్ 44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 43 పరుగులు చేసి మూడో వికెట్ గా అవుటయ్యాడు. స్టోతో కలిసి 84 పరుగుల్ని జత చేసిన మోర్గాన్..భారత బౌలర్ పాండ్యా బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ పటిష్ట స్థితిలో ఉండటంతో మరోసారి భారీ స్కోరు నమోదయ్యే అవకాశం ఉంది.