సాక్షి, హైదరాబాద్: ఆర్‌బీఐ ఇంటర్ ఇన్‌స్టిట్యూషన్ క్యారమ్స్ చాంపియన్‌షిప్‌లో ఆదిత్య, అపూర్వ విజేతలుగా నిలిచారు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆదిత్య (వీ10) 25-8, 25-17తో హకీమ్ (బీఎస్‌ఎన్‌ఎల్)పై విజయం సాధించగా... మహిళల ఫైనల్లో అపూర్వ (ఎల్‌ఐసీ) 25-10, 25-8తో తేజస్వి (ఆక్సెంచర్)ను ఓడించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో ఆదిత్య 13-14, 19-2, 25-6తో సూర్యప్రకాశ్‌పై, హకీమ్ 25-0, 25-12తో శివానంద రెడ్డిపై గెలుపొందారు.
మహిళల సెమీస్‌లో అపూర్వ 18-4, 29-24, 25-14తో సవితా దేవిపై, తేజస్వి 19-6, 25-0తో నేహారెడ్డిపై పైచేయి సాధించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఇన్‌చార్జి జనరల్ మేనేజర్ ఆర్.గోవిందరావు, బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ అజిత్, హెచ్‌ఆర్‌ఎండీ జనరల్ మేనేజర్ పి.కె.రౌత్, ఆర్‌బీఐ స్పోర్ట్స్ క్లబ్ ఉపాధ్యక్షులు సుధాకర్, కార్యదర్శి మనోజ్ కులకర్ణి పాల్గొన్నారు.