టీమిండియాకు భారీ లక్ష్యం
కోల్కతా: భారత్ తో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో ఇంగ్లండ్ 322 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లండ్ ఓపెనర్లు జాసన్ రాయ్(65;56 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్), బిల్లింగ్స్(35;58 బంతుల్లో 5 ఫోర్లు)కు తోడు మోర్గాన్(43;44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు), బెయిర్ స్టో(56;64 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), బెన్ స్టోక్స్(57 నాటౌట్;39 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు)లు రాణించడంతో ఆ జట్టు మరోసారి మూడొందల మార్కును చేరింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు తొలుత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ కు శుభారంభం లభించింది. ఇంగ్లండ్ ఓపెనర్లు జాసన్ రాయ్-బిల్లింగ్స్ లు చక్కటి పునాది వేశారు. ఈ జోడి 98 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి ఇంగ్లండ్ ను పటిష్ట స్థితిలో నిలిపింది.
ఆ తరువాత మోర్గాన్, బెయిర్ స్టోలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను నిలబెట్టగా, చివర్లో బెన్ స్టోక్స్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ఇంగ్లండ్ స్కోరును పరుగులు పెట్టించాడు. అతనికి జతగా వోక్స్(34;19 బంతుల్లో 4ఫోర్లు, 1 సిక్స్) బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేయడంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలోఎనిమిది వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది.
పాండ్యా విజృంభణ
గత రెండు వన్డేల్లో పెద్దగా ప్రభావం చూపని భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.. నామ మాత్రమైన చివరి వన్డేలో ఆకట్టుకున్నాడు. 10 ఓవర్ల బౌలింగ్ కోటాను పూర్తి చేసిన పాండ్యా 49 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. ప్రధానంగా బెయిర్ స్టో, మోర్గాన్, బట్లర్ వంటి స్టార్ ఆటగాళ్ల వికెట్లను పాండ్యా సాధించి సత్తా చాటుకున్నాడు. ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా పయనిస్తున్న సమయంలో పాండ్యా చక్కటి లైన్ లెంగ్త్ తో రాణించి భారత్ శిబిరంలో ఆనందం నింపాడు. అతనికి జతగా జడేజా రెండు వికెట్లు తీశాడు. ఓపెనర్లు జాసన్ రాయ్-బిల్లింగ్స్ వికెట్లను జడేజా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక భారత బౌలర్లలో బూమ్రా వికెట్ తీశాడు.