విజయ్ అవుట్.. ముకుంద్, నాయర్ ఇన్
బెంగళూరు: తమిళనాడు బ్యాట్స్‌మన్ అభినవ్ ముకుంద్‌కు దాదాపు ఐదున్నరేళ్ల విరామం తర్వాత భారత టెస్టు జట్టులో ఆడే అవకాశం వచ్చింది. ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు టీమిండియా తుది జట్టులో రెండు మార్పులు చేశారు. తొలిటెస్టులో గాయపడ్డ ఓపెనర్ మురళీ విజయ్‌ను పక్కనబెట్టి, అతని స్థానంలో ముకుంద్‌ను తీసుకున్నారు. ఇక జయంత్ యాదవ్‌ను తప్పించి ఎక్స్ట్రా బ్యాట్స్‌మన్‌గా ట్రిపుల్ సెంచరీ హీరో కరుణ్ నాయర్‌కు తుది జట్టులో స్థానం కల్పించారు. ఈ రెండు మార్పులు మినహా తొలి టెస్టులో ఆడిన ఆటగాళ్లు రెండో టెస్టులో బరిలో దిగారు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమిస్తోన్న రెండో టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. లోకేష్ రాహుల్, ముకుంద్ బ్యాటింగ్‌కు దిగారు. పుణెలో ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టులో విరాట్ కోహ్లీ సేన ఘోరపరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పుంజుకుని విజయం సాధించాలని టీమిండియా పట్టుదలతో ఉంది.