
కోహ్లీ దూకుడుపై అఫ్రిది కామెంట్స్..
మీర్పూర్: దాయాది భారత్ పైనేకాక ఆతిథ్య బంగ్లాదేశ్ చేతిలో ఓడి కనీసం ఆసియా కప్ ఫైనల్స్ కు కూడా చేరుకోలేకపోయిన పాకిస్థాన్.. మార్చి 8 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ ను సవాలుగా తీసుకుంది. తమ సన్నాహాలపై ఆ జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిది శనివారం మీడియాతో మాట్లాడారు. గత టీ20 వరల్డ్ కప్ అనుభవాలతోపాటు భారత ఆటగాళ్ల గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు..
ప్రశ్న: రాబోయే టీ20 ప్రపంచకప్ కు సన్నాహాలెలా కొనసాగుతున్నాయి?
అఫ్రిది: ఆసియా కప్ లో మేం ఘోరమైన తప్పులు చేశాం. బ్యాట్లు ఝుళిపించడంలో మావాళ్లు విఫలమయ్యారు. ఆరంభంలోనే వికెట్లు కోల్పోతే విజయం సాధించడం కష్టమవుతుంది. అయితే బౌలింగ్ దళం, మిడిల్ ఆర్డర్ మెరుగ్గా ఆడింది. బంగ్లాదేశ్, ఇండియాతో జరిగిన మ్యాచ్ ల్లో ఆ విషయం స్పష్టంగా కనపడింది. టీ20 ప్రపంచకప్ ఫేవరెట్ జట్లలో మేమూ ఒకరం. అయితే ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లు కూడా మా గ్రూప్ లోనే ఉన్నాయి. అంటే తదుపరి రౌండ్ కు చేరుకోవటానికి మేం చాలా కష్టపడాల్సిఉందన్నమాట.
ఆమిర్ పునరాగమనం జట్టుకు బలం చేకూర్చినట్టుంది?
అఫ్రిది: కచ్చితంగా. ఆసియా కప్ లో ఆమిర్ అదరగొట్టాడు. ప్రతి బంతిని మనసు, బుద్ధిని కలగలిపి విసిరాడు. ఒక కెప్టెన్ గా అంతకుమించి అతణ్ని నేనేమీ అడగలేను. నిజానికి ఆమిర్ పై తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఫిక్సింగ్ ఆరోపణలను ఎదుర్కొనిమరీ జట్టులోకి వచ్చి రాణించడం అంత సులువైనపనేకాదు. అయితే సెలెక్టర్లు ఆమిర్ పై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయలేదతను.
ఇండో- పాక్ పోరులో మొదట్లో మీదే పై చేయి. కానీ ఇటీవల భారత్ పై నెగ్గలేకపోతున్నారు?
అఫ్రిది: కీలకమైన సందర్భాల్లో భారత్ తన ఆటతీరును మెరుగుపర్చుకుంది. అదే పనిని మేం చెయ్యలేకపోయాం. చివరి మ్యాచ్ లోనే చూడండి.. పిచ్ ను అర్థం చేసుకోవటంలో మేం విఫలమయ్యాం. తప్పులమీద తప్పులు చేశారం. దాంతో ఓటమిపాలయ్యాం. డిఫెండ్ చేసుకోగలిగే స్కోర్ లేనప్పుడు బౌలర్లు మాత్రం ఏం చేస్తారు?
ఇప్పుడో కీలక ప్రశ్న.. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ మధ్య పోలికలేంటి?
అఫ్రిది: నేను ఇదివరకు చెప్పా. సచిన్ ది ఒకరితో పోల్చుచూసే స్థాయికాదు. కోట్ల మందికి అతను ఆదర్శం. ఇండియాలోనేకాక ప్రపంచదేశాల్లోనూ ఆయనకు వేలమంది అభిమానులున్నారు. విరాట్ కోహ్లీ ఛాంపియన్ ప్లేయర్ అనటంలో సందేహంలేదు. అతని దూకుడు స్వభావం ఆటలో కలిసొచ్చేఅంశం. ప్రపంచంలో బెస్ట్ హిట్టర్స్ లో కోహ్లీ కూడా ఒకడు. తమదైన రోజున కోహ్లీ లాంటి ఆటగాళ్లను నిలువరించడం ఎవ్వరితరంకాదు.