సాక్షి క్రీడావిభాగం : టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఆరో స్థానం, సెంచరీల్లో టాప్–10లో చోటు, విరామం లేకుండా వరుసగా 158 టెస్టులు ఆడిన క్రమశిక్షణ, భారత గడ్డపై, ఆస్ట్రేలియాలో కూడా ఒకే సిరీస్‌లో మూడేసి సెంచరీలు చేసిన అరుదైన ప్రదర్శన, ఎంతో మంది గొప్ప సారథులకు సాధ్యం కాని రీతిలో భారత్‌లో చారిత్రాత్మక సిరీస్ విజయం... తన ప్రొఫైల్‌లో ఇలాంటి ఘనతలు ఎన్నో ఉన్నా అలిస్టర్ కుక్‌కు ‘స్టార్ క్రికెటర్’గా గుర్తింపు మాత్రం దక్కలేదు. చిన్న విషయాలకే హోరెత్తిపోయే ఇంగ్లండ్ మీడియా అతను ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా గూచ్‌ను అధిగమించినప్పుడు కూడా పెద్దగా సందడి చేయలేదు. గంటలకొద్దీ ఏకాగ్రతతో క్రీజ్‌లో పాతుకుపోవడం, అలసట అనేదే కనిపించకుండా సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడుతూ పోవడం తప్ప ఏ దశలోనూ పెద్దగా మెరుపులు కనిపించని ‘చెఫ్’ పాతతరం బ్యాటింగ్ ఆధునిక యుగంలో రికార్డులు అందించిందే తప్ప అలరించలేకపోవడం కూడా ఒక కారణం. వ్యక్తిగతంగా కూడా అందరినీ ఆకర్షించే తత్వం లేకపోవడంతో పాటు మాటకారి కాకపోవడం కూడా పరుగుల వరద పారించిన తర్వాత కుక్‌ను వెనకే ఉండిపోయేలా చేశాయి. అయితే ఇలాంటి వాటికంటే కేవలం తన ఆట, పట్టుదలతోనే అతను గొప్ప క్రికెటర్‌గా ఎదగడం విశేషం.
టెస్టుల్లో కుక్ అరంగేట్రం అనూహ్యంగా జరిగింది. 2006లో భారత్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైన ట్రెస్కోథిక్ వ్యక్తిగత కారణాలతో చివరి నిమిషంలో తప్పుకోవడంతో కుక్‌కు ఓపెనర్‌గా పిలుపు వచ్చింది. ఆ సమయంలో ఎక్కడో వెస్టిండీస్‌లో ఉన్న అతను సుదూర ప్రయాణం చేసి తొలి టెస్టు బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్‌లో 60, 104 పరుగులతో తన రాకను ఘనంగా చాటాడు. ఆ తర్వాత ఎన్నో అత్యుత్తమ ప్రదర్శనలు కుక్ బ్యాట్ నుంచి జాలువారాయి. ఏడాదికి వేయి చొప్పున 12 ఏళ్ల కెరీర్‌లో 12 వేలకు పైగా పరుగులతో అతను ఇంగ్లండ్ క్రికెట్‌కు మూలస్థంభంలా నిలిచాడు. ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి కోల్‌కతాలో భారత్‌పై చేసిన 190, సిడ్నీలో ఆస్ట్రేలియాపై 189, లార్డ్స్‌లో న్యూజిలాండ్‌పై 162, గాలేలో శ్రీలంకపై 118, డర్బన్‌లో దక్షిణాఫ్రికాపై చేసిన 118 పరుగులు కుక్ కెరీర్‌లో ఆణిముత్యాలు. ఏకంగా 766 పరుగులు సాధించి 24 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై యాషెస్ సిరీస్ (2010–11)ను గెలిపించడం బ్యాట్స్‌మన్‌గా కుక్ కెరీర్‌లో మధుర ఘట్టం.
కెప్టెన్‌గా 2012లో భారత గడ్డపై 2–1తో సిరీస్‌ను సాధించడం కుక్ నాయకత్వంలో అత్యుత్తమ క్షణం కాగా... 2013–14 యాషెస్‌లో 0–5తో చిత్తుగా ఓడటం చేదు జ్ఞాపకం. సరిగ్గా 2015 వన్డే వరల్డ్ కప్‌కు ముందు ఇంగ్లండ్ సెలక్టర్లు కుక్‌ను కెప్టెన్సీతో పాటు ఆటగాడిగా కూడా తప్పించి అతని పరిమితులను గుర్తు చేయగా... 2016లో భారత్‌లో సిరీస్ కోల్పోవడంతో కుక్ టెస్టు కెప్టెన్సీ పోయింది. ఇప్పుడు భారత్‌తో సిరీస్‌లోనే విఫలమై ఆటకు కూడా అతను దూరమవుతున్నా డు. గత డిసెంబర్‌లో యాషెస్ సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్‌లో అజేయంగా 244 పరుగులు చేసిన అనంతరం ఫామ్ కోల్పోయిన ‘కుకీ’ మరో 9 టెస్టులకే రిటైర్ కావాల్సి రావడం దురదృష్టకరం. ఓపెనర్‌గానే 10 వేలకు పైగా పరుగులు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా క్రికెట్ ప్రపంచం కుక్‌ను చిరకాలం గుర్తుంచుకుంటుంది.
‘మాస్టర్ చెఫ్’...
Published Tue, Sep 4 2018 1:04 AM | Last Updated on Tue, Sep 4 2018 1:04 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment