'చెత్త' పిచ్ పై విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
బెంగళూరు: వివాదాస్పదమైన పుణే పిచ్ పై టీమిండియా ఆటగాడు మురళీ విజయ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. వాస్తవానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చెప్పినట్లుగా ఎంసీఏ (పుణే టెస్ట్) పిచ్ చెత్త పిచ్ కాదని, అది చాలా చాలెంజింగ్ పిచ్ అని అభిప్రాయపడ్డాడు. బోర్డర్-గవాస్కర్ సిరీస్ లో ఆస్ట్రేలియాతో పుణేలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 333 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఏది ఏమైతేనేం తమ జట్టు 105, 107 పరుగులకే ఆలౌట్ అయిన విషయాన్ని అంగీకరించక తప్పదన్నాడు. ఫ్లాట్ వికెట్లపై ఆడేకంటే ఇలాంటి పిచ్ లపై టెస్టులు ఆడాల్సి ఉంటుందని, అప్పుడే ఆటగాళ్ల టెక్నిక్స్, లోపాలు లాంటివి బయటపడే ఛాన్స్ ఎక్కువ అని తెలిపాడు.
'పుణే టెస్టులో ఆసీస్ బౌలర్లు అద్బుతంగా రాణించారు. తొలి ఇన్నింగ్స్ తోనే ఆసీస్ ఆధిక్యంలోకి వచ్చింది. ఆపై రెండో ఇన్నింగ్స్ తర్వాత భారీ లక్ష్యం ముందుండటం, ముఖ్యంగా ఆసీస్ బౌలర్ ఓకీఫ్ 12 వికెట్లతో చెలరేగడంతో భారత్ ఓటమిపాలైంది. తొలి టెస్టు తప్పిదాలను గుర్తించాం. రెండో టెస్టులో వాటిని ఎలా అధిగమించాలన్న దానిపై కోచ్, కెప్టెన్ సహా జట్టు దృష్టి పెట్టింది. నెక్ట్స్ మ్యాచ్ లో రాణించేందుకు తమ జట్టు శాయశక్తులా కృషిచేస్తుందని' టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్ చెప్పుకొచ్చాడు. రెండో టెస్టు మార్చి 4న బెంగళూరు చిన్నస్వామి స్డేడియంలో జరుగుతుంది.