అయ్యో... అర్జెంటీనా
♦ చివరి నిమిషంలో గోల్ సమర్పణ
♦ పరాగ్వేతో మ్యాచ్ ‘డ్రా’
♦ కోపా అమెరికా కప్
లా సెరినా (చిలీ) : రెండు దశాబ్దాలుగా ఊరిస్తున్న కోపా అమెరికా కప్‌ను ఈసారి గెల్చుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన అర్జెంటీనా జట్టుకు తొలి మ్యాచ్ ఫలితం నిరాశను కలిగించింది. విజయంతో బోణీ చేస్తుందని భావించిన ఆ జట్టు నిర్లక్ష్య ఆటతీరుతో ‘డ్రా’తో సరిపెట్టుకుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున పరాగ్వేతో జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌ను అర్జెంటీనా జట్టు 2-2 గోల్స్‌తో ‘డ్రా’గా ముగించింది. ఈ ఫలితంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా జట్టు మ్యాచ్ చివరి నిమిషంలో గోల్ సమర్పించుకోవడం గమనార్హం.
ఏడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసిన అర్జెంటీనా విరామ సమయానికి 2-0తో ముందంజలో ఉంది. ఆట 29వ నిమిషంలో సెర్గియో అగుయెరో... 36వ నిమిషంలో లియోనెల్ మెస్సీ ఒక్కో గోల్ చేసి అర్జెంటీనాకు 2-0 ఆధిక్యాన్ని అందించారు. అయితే రెండో అర్ధభాగంలో పరాగ్వే చక్కటి పోరాటపటిమ కనబరిచి అర్జెంటీనా దూకుడుకు కళ్లెం వేసింది. 60వ నిమిషంలో నెల్సన్ వాల్దెజ్ పరాగ్వేకు తొలి గోల్ అందించగా... 90వ నిమిషంలో లుకాస్ బారియోస్ రెండో గోల్ చేసి స్కోరును సమం చేసి అర్జెంటీనా విజయావకాశాలపై నీళ్లు చల్లాడు. మరోవైపు ఇదే గ్రూప్‌లోని మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఉరుగ్వే 1-0తో జమైకాపై గెలిచింది. ఆట 52వ నిమిషంలో రోడ్రిగ్వెజ్ గోల్ చేసి ఉరుగ్వేను గెలిపించాడు.