పాకిస్తాన్ను చుట్టేశారు..
మాంచెస్టర్: నాలుగు టెస్టు సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ విలవిల్లాడుతోంది. ఇంగ్లండ్ బౌలర్ల దెబ్బకు పాక్ పేకపేడలా కుప్పకూలి ఫాల్ ఆన్ ప్రమాదాన్ని కొనితెచ్చుకుంది. 57/4 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం మూడో రోజు మొదటి ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ 198 పరుగులకే చాపచుట్టేసింది. పాక్ ఆటగాళ్లలో కెప్టెన్ మిస్బావుల్ హక్(52;114 బంతుల్లో 4 ఫోర్లు) మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. అతనికి వహాబ్ రియాజ్(39) సహకారం అందించడంతో పాక్ 150పరుగుల మార్కును దాటగల్గింది.
ఓ దశలో 119 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన పాక్ జట్టుకు ఈ జోడీ ఆదుకుంది. వీరిద్దరూ తొమ్మిదో వికెట్కు 60 పరుగులు జత చేసిన అనంతరం మిస్బా వెనుదిరిగాడు. అయితే రియాజ్ మాత్రం ఇంగ్లిష్ బౌలర్లను కాస్త ప్రతి ఘటించడంతో చివరి వికెట్ పడటానికి ఆలస్యమైంది. పాక్ ఇన్నింగ్స్లో ఆరుగురు సింగిల్ డిజిట్కే పరిమితమై తీవ్రంగా నిరాశపరిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ నాలుగు వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాసించగా, స్టోక్స్, మొయిన్ అలీకి చెరో రెండు వికెట్లు, అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ లకు తలో వికెట్ దక్కింది. అంతకుముందు ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్ ను 589/8 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ జట్టులో జో రూట్(254), కెప్టెన్ అలెస్టర్ కుక్(105) రాణించడంతో ఆ జట్టు భారీ స్కోరు నమోదు చేసింది.