‘ఎ’ వన్డేలకు సర్వం సిద్ధం
ఈ నెల 23 నుంచి విజయవాడలో భారత్, కివీస్ పోరు
విజయవాడ స్పోర్ట్స్: భారత ‘ఎ’, న్యూజిలాండ్ ‘ఎ’ జట్ల మధ్య ఇక్కడి మూలపాడు మైదానంలో జరిగే రెండు అనధికారిక టెస్టు (నాలుగు రోజుల) మ్యాచ్‌ల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) కార్యదర్శి సీహెచ్ అరుణ్ కుమార్ తెలిపారు. దీంతో పాటు విశాఖపట్నంలో ఇరు జట్ల మధ్య జరిగే ఐదు వన్డేల సిరీస్‌కు సంబంధించిన వివరాలను కూడా బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. మూలపాడులోని గోకరాజు లైలా గంగరాజు ఏసీఏ క్రికెట్ కాంప్లెక్స్‌లో ఈ నెల 23 నుంచి 26 వరకు తొలి టెస్టు, సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు రెండో టెస్టు జరుగుతాయి. ఇటీవలే ఈ మైదానంలో భారత్, వెస్టిండీస్ మహిళా జట్ల మధ్య వన్డే, టి20 సిరీస్‌లు నిర్వహించారు.
అనంతరం విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీసీ–వీడీసీఏ స్టేడియంలో అక్టోబర్ 6, 8, 10, 13, 15 తేదీల్లో భారత్, కివీస్ ఐదు వన్డేల్లో తలపడతాయి. ఇరు జట్లు ఈ నెల 21న విజయవాడ చేరుకుంటాయి. పెద్ద సంఖ్యలో క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్‌లకు హాజరై విజయవంతం చేయాలని ఏసీఏ విజ్ఞప్తి చేసింది. రెండు టెస్టుల్లో తలపడే భారత జట్టుకు కరుణ్ నాయర్ నాయకత్వం వహిస్తుండగా... ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి, హైదరాబాద్ బౌలర్ సిరాజ్ ఈ జట్టులో ఉన్నారు. సమావేశంలో ఏసీఏ కోశాధికారి కె.రామచంద్ర రావు, సెంట్రల్ జోన్ కార్యదర్శి కోకా రమేశ్, మీడియా మేనేజర్ సీఆర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.