చాంపియన్ చిలీ | Chile beat Argentina to win first Copa crown | Sakshi
Sakshi News home page

చాంపియన్ చిలీ

Jul 6 2015 12:22 AM | Updated on Sep 3 2017 4:57 AM

చాంపియన్ చిలీ

చాంపియన్ చిలీ

ఒకటా... రెండా... ఏకంగా 99 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ చిలీ జట్టు తొలిసారి ‘కోపా అమెరికా కప్’ టైటిల్‌ను సొంతం చేసుకుంది...

- తొలిసారి ‘కోపా అమెరికా కప్’ సొంతం
- ఫైనల్లో అర్జెంటీనాపై విజయం  
- మెస్సీ బృందానికి మళ్లీ నిరాశ
సాంటియాగో (చిలీ):
ఒకటా... రెండా... ఏకంగా 99 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ చిలీ జట్టు తొలిసారి ‘కోపా అమెరికా కప్’ టైటిల్‌ను సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో చిలీ ‘పెనాల్టీ షూటౌట్’లో 4-1 గోల్స్ తేడాతో అర్జెంటీనా జట్టుపై సంచలన విజయం సాధించింది. ఈ ఓటమితో అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ మరోసారి మెగా ఈవెంట్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతేడాది ప్రపంచకప్‌లోనూ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు రన్నరప్‌గా నిలిచింది.
 
టైటిలే లక్ష్యంతో ఈ టోర్నీలో బరిలోకి దిగిన అర్జెంటీనా తుది మెట్టుపై బోల్తా పడింది. దూకుడుగా ఫైనల్‌ను ఆరంభించిన చిలీ ఆ తర్వాత జోరు తగ్గించింది. స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీని నిలువరించడమే లక్ష్యంతో చిలీ ఆటతీరు సాగింది. మెస్సీ వెనుక ఇద్దరు లేదా ముగ్గురు ఆటగాళ్లను పెట్టి అతని కదలికలకు బ్రేక్ వేసింది. నిర్ణీత సమయంలోపు రెండు జట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. ఆ తర్వాత అదనంగా మరో అరగంట ఆడించినా ఫలితం లేకపోయింది. దాంతో విజేతను నిర్ణయించడానికి పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది.

షూటౌట్‌లో చిలీ తరఫున వరుసగా ఫెర్నాండెజ్, విడాల్, అరాన్‌గుయెజ్, అలెక్సిస్ శాంచెజ్ గోల్స్ చేయగా... అర్జెంటీనాకు మెస్సీ మాత్రమే గోల్ సాధించగా.. హిగుయెన్, బనెగా విఫలమవ్వడంతో చిలీ విజయం ఖాయమైంది. హిగుయెన్ షాట్ గోల్‌పోస్ట్‌పై నుంచి బయటకు వెళ్లగా... బనెగా షాట్‌ను చిలీ గోల్‌కీపర్ క్లాడియో బ్రావో నిలువరించాడు.

- కోపా అమెరికా కప్ చరిత్రలో అర్జెంటీనాపై చిలీకిదే తొలి విజయం. ఫైనల్‌కు ముందు గతంలో అర్జెంటీనాతో తలపడిన 24 మ్యాచ్‌ల్లో చిలీ ఐదింటిని ‘డ్రా’ చేసుకొని, మిగతా 19 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
- మూడో ప్రయత్నంలో చిలీ జట్టు కోపా అమెరికా కప్ విజేతగా అవతరించింది. గతంలో ఈ జట్టు 1979, 1987లలో ఫైనల్‌కు చేరినా రన్నరప్‌తో సరిపెట్టుకుంది.



- విజేతగా చిలీ జట్టుకు 40 లక్షల డాలర్లు (రూ. 25 కోట్ల 37 లక్షలు), రన్నరప్ అర్జెంటీనాకు 30 లక్షల డాలర్లు (రూ. 19 కోట్లు), మూడో స్థానం పొందిన పెరూ జట్టుకు 20 లక్షల డాలర్లు (రూ.12 కోట్ల 68 లక్షలు), నాలుగో స్థానంలో నిలిచిన పరాగ్వేకు 10 లక్షల డాలర్లు (రూ. 6కోట్ల34లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
- ఆతిథ్య దేశం హోదాలో ‘కోపా అమెరికా కప్’ నెగ్గిన ఏడో జట్టుగా చిలీ నిలిచింది. గతంలో ఉరుగ్వే, బ్రెజిల్, అర్జెంటీనా, పెరూ, బొలి వియా, కొలంబియా ఈ ఘనత సాధించాయి.
- వచ్చే ఏడాదితో కోపా అమెరికా కప్‌కు వందేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో అమెరికాలో ‘సెంటినరీ టోర్నీ’ని నిర్వహిస్తారు. 2019 కోపా అమెరికా కప్‌కు బ్రెజిల్, 2023 టోర్నీకి ఈక్వెడార్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement