యయో టస్ట్.. ప్రతికాత్మక చిత్రం
న్యూఢిల్లీ : ఆటగాళ్ల ఫిట్‌నెస్‌కు ప్రామాణికంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి( బీసీసీఐ) తీసుకొచ్చిన యోయో టెస్ట్‌ను భారత మాజీ క్రికెటర్లు మహ్మద్ అజారుద్దీన్, ఆకాశ్ చోప్రా, దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌లు తప్పుబట్టారు. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన అంబటి రాయుడు, సంజూ శాంసన్‌లతో పాటు టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీలు యోయో టెస్ట్‌లో విఫలమవడంతో భారత జట్టులో స్థానం కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి యోయో టెస్ట్ చర్చనీయాంశమైంది. ఈ అంశంపై ఇండియా టుడే చానెల్ నిర్వహించిన చర్చాకార్యక్రమంలో ఈ మాజీ క్రికెటర్లు పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు.
ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘ఒకవేళ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ పరీక్ష ఫెయిలైతే.. అతడ్ని జట్టులో నుంచి తొలగిస్తారా అని ప్రశ్నించారు?. ఈ పద్దతితో మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లను జట్టులో నుంచి తీసేయడం సరికాదు. మీరు కోహ్లిని ఆడించాలనుకున్నారు కాబట్టి అతనికి రెండు వారాలు విశ్రాంతి ఇచ్చి యో యో టెస్టు నిర్వహించారు. మిగతా ఆటగాళ్ల పట్ల అలాగే వ్యవహరించాలి ’అని తెలిపాడు.
యోయో అవసరం లేదు..
అసలు క్రికెటర్లకు యోయో అవసరం లేదని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు.. ‘యో యో టెస్టు ఓ కొత్త డ్రామా. అసలు ఈ పరీక్ష క్రికెటర్లకు అవసరమే లేదు. ఫుట్‌బాల్, హాకీ ఆటగాళ్లకు ఇది అవసరం. వారు మైదానం అంతా పరిగెడుతూ ఉండాలి. కాబట్టి పూర్తి ఫిట్‌నెస్‌గా ఉండాలి. క్రికెట్‌లో అలా కాదు. ఈ పద్దతితో ఫామ్‌లో ఉన్న రాయుడు జట్టులో స్థానం కోల్పోయాడు. జట్టును ఎంపిక చేసేందుకు యో యో టెస్టు ప్రామాణికంగా ఉండాల్సినవసరం లేదు. ఆటగాడి ఫామ్, ప్రతిభ.. ఈ రెండే ముఖ్యమైనవి’ అని భజ్జీ తెలిపాడు.
దిగ్గజ ఆటగాళ్లే ఫెయిలయ్యారు..
ఒక వేళ కోచ్ ఎంపికకు కూడా ఇదే ప్రామాణికంగా తీసుకుంటే రవిశాస్త్రి ఈ పరీక్ష ఎప్పటికి నెగ్గలేడని అజారుద్దీన్ తెలిపాడు. ‘గతంలో ఈ పరీక్షలో ఎంతో మంది భారత దిగ్గజ ఆటగాళ్లు ఫెయిలయ్యారు. ఒక్కో ఆటగాడికి ఒక్కో విధంగా ఫిట్‌నెస్ లెవల్స్ ఉంటాయి. నేను ఇప్పటికీ ఫిట్‌గానే ఉన్నాను. కానీ, నా పాదాలను అందుకోమంటే నేను అందుకోలేను. కానీ మైదానంలో నా వద్దకు బంతి వచ్చినప్పుడు నా శక్తినంతటినీ సమకూర్చుకుని ఆడుతాను. సునీల్ గావస్కర్ కూడా యోయో ఫెయిలైనవాడే. యో యో ఫెయిలైతే జట్టులో చోటు దక్కదన్న విషయాన్ని ఆటగాడికి ముందుగానే చెప్పాలి. జట్టు ఎంపిక చేసిన తర్వాత వారికి టెస్టు నిర్వహించి ఆ తర్వాత ఫెయిలయ్యాడని తప్పించడం పద్దతి కాదు. రవిశాస్త్రికి కూడా ఇదే పరీక్ష పెడితే.. ఆయన ఎప్పటికి ఈ టెస్ట్ నెగ్గలేడు’ అని అజార్ అభిప్రాయపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment