సాక్షి : టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మన్, కెప్టెన్ విరాట్ కోహ్లీ దూకుడు చూస్తుంటే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డును అందుకునేందుకు ఎంతో కాలం పట్టేలా కనిపించటం లేదు. అయితే కోహ్లీ రికార్డులపైనే కన్నేసిన ఓ క్రికెటర్ మాత్రం అతని కంటే ముందుగా ఆ పని చేస్తాడా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. సౌతాఫ్రికా జట్టు ఓపెనర్ హషీమ్ ఆమ్లా, మరో రికార్డును నెలకొల్పాడు. వన్డేల్లో కోహ్లి సాధించిన 26 సెంచరీల రికార్డును.. ఆమ్లా తక్కువ మ్యాచ్‌ల్లోనే అధిగమించటం విశేషం.
ఆదివారం బంగ్లాదేశ్‌తో డైమండ్ ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఆమ్లా ఈ ఫీట్‌ను సాధించాడు. కోహ్లి 166 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధిస్తే... ఆమ్లా కేవలం 154 మ్యాచ్‌ల్లోనే ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆమ్లాకు కోహ్లి రికార్డులను బద్ధలు కొట్టడం కొత్తేం కాదు. గతంలో కోహ్లి 7 వేల పరుగుల ఘనతను కూడా అతితక్కువ మ్యాచ్‌ల్లోనే ఆమ్లా సాధించాడు. ఆమ్లా 150 ఇన్నింగ్స్, కోహ్లి 169 ఇన్నింగ్స్‌లతో ఆ ఘనత అందుకున్నారు. సౌతాఫ్రికా జట్టు తరపున అత్యంత వేగం పరుగులు సాధిస్తున్న క్రీడాకారుడిగా ఆమ్లా రికార్డుకెక్కాడు. అయితే ఆమ్లా తన కన్నా వయసులో పెద్దవాడు కావటం.. ఎక్కువ కాలం కెరీర్‌ను కొనసాగించే అవకాశాలు లేకపోవటంతో భవిష్యత్తులో కోహ్లి హవా కొనసాగొచ్చనే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక బంగ్లాతోనే జరిగిన మ్యాచ్‌లోనే మరికొన్ని రికార్డులు నమోదయ్యాయి. వికెట్ కోల్పోకుండా 279 పరుగుల లక్ష్యాన్ని చేధించి వన్డేల్లో అత్యధిక ఓపెనింగ్ సాధించిన బ్యాట్స్‌మెన్‌గా మూడో స్థానంలో ఆమ్లా-డి కాక్ నిలిచారు. బంగ్లా తరపున సౌతాఫ్రికాపై తొలి సెంచరీ సాధించిన ఆటగాడిగా ముషిఫికర్ రహీమ్ చరిత్ర సృష్టించాడు.
Comments
Please login to add a commentAdd a comment