28 ఏళ్ల తర్వాత...
♦ కోపా అమెరికా కప్ ఫైనల్లో చిలీ
♦ సెమీస్‌లో పెరూపై 2-1తో గెలుపు
సాంటియాగో : వచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకున్న చిలీ జట్టు... 28 ఏళ్ల తర్వాత కోపా అమెరికా కప్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో చిలీ 2-1తో పెరూపై విజయం సాధించింది. ఎడ్యురాడో వెర్గాస్ (42వ, 64వ నిమిషాల్లో) చిలీకి రెండు గోల్స్ అందించగా, గ్యారీ మెడెల్ (60వ ని.) పెరూ తరఫున ఏకైక గోల్ చేశాడు. 1987 తర్వాత టైటిల్ పోరుకు అర్హత సాధించడం చిలీకి ఇదే మొదటిసారి. గోల్స్ కోసం ఇరుజట్లు హోరాహోరీగా తలపడినా... రెండో అర్ధభాగంలో చిలీ కౌంటర్ అటాకింగ్‌తో ఆకట్టుకుంది.
42వ నిమిషంలో గోల్ పోస్ట్ సమీపం నుంచి వెర్గాస్ కొట్టిన బంతి కాస్త ఆఫ్‌సైడ్ దిశగా వెళ్లినా... రిఫరీ గోల్‌గా ప్రకటించడం కాస్త వివాదాస్పదమైంది. మొరటుగా ఆడిన కార్లోస్ జాంబ్రానో ఆట మొదలైన 20 నిమిషాల తర్వాత మ్యాచ్‌కు దూరం కావడంతో పెరూ 10 మందితోనే ఆడింది. అయినప్పటికీ ఫార్వర్డ్స్ సమయోచితంగా దాడులు చేసి స్కోరును సమం చేశారు. అయితే 64వ నిమిషంలో ఓ మామూలు బంతిని మిడ్‌ఫీల్డ్ నుంచి అందుకున్న వెర్గాస్ డ్రిబ్లింగ్ చేస్తూ 30 గజాల నుంచి నేరుగా గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. ఆ తర్వాత స్కోరును సమం చేసేందుకు పెరూ ఒకటి, రెండు షాట్లు కొట్టినా... లక్ష్యాన్ని చేరలేకపోయాయి.