మురళీ’ గానం | murli vijay Grand century in second test match | Sakshi
Sakshi News home page

మురళీ’ గానం

Published Thu, Dec 18 2014 12:25 AM | Last Updated on Sat, Sep 2 2017 6:20 PM

మురళీ’ గానం

మురళీ’ గానం

విజయ్ అద్భుత సెంచరీ
 భారత్ 311/4
 రాణించిన రహానే
 తొలి రోజు టీమిండియాదే
 ఆస్ట్రేలియాతో రెండో టెస్టు
 
 సుమారు 38 డిగ్రీల ఉష్ణోగ్రత... దానికి తోడు తీవ్ర ఉక్కపోత... ఆస్ట్రేలియాలో ఇలాంటి పరిస్థితులు అరుదు. గాబా మైదానంలో మాత్రం ఇదే కనిపించింది. దీన్ని తట్టుకోలేక ఆసీస్ బౌలర్లు ఒక్కొక్కరు పక్కకు తప్పుకుంటూ మంచు ముక్కలను ఆశ్రయించారు. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రిస్బేన్‌ను చూస్తే చెన్నై గుర్తుకొచ్చింది.
 
 సరిగ్గా ఇలాంటి వాతావరణంలోనే విజయ్ బౌండరీల మోత మోగించాడు. తాను కూడా సొంత మైదానం చెన్నైలో ఆడుతున్నట్లే భావించినట్లున్నాడు. అందుకే అతను ఎక్కడా జోరు తగ్గించలేదు. ఐదున్నర గంటలకుపైగా క్రీజ్‌లో గడిపినా నీరసపడిపోలేదు.
 
అద్భుతమైన ఆటతీరుతో చిరస్మరణీయ  ఇన్నింగ్స్ ఆడి సత్తా చాటాడు. రెండో టెస్టులో తొలిరోజు మూడు సెషన్లలో రెండున్నర సెషన్లలో మనదే ఆధిపత్యం. అనుభవలేమికి తోడు అలసిపోయినట్లు కనిపించిన ప్రత్యర్థి బౌలింగ్‌ను అనుకూలంగా మార్చుకుంటూ మన బ్యాట్స్‌మెన్ చెలరేగారు. రెండో రోజు కూడా ఇదే ఊపును కొనసాగిస్తే ధోని సేనకు మ్యాచ్‌పై పట్టు చిక్కినట్లే.
 
 బ్రిస్బేన్: తొలి టెస్టు పరాజయం నుంచి కోలుకున్న భారత జట్టు రెండో టెస్టులో స్ఫూర్తిదాయక ఆటతీరు కనబర్చింది. ఆస్ట్రేలియాతో బుధవారం ఇక్కడి గాబా మైదానంలో ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 311 పరుగులు సాధించింది.

ఓపెనర్ మురళీ విజయ్ (213 బంతుల్లో 144; 22 ఫోర్లు) కెరీర్‌లో ఐదో సెంచరీతో జట్టును ముందుండి నడిపించాడు. అజింక్య రహానే (122 బంతుల్లో 75 బ్యాటింగ్; 7 ఫోర్లు) అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 124 పరుగులు జోడించడం విశేషం. పేస్, బౌన్స్ అంటూ హడలగొట్టిన వికెట్‌పై భారత బ్యాట్స్‌మెన్ అలవోకగా ఆడుతూ పాడుతూ సాధికారిక షాట్లతో ఆకట్టుకున్నారు. రోజంతా తీవ్రంగా శ్రమించినా, ఆసీస్ బౌలర్లు నాలుగు వికెట్లు మాత్రమే తీయగలిగారు. ప్రస్తుతం రహానేతో పాటు రోహిత్ శర్మ (26 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు.
 
 స్కోరు వివరాలు
 భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ (సి) హాడిన్ (బి) లయోన్ 144; ధావన్ (సి) హాడిన్ (బి) మిషెల్ మార్ష్ 24; పుజారా (సి) హాడిన్ (బి) హాజల్‌వుడ్ 18; కోహ్లి (సి) హాడిన్ (బి) హాజల్‌వుడ్ 19; రహానే (బ్యాటింగ్) 75; రోహిత్ (బ్యాటింగ్) 26; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (83 ఓవర్లలో 4 వికెట్లకు) 311
 
 వికెట్ల పతనం: 1-56; 2-100; 3-137; 4-261.
 బౌలింగ్: జాన్సన్ 15-2-64-0; హాజల్‌వుడ్ 15.2-5-44-2; స్టార్క్ 14-1-56-0; మిషెల్ మార్ష్ 6-1-14-1; లయోన్ 20-1-87-1; వాట్సన్ 10.4-5-29-0; వార్నర్ 1-0-9-0; స్మిత్ 1-0-4-0.
 
 ఆసీస్ గడ్డపై సెంచరీ సాధించడం ఎంతో ఆనందకరం. ఈ రోజు నిజంగా చాలా వేడిగా ఉంది. అందరూ అలసిపోవడం నేను చూశాను. దేశానికి ఆడేటప్పుడు ఇలాంటివి పట్టించుకోవద్దు. అందుకే క్రీజ్‌లో నిలబడాలని పట్టుదలగా ఉన్నాను. పరిస్థితులు ఎలా ఉన్నా మన వికెట్ విలువ ఎక్కువ. నేను నా ఫిట్‌నెస్‌పై కూడా చాలా శ్రద్ధ వహిస్తాను కాబట్టి ఇబ్బంది ఎదురు కాలేదు.                  
-విజయ్
 

ఆమ్లెట్ వేసేశారు!
‘ఎండ ఎంత ఎక్కువగా ఉందంటే కోడి గుడ్డు తెచ్చి పెడితే ఆమ్లెట్ అయిపోతుంది..’ చాలా సందర్భాల్లో మనం మాటవరసకు ఇలా అనేస్తాం. అయితే టెస్టు సిరీస్ ప్రసారకర్త చానెల్-9 కేవలం మాటలతో ఆగిపోలేదు. సరదాగానో, నిజంగానో ఎండ తీవ్రత తెలియాలని ప్రయత్నమో గానీ ఆమ్లెట్ వ్యాఖ్యను అమల్లో పెట్టేసింది. బ్రిస్బేన్‌లో మధ్యాహ్నం విరామం సమయంలో చానెల్ రిపోర్టర్ సాంప్సన్ ‘ప్యాన్’తో సిద్ధమైపోయింది. బౌండరీ బయట దానిని పెట్టి పగలగొట్టిన గుడ్డును ఉంచింది. కొద్ది సేపటికే అది కాస్తా ఫ్రై అయి ఆమ్లెట్‌గా మారిపోయింది! చూశారా... ఎంత ఎండ ఉందో, మరి ఆటగాళ్ల పరిస్థితి ఏమిటో అంటూ వ్యాఖ్యానంతో ముగించింది. నిజమే... వేడితోనే కాదు, విజయ్ ఆటతోనూ ఆసీస్ ఆటగాళ్లంతా తొలి రోజు ‘ఫ్రై’ అయ్యారనేది వాస్తవం.
 
 సెషన్-1     విజయ్ నిలకడ
 తొలి టెస్టు నుంచి మూడు మార్పులతో భారత్ బరిలోకి దిగింది. ధోని, అశ్విన్‌లు తుది జట్టులోకి రాగా, షమీ స్థానంలో ఉమేశ్‌కు అవకాశం దక్కింది. ఓపెనర్లు విజయ్, ధావన్ (39 బంతుల్లో 24) నియంత్రణతో ఆడి చెప్పుకోదగ్గ ఆరంభాన్ని అందించారు. 2011 లార్డ్స్ టెస్టు తర్వాత విదేశీ గడ్డపై తొలిసారి మన ఓపెనింగ్ జోడి 50కుపైగా పరుగులు జత చేసింది. అయితే ధావన్‌ను అవుట్ చేసి మిషెల్ మార్ష్ భారత్‌ను దెబ్బ తీశాడు. అతనికి ఇదే తొలి వికెట్ కావడం విశేషం. మరోవైపు 32 పరుగుల వద్ద జాన్సన్ బౌలింగ్‌లో గల్లీలో షాన్ మార్ష్ క్యాచ్ వదిలేయడంతో విజయ్ బతికిపోయాడు.
 ఓవర్లు: 25, పరుగులు: 89, వికెట్లు: 1
 
 సెషన్-2     ఆసీస్ ఆధిపత్యం
లంచ్ తర్వాత మాత్రం భారత బ్యాటింగ్ కాస్త తడబాటుకు గురైంది. విజయ్ ఒక్కసారిగా నెమ్మదించగా, జట్టు మరో రెండు వికెట్లు కోల్పోయింది. అంపైర్ ఇయాన్ గౌల్డ్ తప్పుడు నిర్ణయంతో పుజారా (18) బలయ్యాడు. హాజల్‌వుడ్ బౌలింగ్‌లో హెల్మెట్‌ను తాకి కీపర్ వద్దకు చేరిన బంతికి అతను వెనుదిరిగాడు. హాజల్‌వుడ్‌కు ఇదే తొలి వికెట్. ఆ తర్వాత అతను అద్భుత బంతితో కోహ్లి (19)ని అవుట్ చేశాడు. అంతకుముందు మరోసారి విజయ్‌కు అదృష్టం కలిసొచ్చింది. 68 పరుగుల వద్ద స్టార్క్ తన బౌలింగ్‌లోనే కష్టసాధ్యమైన రిటర్న్ క్యాచ్‌ను అందుకోవడంలో విఫలమయ్యాడు.
 ఓవర్లు: 27, పరుగులు: 62, వికెట్లు: 2
 
 
 సెషన్-3     ఆకట్టుకున్న రహానే
 చివరి సెషన్‌లో మాత్రం టీమిండియా ఒక్కసారిగా దూకుడు కనబర్చింది. ప్రతీ ఆసీస్ బౌలర్‌ను సమర్థంగా ఎదుర్కొన్న విజయ్, రహానే అలవోకగా పరుగులు సాధించారు. రెగ్యులర్, పార్ట్ టైమ్ బౌలర్లు ఎవరూ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టలేకపోయారు. ఈ క్రమంలో 175 బంతుల్లో విజయ్ సెంచరీ పూర్తయింది. ఆ వెంటనే జాన్సన్ బౌలింగ్‌లో మార్ష్ మరోసారి క్యాచ్ వదిలేయడం అతనికి కలిసొచ్చింది. రహానే కూడా 85 బంతుల్లో అర్ధ సెంచరీ అందుకున్నాడు. సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడిన విజయ్, ఎట్టకేలకు లయోన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. ఆసీస్ కొత్త బంతి తీసుకున్నా రహానే, రోహిత్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఈ సెషన్‌లో భారత్ 5.16 రన్‌రేట్‌తో పరుగులు చేయడం విశేషం.
 ఓవర్లు: 31, పరుగులు: 160, వికెట్లు: 1
 
 పాపం స్మిత్...
 కెప్టెన్‌గా తొలి టెస్టు ఆడుతున్న స్టీవెన్ స్మిత్‌కు మొదటి రోజు ఏదీ కలిసి రాలేదు. ఆటలో అతని ప్రణాళికలు, వ్యూహాలు విఫలం కాగా... ఇతరత్రా అన్నీ అతనికి వ్యతిరేకంగానే సాగాయి. తీవ్రమైన ఎండ ఆ జట్టు బౌలర్లపై ప్రభావం చూపించింది.
 
 దాంతో వారు ఐస్ క్యూబ్‌లు నెత్తిన పెట్టి ప్రతీ 40 నిమిషాలకు ఐస్‌క్రీమ్‌లతో చల్లబడే ప్రయత్నం చేశారు. మైదానంలో వేడి వారి బౌలింగ్‌లో వేడిని కూడా తగ్గించింది! ఎండకు నీరసించిపోయి స్టార్క్ చాలా సేపు మైదానం వదిలి వెళ్లాడు. మిషెల్ స్టార్క్ తొడ కండరాల గాయంతో నిష్ర్కమించాడు. ఈ టెస్టులో అతను బౌలింగ్ చేసే అవకాశం లేదు.

 
 తొలి టెస్టు ఆడుతున్నాడు... 23 ఏళ్ల కుర్రాడు కదా అనుకుంటే హాజల్‌వుడ్ కూడా కండరాలు పట్టేయడంతో మధ్యలోనే బౌలింగ్ వదిలేశాడు. జట్టుతో సంబంధం లేని బయటివాళ్లు ముగ్గురిని కూడా సబ్‌స్టిట్యూట్‌లుగా వాడుకోవాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థమవుతుంది. మార్ష్ ఒక్కడే రెండు క్యాచ్‌లు వదిలేయగా... షార్ట్ లెగ్‌లో రోహిత్ కొట్టిన షాట్ రోజర్స్ హెల్మెట్‌కు తాకడంతో డాక్టర్ పరుగెత్తుకు రావాల్సి వచ్చింది. ఇక ఈ అన్ని కారణాలతో అదనంగా అర గంట ఇచ్చినా ఆ జట్టు ఏడు ఓవర్లు తక్కువగా వేయడం ఓవర్‌రేట్ పరిస్థితిని సూచిస్తోంది. ఇలాంటి రోజు మళ్లీ తన కెప్టెన్సీలో ఎన్నడూ రావద్దని స్మిత్ కోరుకున్నాడేమో!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement