
ICC WC 2023- Australia vs South Africa- Quinton De Kock: వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా పలు అరుదైన ఘనతలు సాధించాడు. లక్నో వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ప్రొటిస్ జట్టుకు క్వింటన్ డికాక్ సెంచరీతో శుభారంభం అందించాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 29.5వ ఓవర్లో ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో సిక్సర్ బాది వంద పరుగులు చేసుకున్నాడు.
వరుసగా రెండో సెంచరీ
ప్రపంచకప్-2023లో వరుసగా రెండోసారి సెంచరీ సాధించి.. అంతర్జాతీయ వన్డేల్లో 19వ శతకం నమోదు చేశాడు. ఈ సందర్భంగా.. వరల్డ్‌కప్ హిస్టరీలో అత్యధిక సెంచరీలు సాధించిన దక్షిణాఫ్రికా క్రికెటర్ల జాబితాలో చోటు సంపాదించాడు.
దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్(4) తర్వాత ఈ ఘనత సాధించిన హషీం ఆమ్లా(2), ఫాఫ్ డుప్లెసిస్(2), హర్షల్ గిబ్స్(2)లతో సంయుక్తంగా రెండోస్థానంలో నిలిచాడు.
రెండో ప్రొటిస్ బ్యాటర్‌గా
అదే విధంగా సౌతాఫ్రికా తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన రెండో ఓపెనర్‌గా చరిత్రకెక్కాడు. ఈ ఎలైట్ లిస్టులో హషీం ఆమ్లా 27 శతకాలతో అగ్రస్థానంలో ఉండగా.. 19 సెంచరీలతో డికాక్ అతడి తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. ఈ క్రమంలో హర్షల్ గిబ్స్(18)ను అధిగమించాడు.
గిబ్స్ అరుదైన రికార్డు బ్రేక్
అంతేగాక వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా మీద అత్యధిక వ్యక్తిగత స్కోరు(109) సాధించిన తొలి సౌతాఫ్రికా బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో హర్షల్ గిబ్స్(1999లో- 101 పరుగులు) రికార్డును బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో 100 పరుగులతో ఫాఫ్ డుప్లెసిస్(2019) మూడో స్థానంలో ఉన్నాడు.
కాగా ఆసీస్ మీద ఓవరాల్‌గా డికాక్‌కు ఇది మూడో శతకం. ఇక సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో 35వ ఓవర్ ఐదో బంతికి ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ డికాక్‌ను బౌల్డ్ చేయడంతో అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక ఈ మ్యాచ్లో ఎయిడెన్ మార్కరమ్ అర్ధ శతకంతో రాణించగా నిర్ణీత 50 ఓవర్లలో సౌతాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 311 పరుగులు సాధించింది.
చదవండి: WC 2011లో నేనే కెప్టెన్ అయి ఉంటే అతడిని తప్పక తీసుకునేవాడిని.. కానీ!