
న్యూఢిల్లీ: జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నిర్వహించే డోపింగ్ పరీక్షలకు భారత క్రికెటర్లు కూడా హాజరయ్యేలా చూడాలని ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) భారత ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌కు ‘వాడా’ నేరుగా లేఖ రాసింది. లేదంటే తాము ‘నాడా’ గుర్తింపును రద్దు చేస్తామని కూడా హెచ్చరించింది. ఇదే విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి కూడా తెలియజేసిన ‘వాడా’, డోపింగ్ పరీక్షల విషయంలో బీసీసీఐని తగిన విధంగా ఆదేశించాలంటూ ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసింది.
దేశంలోని అన్ని క్రీడాంశాల్లో పాల్గొనే ఆటగాళ్లకు డోపింగ్ పరీక్షలు నిర్వహించే అధికారం ‘నాడా’కు మాత్రమే ఉంది. అయితే ఎప్పుడంటే అప్పుడు పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుందంటూ ఇందులోని ఒక నిబంధనను భారత క్రికెటర్లు వ్యతిరేకిస్తున్నారు. బీసీసీఐ ‘నాడా’కు దూరంగా ఉండి ఒక ప్రైవేట్ డోపింగ్ ఏజెన్సీతో తమ పరీక్షలు నిర్వహించుకుంటోంది.