సొంతగడ్డపై ఆఖరి వన్డే.. డికాక్ భావోద్వేగం (PC: X)
SA Vs Aus 5th ODI- Quinton de Kock gets emotional: సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. సొంతగడ్డపై ఆఖరి వన్డే ఆడుతున్న ఈ లెఫ్టాండర్ శరీరం సహకరించని కారణంగానే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత తాను అంతర్జాతీయ వన్డేలకు వీడ్కోలు పలుకనున్నట్లు డికాక్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
డికాక్ కంట నీటిచెమ్మ
ఆస్ట్రేలియాతో సిరీస్ స్వదేశంలో ఆఖరిదని పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఆసీస్‌తో ఐదో వన్డే ఆరంభానికి ముందు డికాక్ తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో అతడి కళ్లు చెమర్చిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
30 ఏళ్లకే ఎందుకిలా?
కాగా స్టార్ బ్యాటర్‌గా పేరొందిన డికాక్ ఇప్పటికే టెస్టులకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వన్డేల నుంచి కూడా తప్పుకొంటున్నాడు. 30 ఏళ్ల వయసులోనే డికాక్ ఇలా రిటైర్మెంట్ ప్రకటించడం అభిమానులను నిరాశ పరిచింది.
సిగ్గుపడాల్సిందేమీ లేదు
ఈ నేపథ్యంలో క్వింటన్ డికాక్ ఈసీఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘నా టెస్టు కెరీర్ ముగిసిన సమయంలో ఇలాంటి భావన కలిగింది. మళ్లీ ఇప్పుడు కూడా! టెస్టుల్లో ఆడాలని శక్తిమేర ప్రయత్నించాను. కానీ నా వల్ల కాలేదు.
50 టెస్టులు ఆడిన తర్వాత రిటైర్మెంట్ అవడం సరైందేనా అని నా సన్నిహితులను అడిగాను. ఇతర ఫార్మాట్లపై దృష్టి పెట్టడం కోసం ఇలా చేయడానికి ఏమాత్రం సిగ్గుపడాల్సిన అవసరం లేదని చెప్పారు.
శరీరం 40 ఏళ్లు అంటోది.. 20 ఏళ్ల వాడిలా నటిస్తున్నా
గత 10-11 ఏళ్లలో ఎన్నో మధుర జ్ఞాపకాలు మూటగట్టుకున్నాను. నా శరీరమేమో నాకు 40 ఏళ్లని చెబుతోంది.. కానీ ఐడీ మాత్రం నాకింకా 31 ఏళ్లే అని చూపిస్తోంది.. మానసికంగా నేను 20 ఏళ్లవాడిలా నటించేందుకు ఇప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాను’’ అని ఉద్వేగానికి లోనయ్యాడు.
అబుదాబి టూర్ మొదలు ఇండియాలో టెస్టులు.. ముఖ్యంగా శ్రీలంక పర్యటనలో అనుభవాల గురించి డికాక్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు. కాగా టీ20 లీగ్‌లలో ఆడటం ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని.. అందుకే తాను కూడా పొట్టి ఫార్మాట్‌పైనే దృష్టి సారించాలనుకున్నానని డికాక్ పేర్కొన్నాడు.
అవును.. ఎక్కవ డబ్బులు వస్తాయి.. కానీ
జాతీయ జట్టును విజయపథంలో నిలిపే క్రమంలో మాత్రం ఎప్పుడూ తాను వెనకడుగు వేయలేదని ఈ లెఫ్టాండర్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఒకవేళ కేవలం డబ్బు గురించే ఆలోచించి ఉంటే ఐదేళ్ల క్రితమే రిటైర్ అయ్యేవాడినని పేర్కొన్నాడు. కాగా ఆసీస్‌తో ఐదో వన్డేలో క్వింటన్ డికాక్ నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. సొంతగడ్డపై ఆఖరి వన్డేలో 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.
న్యూజిలాండ్‌తో సిరీస్ సందర్భంగా అరంగేట్రం
2012లో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా డికాక్ సౌతాఫ్రికా తరఫున అరంగేట్రం చేశాడు. ఆ మరుసటి ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. 2014లో టెస్టుల్లోనూ అడుగుపెట్టాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో క్వింటన్ డికాక్.. టెస్టుల్లో 3300, వన్డేల్లో 6176, టీ20లలో 2907 పరుగులు సాధించాడు.
చదవండి: WC 2023: ఫిట్‌గా ఉన్నా శ్రేయస్ అయ్యర్‌కు నో ఛాన్స్! ఇక మర్చిపోవాల్సిందేనా?
Comments
Please login to add a commentAdd a comment