కెరీర్ ‘స్వింగ్’ అయింది! | Aamir excellent bowler | Sakshi
Sakshi News home page

కెరీర్ ‘స్వింగ్’ అయింది!

Published Sun, Feb 28 2016 11:21 PM | Last Updated on Sun, Sep 3 2017 6:37 PM

కెరీర్ ‘స్వింగ్’ అయింది!

కెరీర్ ‘స్వింగ్’ అయింది!

మళ్లీ దూసుకొచ్చిన ఆమిర్   చెలరేగుతున్న పాక్ పేసర్
భారత్‌పై సంచలన ప్రదర్శన   భవిష్యత్‌పై భరోసా

 
టీనేజ్ వయసులో పిల్లలు చేసే తప్పులను పెద్దలు క్షమించడం సహజం, ఇదీ అలాంటిదే. కాబట్టి అతనికి మరో అవకాశం ఇవ్వడం సరైనదే... ఆమిర్ పునరాగమనం చేసే అంశంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధికారి వ్యాఖ్య. క్రికెట్ పెద్దల ఆలోచన ఇలా ఉంది...అతను దేశాన్ని మోసం చేశాడు. అతడితో కలిసి ఆడటం మాకిష్టం లేదు. ఆమిర్ తప్పుకునే వరకు శిక్షణ శిబిరానికి మేం హాజరు కాలేం... సహచర ఆటగాళ్ల ఆగ్రహం. అతడు తమవాడు కాదని దూరంగా పెట్టే ప్రయత్నమిది...

ఆమిర్ అద్భుతమైన బౌలర్. నిషేధం లేకపోతే ప్రపంచ టాప్-3 బౌలర్లలో ఒకడిగా ఉండేవాడు. బౌలింగ్ చేస్తున్నప్పుడే అతడిని అభినందించేశాను... విరాట్ కోహ్లి స్వయంగా చేసిన ప్రశంస. ఒక వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మన్ గుర్తించిన ప్రతిభ ఇది...
 మొహమ్మద్ ఆమిర్ గురించి ప్రపంచం దృష్టిలో అందరికీ వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఆసియా కప్ టి20 టోర్నమెంట్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అతని బౌలింగ్ చూస్తే మద్దతుదారులు, విమర్శకులు, ప్రత్యర్థులు ముక్తకంఠంతో ఆహా అన్నారు. సూపర్ స్పెల్‌తో ఆమిర్ అందరికీ తన గతం గురించి కాకుండా ఆట మాత్రమే గుర్తుకు వచ్చేలా చేయడంలో సఫలమయ్యాడు. నిషేధం ముగిసిన తర్వాత ఇలాంటి పునరాగమనం నిజంగా అపూర్వం.

 
సాక్షి క్రీడా విభాగం  మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది క్రికెటర్లు ఆటకు దూరమయ్యారు. శిక్షకు గురైన వారిలో కొందరు మరో వేదిక మీద కనిపించకుండా మాయం కాగా... మరి కొందరు ఆ మచ్చను తొలగించుకోకుండానే పబ్లిక్ ఫిగర్లుగా బయటి ప్రపంచంలో చాలా మామూలుగా కలిసిపోయారు. ప్రపంచం మొత్తం దృష్టిలో దోషిగా కనిపిస్తున్నా...  ఫిక్సింగ్ చేశానని ఒప్పుకోకుండా తాము అమాయకులమేనని చెబుతూ వచ్చారు. కానీ మొహమ్మద్ ఆమిర్ విషయం అందరికంటే భిన్నం. ఫిక్సింగ్‌కు పాల్పడటం, దానిని ఒప్పుకుంటూ తప్పయిందని క్షమించమనడం, నిషేధంతో పాటు జైలు శిక్షాకాలం కూడా పూర్తి చేసుకొని బయటికి రావడం... ఆ వెంటనే క్రికెట్ ఆడి జాతీయ జట్టులోకి ఎంపిక కావడం నిజంగా అనూహ్యం. అన్నింటికి మించి ఏదో ఉన్నానంటే ఉన్నాను అనిపించుకోకుండా తనదైన ముద్ర వేయడం మరో విశేషం.

 ఒక్కో బంతి బుల్లెట్‌లా...
భారత్‌తో మ్యాచ్‌లో ఆమిర్ ఆట చూస్తే ఐదేళ్ల తర్వాత కూడా అతని బౌలింగ్‌లో పదును తగ్గలేదని అర్థమవుతుంది. నాలుగు ఓవర్లలో దాదాపు అన్ని బంతులు గంటకు 140 కిలో మీటర్ల వేగానికి తగ్గకుండా దూసుకుపోయాయి. తొలి బంతికి అదృష్టవశాత్తూ రోహిత్ శర్మ బతికిపోయినా ఆ యార్కర్ అతని బొటన వేలును చిదిమేసింది. అయితే లోపలికి దూసుకొచ్చిన రెండో బంతికి రోహిత్ వద్ద సమాధానం లేకపోయింది. తర్వాత ఇన్‌స్వింగర్‌కు అజింక్య రహానే బలి కాగా... ఆమిర్‌ను ఎదుర్కోవడం సురేశ్ రైనా వల్ల కాలేదు. మరికొద్ది సేపటికి అద్భుతమైన స్వింగ్‌కు కోహ్లి దాదాపుగా అవుటైనంత పనైంది. చివరి ఓవర్లో కోహ్లి రెండు ఫోర్లు కొట్టినా... ఆమిర్ నుంచి వచ్చిన మిగతా 13 బంతుల్లో 11 డాట్ బాల్స్ ఉండటం కోహ్లి ఎంత జాగ్రత్తగా ఆడాడో అర్థమవుతుంది. బహుశా ఈ కారణంగానే ఇలాంటి బౌలింగ్‌ను ఎదుర్కోవడం అద్భుతంగా ఉందంటూ కోహ్లి ప్రశంసించినట్లున్నాడు. భారత్‌తో తొలిసారి ఆడిన టి20 మ్యాచ్‌లోనే తన సత్తా చాటిన ఆమిర్‌లో ఆత్మవిశ్వాసం అమాంతంగా పెరిగిపోయిందనడంలో సందేహం లేదు.


ఆకాశం నుంచి పాతాళానికి...
చాలా మంది పాకిస్తాన్ బౌలర్లలాగా ఆమిర్‌ది కూడా సాధారణ నేపథ్యమే. ఏడుగురు సంతానంలో ఒకడు. తండ్రి చనిపోవడంతో చిన్న చిన్న పనులు చేస్తూ అన్నీ తానై తల్లే పెంచింది. క్రికెట్‌లో ఎలాంటి ప్రాథమిక శిక్షణ లేదు. వేరేవాళ్లని చూసి నేర్చుకున్న బౌలింగే. లాహోర్‌లో ఒక పేస్ క్యాంప్‌లో స్వయంగా వసీం అక్రం అతని ప్రతిభను గుర్తించడంతో ఆమిర్ దశ మారింది. అండర్-19లో ఆకట్టుకొని ఆ తర్వాత 17 ఏళ్ల వయసులోనే సీనియర్ జట్టులోకి వచ్చేశాడు. 14 టెస్టుల్లోనే 50 వికెట్లతో ఒక్కసారిగా ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. గంటకు 90 మైళ్ల వేగం, స్వింగ్, కచ్చితత్వంతో వన్డేలు, టి20ల్లోనూ పాక్ బౌలింగ్‌కు కొత్త ఆయుధంగా మారాడు. అయితే 2010 లార్డ్స్ టెస్టులో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి దొరికిపోవడంతో అతని ప్రపంచం కుప్పకూలిపోయింది. విచారణ అనంతరం ఐసీసీ ఐదేళ్ల నిషేధం ప్రకటించగా, కోర్టు ఆరు నెలల జైలు శిక్ష కూడా విధించింది.


 క్షమించండి...
ఫిక్సింగ్ చేసినట్లు అంగీకరించడమే ఆమిర్‌కు మేలు చేసింది. పేదరిక నేపథ్యం, నిరక్షరాస్యతతో పాటు చిన్న వయసులోనే ప్రలోభం కారణంగా తాను తప్పు చేశానని, క్షమించాలని తన దేశ ప్రజలకు, అభిమానులకు పదే పదే విజ్ఞప్తి చేశాడు. అతని విషయంలో జాలి, సానుభూతి ఒకింత గట్టిగానే పని చేశాయి. జైలు నుంచి మూడు నెలలకే విడుదలయ్యాడు. నిషేధం గత ఏడాది సెప్టెంబర్ 1తో ముగిసింది. అయితే అప్పటికే ఆమిర్‌కు అన్ని వైపుల నుంచి మద్దతు పెరిగింది. రమీజ్ రాజాలాంటి మాజీలు కొందరు వ్యతిరేకించినా ఎక్కువ మంది టీనేజర్‌గా చేసిన తప్పుకు మరో అవకాశం ఇవ్వాలనే కోరారు. లాబీయింగ్ సామర్థ్యం లేకపోయినా... ఆమిర్ విషయంలో పాక్ క్రికెట్ బోర్డు గట్టిగానే అండగా నిలిచింది. దాంతో పాక్ దేశవాళీ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన అతను, ఆ తర్వాత బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడాడు. ఇక ఆ తర్వాత న్యూజిలాండ్‌తో రెండు వన్డేలలో 5 వికెట్లు తీసి తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ఈ సిరీస్‌కు ముందు తనతో కలిసి ఆడేందుకు మొహమ్మద్ హఫీజ్, అజహర్ అలీ నిరాకరించగా... వద్దంటే వెళ్లిపోతానని, అయితే సానుభూతితో క్షమించాలని వ్యక్తిగతంగా కలిసి వేడుకోవడంతో అతని గతానికి ఫుల్‌స్టాప్ పడింది. ఇక ముందు ఆమిర్ ‘ఫిక్సింగ్’ వ్యవహారం అంతా చరిత్ర. మున్ముందు అతని ఆట మాత్రమే అందరికీ కనిపిస్తుంది. ఇంకా 24 ఏళ్ల వయసే ఉన్న ఆమిర్ ఇదే జోరు కొనసాగిస్తే భవిష్యత్తులో మరో అగ్రశ్రేణి బౌలర్‌గా తనకంటూ ప్రత్యేక అధ్యాయం సృష్టించుకోగలడు.
 
  నా జీవితంలో రెండో అవకాశం దక్కడం నిజంగా చాలా అదృష్టం. ఇది నాకు పునర్జన్మలాంటిది. ఇక క్రికెట్‌లోకి తిరిగి రాలేనని భావించి ఆటను దాదాపుగా వదిలేశాను. అయితే సన్నిహితులు నాలో నమ్మకం పెంచారు. ఐదేళ్ల తర్వాత కూడా రాగలిగానంటే ఎంతో మంది సహకారం ఉంది. నా చర్యలతో ఎంతో మందిని మోసం చేశాను. అయితే అందరికీ క్షమాపణ చెప్పా.  ఇక ముందు వారి నమ్మకాన్ని నిలబెడతా. జీవితంలో చాలా నేర్చుకున్నాను. నా దృక్పథం మారింది. డబ్బే ముఖ్యం కాదని తెలిసింది. ఒక మంచి బౌలర్‌గా మిగిలిపోవాలనేదే నా కోరిక.   -మొహమ్మద్ ఆమిర్, పాక్ పేస్ బౌలర్

Related News By Category

Related News By Tags

Advertisement