రహానే ప్రపంచ రికార్డు
గాలె: టీమిండియా బ్యాట్స్ మన్ అజింక్య రహానే టెస్టు క్రికెట్ చరిత్రలో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఒక్క మ్యాచ్ లో 8 క్యాచ్ లు పట్టిన ఫస్ట్ ఫీల్డర్ గా రికార్డు కెక్కాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో అతడీ ఘనత సాధించాడు. అమిత్ మిశ్రా బౌలింగ్ లో రంగణ హీరాత్ క్యాచ్ పట్టడంతో అతడికి ఈ ఖ్యాతి దక్కింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 3, సెకండ్ ఇన్నింగ్స్ లో 5 క్యాచ్ లు అందుకున్నాడు.
యజువీంద్ర సింగ్(ఇండియా), గ్రెగ్ చాపెల్(ఆస్ట్రేలియా), తిలకరత్నె(శ్రీలంక), స్టీఫెన్ ఫ్లెమ్మింగ్(న్యూజిలాండ్), మాథ్యూ హేడన్(ఆస్ట్రేలియా) లను వెనక్కు నెట్టి అగ్రస్థానంలో నిలిచాడు. వీరంతా ఒక్కో మ్యాచ్ లో ఏడేసి క్యాచ్ లు పట్టారు. 1977లో స్వాతంత్ర్య దినోత్సవం తర్వాత జరిగిన టెస్టులో యుజువీంద్ర 7 క్యాచ్ లు పట్టాడు. రహానే ఇండిపెండెన్స్ డే కు ఒక్క రోజు ముందు రికార్డు తిరగరాయడం విశేషం.
ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఒక్క మ్యాచ్ లో అత్యధిక క్యాచ్ లు పట్టిన రికార్డు వేలీ హమ్మండ్ పేరిట ఉంది. 1928లో జరిగిన మ్యాచ్ లో అతడు 10 క్యాచ్ లు పట్టాడు. ఇంగ్లండ్ వికెట్ కీపర్ జాక్ రసెల్(1995), దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ ఏబీ డివిలియర్స్(2013)లో ఒక్క టెస్టు మ్యాచ్ లో అత్యధికంగా 11 అవుట్లు చేశారు.