విరాట్ సేన ఏం చేస్తుందో?
కోల్కతా:ఇప్పటికే ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ ను గెలిచిన టీమిండియా.. నగరంలోని ఈడెన్ గార్డెన్ లో జరుగుతున్న చివరదైన మూడో వన్డేలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్పై పచ్చిక ఎక్కువగా ఉండటంతో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే ఇక్కడ కొన్ని గణాంకాలు మాత్రం తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు విజయం సాధించిన విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
గత చివరి నాలుగు మ్యాచ్ల ఫలితాలను పరిశీలిస్తే ఇక్కడ తొలుత బ్యాటింగ్ చేసిన జట్టే విజయం సాధించడంతో ఈ మ్యాచ్లో ఫలితంపై ఏమి అవుతుందా? అనే దానిపై ఆసక్తి నెలకొంది. టాస్ గెలిచిన వెంటనే విరాట్ కోహ్లి ఫీల్డింగ్ వైపు మొగ్గు చూపాడు. పుణెలో జరిగిన తొలి వన్డేలో టాస్ గెలిచిన కోహ్లి అండ్ గ్యాంగ్..ఇంగ్లండ్ విసిరిన భారీ లక్ష్యాన్ని సైతం ఛేదించి విజయం సాధించింది. ఈ సిరీస్ లో రెండో సారి విరాట్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో్ ఈ స్టేడియంలో ఫలితాలపై చర్చ మొదలైంది.
2014లో ఇక్కడ చివరిసారి శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ మ్యాచ్ లో భారత్ 404 పరుగుల్ని సాధించి 153 పరుగులతో విజయం సాధించింది. అంతకుముందు 2013 జనవరిలో ఈడెన్లో పాకిస్తాన్ తో భారత్ తలపడింది. ఆ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకుని 250 పరుగులు చేసింది. ఆ మ్యాచ్లో భారత్ 85 పరుగులతో గెలుపును సొంతం చేసుకుంది. 2011 అక్టోబర్లో ఇంగ్లండ్ తో జరిగిన వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 271 పరుగులు చేసి 95 పరుగులతో విజయం సాధించగా, అంతకుముందు 2011 వరల్డ్ కప్ లో భాగంగా మార్చిలో దక్షిణాఫ్రికా-ఐర్లాండ్ జట్ల మధ్య వన్డే జరిగింది.ఆ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 271 పరుగులు చేసి 131 పరుగుల తేడాతో గెలిచింది. ఇలా చివరి నాలుగు మ్యాచ్ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు గెలుపొందడంతో తాజా మ్యాచ్పై ఫలితం ఎలా ఉండబోతుంది అనేది దానిపై ఆసక్తి నెలకొంది. మరి విరాట్ సేన ఫలితాన్ని సవరిస్తుందా?లేదా?అనేది మరి కొద్ది సేపట్లో తేలిపోనుంది.